పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి పురాణేతిహాసాలను విడమరచి చెప్పడం వల్ల పిల్లల్లో మంచి చెడుల విచక్షణ కలిగేది.
కాలం మారింది. ఇప్పుడు పిల్లలు పాఠ్యపుస్తకాలకు, యువత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విషయాలకు పరిమితమవుతున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులు మాత్రమే గ్రంథాలయాలకు వెళ్తున్నారు. అరకొర జ్ఞానంతో, తమకు తోచినట్లు వాణిజ్య విజయాలు కాంక్షించి తీసే చలన చిత్రాలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు పాఠ్య పుస్తకాల్లో మానవతా విలువలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వటం లేదని చాలామంది భావిస్తున్నారు. ప్రాచీన భారతదేశ సంస్కృతి, చరిత్ర, పురాణాలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవి అవసరమే. మనిషి వ్యక్తిత్వాన్ని అవి తీర్చిదిద్దుతాయి. ఎలా జీవించాలో, ఎలా బతికితే ఆ పరమాత్మకు నచ్చుతుందో నేర్పుతాయి.
ఆదికావ్యమైన రామాయణంలో కుటుంబ వ్యవస్థ, మానవీయ విలువలను వివరించారు. తండ్రి మాట నిలబెట్టడానికి శ్రీరాముడు వనవాసం చేశాడు. బహుభార్యత్వాన్ని నిరసించి ఏకపత్నీవ్రతం ఆచరించాడు. జాతి, కుల తారతమ్యం లేకుండా గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, హనుమంతుడు, శబరి… తదితరులతో కలిసి జీవించాడు. శత్రువుతో సైతం ఎలా ప్రవర్తించాలో తెలుపుతూ, నైతిక విలువలకు ప్రాధాన్యమివ్వడం రామాయణం గొప్పదనం. స్త్రీలు ఇంటి గడప దాటరాదనే ఆంక్షను నిరసించి సీత రాముడితో వనవాసం చేసింది. అహంకారం, గర్వం, అసూయా ద్వేషాలతో ఎలా పతనం చెందుతారో మహాభారతం వివరించింది. భగవంతుడిపై నమ్మకం భక్తికి నిదర్శనం. అనేక మంది భక్తుల కథలను భాగవతం పేర్కొని మనిషి దైవత్వ గుణాలను సంతరించుకోవాలని బోధించింది. యువతలో నైరాశ్యం తొలిగి ఆత్మవిశ్వాసం పెంపొందించే ఎన్నో కథనాలు పురాణాల్లో ఉన్నాయి. అపజయంతో కుంగిపోకుండా ఓటమిని గెలుపునకు పునాదిగా మలచుకోవచ్చనటానికి పాండవులే నిదర్శనం.
నిరంతర కృషి, దీక్ష, పట్టుదల విజయానికి సోపానాలు. వివేకానంద స్వామి భారత దేశమంతా పర్యటించి యువతకు ధైర్యాన్నిచ్చే సందేశాలు అందించినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఆయన సర్వ మత సమ్మేళనంలో చేసిన ‘సోదర సోదరీమణులారా’ అనే సంబోధన ప్రపంచాన్ని ప్రేమతో కదిలించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సాధన కొనసాగించేవారు తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు. శిశువుకు తొలి గురువు తల్లి. ఆమె మాటలు, పాటలు, ప్రవర్తన బిడ్డ గ్రహిస్తుంది, అనుకరించి నేర్చుకుంటుంది. తండ్రి, గురువు తరవాత స్థానాలు ఆక్రమిస్తారు. అడుగడుగునా సంస్కృతి, సంప్రదాయాలను బోధిస్తే ప్రతి విద్యార్థీ సద్గుణ సంపన్నుడైన ఉత్తమ పౌరుడై దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. ధర్మశాస్త్రాలు ఇప్పుడే కాదు, అవి ఎప్పటికీ అనుసరణీయమే!