శబరిమల అయ్యప్ప భక్తులకు గొప్ప శుభవార్త.. ఆలయంలో దర్శనం కోసం మార్గాన్ని మార్చాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) నిర్ణయించింది. దీని ద్వారా భక్తులు సన్నిధానం వద్ద పవిత్రమైన 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. మార్చి 15 నుండి నెలవారీ పూజ సమయంలో ఈ మార్పు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా అమలు చేయనున్నట్టుగా టిడిబి అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే, తదుపరి మండలం-మకరవిళక్కు సీజన్లో ఈ మార్పు శాశ్వతంగా అమలు చేయబడుతుందని ప్రశాంత్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప ప్రసాదాల ధరలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు. నేరుగా 18 మెట్లను ఎక్కడానికి అవకాశం కల్పించడం వల్ల భక్తులు దాదాపు 20-25 సెకండ్లపాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.
ప్రస్తుతం, పవిత్ర మెట్లను ఎక్కే భక్తులను ఒక వంతెన వద్దకు మళ్లిస్తారు. అక్కడ వారు దర్శనం కోసం మరొక వైపుకు వెళ్లే ముందు క్యూలో వేచి ఉంటారు. ఈ సెటప్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కేవలం ఐదు సెకన్లు మాత్రమే కలుగుతుంది. శబరిమల సందర్శించే లక్షలాది మంది భక్తులలో దాదాపు 80 శాతం మందికి సంతృప్తికరమైన అనుభవం లభించదు అని ప్రశాంత్ వివరించారు.