ముస్లింలు కాశీ, మధురపై తమ వాదనను వదులుకుంటే ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడం తామూ మానేసుకుంటామని విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర జైన్ స్పష్టం చేశారు.
ఈ విషయంలో ముస్లిం సమాజం చొరవ తీసుకొని, మతోన్మాదాన్ని వదిలేస్తే తమ హృదయాలను గెలుచుకుంటారని, లేకపోతే ఈ విషయాన్ని కోర్టులే నిర్ణయిస్తాయని తేల్చి చెప్పారు. తాము మాత్రం తమ వాదనలను నుంచి పక్కకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం చేస్తామని మాట ఇచ్చామని, అక్కడ ఆలయ నిర్మాణం పూర్తైందన్నారు. అలాగే ఇవి కూడా పూర్తవుతాయన్నారు.
హిందూ సమాజం నిరంతరం శాంతినే ప్రేమిస్తుందని 1984నుంచి కాశీ, మధురను క్లెయిమ్ చేస్తోందని గుర్తు చేశారు.అప్పుడు కూడా తాము ఇదే విధంగా స్పందించామని, ముస్లిం సమాజం ఈ రెండు ప్రదేశాలపై తమ క్లెయిమ్ ను వదులుకుంటే ఇతర స్థలాలపై తాము కూడా క్లెయిమ్ చేయమని అన్నామని పేర్కొన్నారు. ముస్లిం సమాజం తన మతోన్మాదాన్ని వదులుకోలేదని, అందుకే కొన్ని అవకాశాలను కోల్పోయిందన్నారు. ఇప్పుడు ఈ విషయాలు కోర్టు పరిధిలో వున్నాయని అన్నారు. కాశీ, మధురపై ముస్లింలు తమ వాదనలు వదులుకంటే మసీదుల కింద శివలింగాలను వెతకడం కూడా మానేస్తామన్నారు.
మరో వైపు ఇదే విషయంపై సరసంఘచాలక్ మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయంతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని మాత్రమే తీసుకొని మీడియా హైలెట్ చేసిందన్నారు.