మనకు తెలియని మానవాతీత శక్తిని మనం దైవం అన్నాం. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. కాని శ్రీరాముడు మానవుడే, దేవుడయ్యాడు. కనుక దేవుడు కూడా మానవ రూపంలో ఉంటాడని విశ్వసించి దేవుని విగ్రహాలను ప్రతిష్ఠించడం మొదలుపెట్టాం. అదే దేవాలయం అయింది. ఇలా దైవం, దేవాలయం మన సంస్కృతిలో విడదీయ రాని బంధాలయినాయి.
భగవంతుడు సర్వాంతర్యామి అని విశ్వసించాం మనం. మహర్షులు దేవాలయం కోసం ఆగమ శాస్త్రం, శిల్ప శాస్త్రము వ్రాశారు. దేవాలయం తూర్పు మడమరలవైపు ముఖం ఉంచి నిర్మించాలని చెప్పారు. ఏటి ఒడ్డున, కొండపైన, సముద్ర తీరంలో, అడవిలో కట్టిన దేవాలయం కుటుంబ సమేతంగా దర్శించుకోవడం మనకున్న పారమార్థిక విధుల్లో ఒకటి.
ఆలయం ఉపాధినిలయం
ఇపుడు కొత్తగా ‘టెంపుల్ టూరిజం’ అనే మాట వెలుగులోకి వచ్చింది. ఐహిక జీవితానికి కూడా దేవాలయాలు కేంద్రాలుగా ఉన్నాయి. అనేక వర్గాలవారికి, కళాకారులకు ఉపాధిని ప్రసాదించాయి. దేవాలయంలో విద్యాదానం చేసేవారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క మండపం ఉండేది. వేదాధ్యయనమేకాకుండా రస, రసాయన, ఖడ్గ, యోగ, ఘటిక (ఇంద్రజాలం) మంత్రవాద, ధాయవాద, థూమ్రవాద, గరుణవాదాది శాస్త్రాల్లో విద్యార్జన జరిగేది. ఆయుర్వేద ఔషధాలయాలు మనుష్యులకు, పశువులకు నిర్వహించినట్లుగా దేవాలయ శిలాశానసనాలు తెలియజేస్తున్నాయి.
నిర్మాణ నైపుణ్యం
మాధేరలోని సూర్యదేవాలయంలోను, అరసవెల్లి సూర్యాలయములోనూ ఏడాదికి 1,2 సార్లు మూల విరాట్టుపై సూర్యకిరాణాలు పడేలా నిర్మాణం జరిగింది. హంపిక్షేత్రంలో విరూపాక్ష మందరింలో ఉన్న విశాల మంటపంలో 12 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలలో వరుసగా మేషాది ద్వాదశ రాశులను రాశి అధిపతులను రాతిలోనే రమ్యంగా మలిచారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ స్తంభంపైనే కిరణాలు పడతాయి.
పంచభూత తత్వం…
స్వయంభూ క్షేత్రములో స్థలపురాణం మన వైభవోపేతమైన గతాన్ని గుర్తు చేస్తుంది. మన చరిత్ర గురించి, పూర్వజుల గురించి తెలుసుకొనే అవకాశం కల్గిస్తుంది. దేవాలయ దర్శనంతో మనకు పంచ భూతతత్వం గుర్తుకువస్తుంది. యంత్రబలం కల్గిన భూమిలో నడుస్తాం. తీర్థం తీసుకుంటాం. హారతి అందుకుంటాం. ఆకాశ దీప దర్శనంతో ఆకాశ మంత మనసు కల్గి ఉంటాం. దేవాలయం ప్రదక్షిణ చేయడం అంటే ధ్వజస్తంభ రక్షణ, దేవాలయ రక్షణకై మనం ప్రతిన పూనడమే.
– హనుమత్ ప్రసాద్