( మార్చి 16- శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి )
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు చిరస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. పొట్టి శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి, నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా నిర్వచించుకునేవారు. ఆయనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదు. అయితే ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఆయన దాని నిర్మాణం కోసమే రాజకీయ ప్రవేశం చేశారు. 1952 సెప్టెంబరు 15వ తేదీన శ్రీరాములు నెల్లూరు నుంచి భాగవతుల లక్ష్మీనారాయణకు ఒక లేఖ రాశారు. అందులో అధికారంలో ఉన్న మహానాయకుల దృష్టి మార్చాలంటే నిష్కామ దృష్టితో, ద్వేష రహితంగా, నిశ్చింతగా ప్రాణాలర్పించడమే ఏకైక మార్గంగా కనిపిస్తోందని రాసుకొచ్చారు.
పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరు 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష ప్రారంభించారు. మొదటి రోజు 53 కేజీలు ఉన్న శ్రీరాములు శరీర బరువు 10వ రోజుకి 48 కేజీలకు, 26వ రోజుకి 45 కేజీలకు, 43వ రోజు 42 కేజీలకు చివరిగా 58వ రోజు 38 కేజీలకు పడిపోయింది. అవయవాలు శుష్కించి, మనిషి కృశించి, శరీరంలోని ఆమ్లాలు, రక్తం, మూత్రం మొదలైన వ్యర్థాలు ఎగదన్నుకుని నోట్లోంచి వచ్చేవి. ఆయన నరకయాతన అనుభవించారు. అయినా వజ్ర సంకల్పంతో దీక్షను కొనసాగించారు. అలా 58వ రోజున అంటే 15 డిసెంబరు 1952న ఆయన ప్రాణాలు వదిలారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసల కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీరాములు అంతిమయాత్ర డిసెంబరు 16వ తేదీన రెండెడ్ల బండి మీద కట్టిన రథంపై జరిగింది. కన్యకాపరమేశ్వరి దేవస్థానంవారు నిర్మించిన మాళైలోని ఆర్యవైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి.
పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పై అప్పట్లో చాలా మంది మండిపడ్డారు. నెహ్రూ తలచుకుంటే శ్రీరాముల ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేదని, 58 రోజులు ఉపవాసం చేసినా నెహ్రూలో కదలిక పుట్టలేదని, ఆయన ఇంకొంత కాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని, ప్రజలను కూడా పోగొట్టుకుంటారని ప్రకాశం పంతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి శ్రీరాములును దీక్ష విరమించాలని ప్రకృతి వైద్యులు రామకృష్ణరాజు దీక్ష 50వ రోజున కోరారు. నెహ్రూ ప్రకటన చేయనున్నారని అంతా అనుకుంటున్నారని శ్రీరాములుకి చెప్పారు. అది విన్న ఆయన నెహ్రూ విషయంలో తనకు నమ్మకం లేదని శ్రీరాములు అన్నారని “హిస్టరీ ఆఫ్ ది ఆంధ్ర మూవ్మెంట్” గ్రంథ రచయిత జీవీ సుబ్బారావు పేర్కొన్నారు.
పొట్టిశ్రీరాములు ప్రస్తుత చెన్నైలోని జార్జిటౌన్, అన్నాపిళ్ళై వీధిలోని 163వ నంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గురవయ్య, తల్లి పేరు మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్‌లో డిప్లమో చేశారు. రైల్వేస్‌లో ప్లంబర్‌గా ఉద్యోగం చేశారు. 1928లో శిశువుకి జన్మనిచ్చి భార్య మరణించగా, కొద్ది రోజుల్లోనే ఆ శిశువు, ఆ తర్వాత కొద్దికాలానికి శ్రీరాములు మాతృమూర్తి మరణించారు. అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ అనుమతితో 1930 ఏప్రిల్‌లో సబర్మతి ఆశ్రమంలో చేరారు. వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహారు వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు అందించారు. అనంతరం నెల్లూరులో హరిజనులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు ఐదుసార్లు నిరాహార దీక్షలు చేశారు. మొత్తంగా, శ్రీరాములు బలిదానం తర్వాత అంతిమంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
పొట్టిశ్రీరాములు బలిదానంతో ఆంధ్ర రాష్ట్రమే కాదు ఆయన ప్రాణ త్యాగం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉత్ర్పేరకంగా నిలిచింది. అందుకే, భారతదేశం భౌగోళిక చిత్రంలో అనేక మార్పులకి కారణమంటూ పొట్టి శ్రీరాములుని ప్రపంచ చరిత్రకారులు “GERARDUS MERCATOR OF INDIA”గా కీర్తించారు. అమరజీవి ఆలోచనల్ని పాశ్చాత్య, వలసవాద భావాలతో నిండిన జవహర్లాల్ నెహ్రూ అందుకోలేకపోయారని ఆండ్రే బెటెయ్ వంటి సోషియాలజిస్టులు విశ్లేషించారు. ఏదిఏమైనా నికార్సైన సత్యాగ్రహి, పీడిత ప్రజల పక్షపాతి, సమాజ సేవకుడు, అసలైన గాంధేయవాది అన్నింటికి మించి గొప్ప దేశభక్తుడైన శ్రీరాములు జీవితం నేటి తరానికి గొప్ప ఆదర్శం.