ఈ భూమండలం మీద ఎవరి గురించైనా కావ్యం రచించాలీ అంటే, అది శ్రీరామచంద్రుని గురించి మాత్రమేనని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ఉద్ఘాటించారు.
ఇక్కడ ఓ సాహితీ ఉత్సవంలో ప్రసంగిస్తూ శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడనీ, ఆయన గురించి రచనలు చేసినవారు గొప్ప వ్యక్తులైపోతారని వాల్మీకికి నారదుడు చెప్పడాన్ని ఉటంకించారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరిత మానస్‌ల వల్ల అయోధ్య ఆది నుంచి సాహిత్యం, సంస్కృతులకు నిలయంగా నిలచిందని ఆదిత్యనాథ్ వివరించారు. ఈనాటి డిజిటల్ యుగంలో రచనా వ్యాసంగం, పుస్తక పఠనం తగ్గిపోతున్నాయనీ, ఆ అలవాట్లను పునరుద్ధరించడానికి సాహిత్య ఉత్సవాలు తోడ్పడతాయన్నారు. ఒకప్పుడు అయోధ్యకు వెళితేనే వివాదాలు చుట్టుముడతాయని అధికారులు, ఉద్యోగులు ముఖ్యమంత్రినైన తనను హెచ్చరించారనీ, రామాలయానికి వెళితే అధికారం కోల్పోయినా సరే వెళ్లితీరతానని చెప్పానన్నారు. భారతదేశంలో సనాతన ధర్మానికి అయోధ్యే మూల క్షేత్రమని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 2016-17లో కేవలం 2.34 లక్షలమంది అయోధ్యను సందర్శించగా, నేడు ఒక్క రోజుకే 2.50 లక్షల మంది వస్తున్నారనీ, 2024లో ఇక్కడి రామాలయాన్ని 16 కోట్లమంది దర్శించారని వివరించారు.