శ్రీరామ నవమి వేడులకు సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి.
ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసింది. నవమి వేడుకల రోజున ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాల జరుగనున్నాయి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హారతి అనంతరం సూర్య తిలకం కార్యక్రమం ఉండనున్నది. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు.
ఏప్రిల్ 6 నుంచి రాబోయే 20 సంవత్సరాల వరకు సూర్య తిలకం ప్రతి శ్రీరామనవమి వేడుక రోజున ఆవిష్కృతం కానున్నది. ఇందు కోసం ఆలయ శిఖరం నుంచి సూర్య కిరణాలు గర్భాలయంలో కొలువైన బాల రాముడి నుదుటిన పడేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా అద్దాలు, లెన్సులు అమర్చనున్నారు.
రూర్కీ నుంచి శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే అయోధ్యకు చేరుకుంది. సూర్య తిలకం కోసం పరికరాలను అమర్చే పనిని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో సూర్య తిలకం సమయం ప్రతి సంవత్సరం పెరగనున్నది. ఇందు కోసం శాస్త్రవేత్తల బృందం ఓ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఈ సారి ఏప్రిల్ 6న నవమి వేడుకలు జరుగనున్నాయి.
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లల్లాకు సూర్య తిలకం కనిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సూర్య తిలకం కేవలం ప్రతి శ్రీరామనవమి అంటే రామయ్య జన్మదినం రోజునే ఉంటుంది. శాస్త్రవేత్తలు దీనికి ‘సూర్య తిలక్ మెకానిజం’గా పేరు పెట్టారు. సీబీఆర్ఐ (సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) రూర్కీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ప్రతి రామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు శ్రీరాముడి విగ్రహం నుదుటిపై 75 మిల్లీమీటర్ల వృత్తాకారంలో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పడే విధంగా సూర్య తిలక్ మెకానిజమ్‌ను రూపొందించింది.
గేర్ ఆధారిత సూర్య తిలక్ మెకానిజంలో కరెంటు గానీ, బ్యాటరీలు, ఐరన్‌ను ఉపయోగించరు. ఐఐటీ రూర్కీ సూర్య తిలక్ కోసం ప్రత్యేక ఆప్టో మెకానికల్ సిస్టమ్‌ను రూపొందించింది. ఇందులో ఆలయంలోని మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన అద్దంపై సూర్యకిరణాలు పడతాయి. ఈ కిరణాలు అద్దంపై నుంచి పడుతూ వచ్చి రాంలాలా నుదిటిపై పడతాయి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఫిజిక్స్ పరిశోధన ప్రకారం.. సూర్య తిలకం వ్యవధి ప్రతి సంవత్సరం పెరుగుతుంది. 19 సంవత్సరాలు సమయం పెరిగి.. ఆ తర్వాత 2025 నవమి రోజు లాగా పునరావృతమవుతుంది.