కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని భక్తులను కోరారు.
‘‘త్రివేణి సంగమంలో భాగమైన గంగా, యమున, సరస్వతి నదులకు ఎలాగైతే దైవత్వం, స్వచ్ఛత ఆపాదించారో కావేరి నదికి సైతం అంతే ప్రాశస్త్యం ఉందని మన పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు వెళ్లి అక్కడ కిక్కిరిసన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు, కర్ణాటకలో దక్షిణభారత ప్రయాగ్‌రాజ్‌గా వినతికెక్కిన టి.నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి. పుణ్యస్నానాలు ఆచరించండి. అత్యంత పటిష్టవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లుచేశాం’’అని భక్తులకు శివకుమార్ పిలుపునిచ్చారు.