మాతృభాష తల్లిపాల వంటిది... పరభాష పోతపాల వంటిది
(నేడు - ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)
ప్రతిమనిషి జీవితంలో తల్లి దగ్గర నేర్చుకునేది తన మాతృభాషనే... ఎవరూ చెప్పకుండానే బిడ్డలు అమ్మా అని ఎలా పిలుస్తారో, మాతృభాష కూడా అంతే సహజంగా ప్రతి ఒక్కరికీ అబ్బుతుంది. అందుకే మనం అమ్మను ఎంతగా ప్రేమిస్తామో, గౌరవిస్తామో, కాపాడుకుంటామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి, ప్రేమించాలి, కాపాడుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని 1999వ సంవత్సరం నవంబరు 19న జరిగిన యునెస్కో 30వ సాధారణ మహాసభ చర్చించి ప్రకటించింది. ఎందుకంటే, 1956లో తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో యూనివర్సిటీ విద్యార్థులు తమ మాతృభాష అయిన బెంగాలీలో పాఠ్యాంశాలు బోధించాలని ఉద్యమించారు. ఫలితంగా హింస చెలరేగి పలువురు విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. మాతృభాష కోసం చేసిన త్యాగం ఫలితంగా 1999 ఫిబ్రవరి 21 నుంచి ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించారు.
ఆ మరుసటి ఏడాది అంటే 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిధ్యాన్ని, సంప్రదాయాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది. అందుకే అందుకు అనుగుణంగా ప్రతి ఏటా కొత్త థీమ్ని కూడా యునెస్కో ప్రకటిస్తూ వస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఇక భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచంలో మొత్తం ఆరు వేల భాషలు ఉండగా, భారతదేశంలో 1,652 మాతృభాషలు ఉన్నాయి. వీటిలో 16 భాషలకు మాత్రమే లిపి ఉంది. మరో 200 భాషలకు 1600 పైగా మాండలికాలున్నాయి. మాతృభాష అంతరించి పోయే ప్రమాదాన్ని పసిగట్టిన యునెస్కో, ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కుల్లో మాతృభాష అంతర్భాగమని నిర్వహించింది. కనీసం 30 శాతం మంది పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే మాతృభాష ఉనికికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో 57 అక్షరాలు, 3 ఉభయ అక్షరాలు ఉన్న మన తెలుగు భాష.. ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్ద మాతృభాషగా మన్ననలు పొందుతుంది. హిందీ తరువాత తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు.
బోధించే భాషలన్నింటిలో మాతృభాషకు ప్రధాన స్థానం ఉండాలనేది మాతృభాష అనేది బోధనా మాధ్యమంగా ఉండాలనేది విద్యావేత్తల అభిప్రాయం. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికి మాతృభాష తల్లిపాలవంటిది పరభాష పోతపాలవంటిది. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటూ మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది. కనీసం ఇక నుంచైనా మనం ఆ ప్రయత్నంలో ఉందాం.