భారత్ అభివృద్ధిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ గేమ్ ఛేంజర్ అవుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.
దేశవ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడంలో శ్రీకొత్తల బసవేశ్వర భారతీయ శిక్షణ సమితి, భారత్ వికాస్ సంగం, వికాస్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడారు. ‘‘‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అర్థం ఒక్కసారే ఎన్నికలు జరిగి ఆ తర్వాత ఉండవని కాదు. లోక్‌సభకు, రాష్ట్రాలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు వంద రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం దీని ఉద్దేశం. తరచూ ఎన్నికల నిర్వహణ ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
ప్రకృతిలోని పంచభూతాలను గౌరవిస్తూ అభివృద్ధి జరగాలి. చెట్లు, నదులు, సముద్రాలను, జంతువులను పూజించడం మన సంస్కృతిలోనే ఉంది. మన సంస్కృతి నదీ పరీవాహక ప్రాంతాల్లో విరాజిల్లింది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని దెబ్బతీస్తే నాగరికత ఉండదు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యత పాటించాలి. ప్రకృతి కేంద్రంగా ప్రగతి ఉండాలనే ఉద్దేశంతో భారత్ వికాస్ సంగం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
గ్రామాలకు చేతనైనంత చేయండి
ఎట్టిపరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను, గ్రామాలను వదిలిపెట్టవద్దు. గ్రామాల అభివృద్ధికి ఎంత చేయగలరో అంత చేయండి. ‘మనమందరం జీవించడానికి కావాల్సినన్ని వనరులను ప్రకృతి ఇచ్చింద’ని గాంధీజీ అన్నారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన అతిపెద్ద బహుమతి యోగా అని క్యూబా సహా అనేక దేశాలు ప్రశంసిస్తున్నాయి’’ అని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శ్రీకొత్తల బసవేశ్వర భారతీయ శిక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బసవరాజ్ పాటిల్ సేడం మాట్లాడుతూ.. రాజకీయ నాయకత్వం ద్వారా 20 శాతం సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపగలమని, మిగతా 80 శాతం సమస్యల పరిష్కారాలకు ఇతర నాయకత్వం అభివృద్ధి కావాల్సి ఉందన్నారు.
అందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. సజ్జనుల శక్తితో సమాజ సమగ్ర వికాసం సాధ్యమవుతుందని భారత వికాస్ సంగం వ్యవస్థాపకులు కె.ఎన్.గోవిందాచార్య అన్నారు. కార్యక్రమంలో బసవలింగ స్వామీజీ, బీదర్‌లోని గురునానక్ దేవ్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ సర్దార్బల్బీర్సింగ్, శరణ బసవేశ్వర్ సంస్థాన్ ప్రతినిధి దాక్షాయణి ఎస్ అప్ప, అదమ్య చేతన ఫౌండేషన్ ఛైర్పర్సన్ తేజస్విని అనంత్‌కుమార్ మాట్లాడారు.