సంక్రాంతి |
గురువులకు పెద్దలకు కవిమిత్రు లందరికీ మకరసంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి కవిత
అశ్వధాటి వృత్తాలు
సప్తాశ్వరూఢుడయి బాలార్కుడీ దినము తా జేరు రాశి మకరం
తృప్తాత్ములవ్వ ఘన కూష్మాండ దానములు విప్రాళి కందు సుదినం
ప్రాప్తించ పుణ్యగతి గాంగేయుడెంచినది స్వచ్ఛంద మారణ దినం
తప్తాధికంబులకు మార్తాండుడున్ ధరయు సామీప్యమైన అయణం
లుప్తంబులై జనవె రోగాలు చేర హుతవాహుండు ప్రాణి జఠరం
దీప్తోద్ధతిన్ మెరయ పౌష్యంపు లక్ష్మి కళ ముంగిళ్ళ ముగ్గు రచనం
క్లుప్తంబులై నిశలు దీర్ఘంబులై పగలు పత్రాలు రాలు శిశిరం
గుప్తంబుగా మసలు పూర్వీకులన్ బిలచు పితౄణ తర్పణ దినం
వ్యాప్తించగా లచిమి ధాన్యంపు రాశులుగ పొంగళ్ళ తీపి పచనం
సుప్తస్థితిన్ పొదలు శీతర్తు బాధితుల మేల్కొల్పు భోగి దహనం
జ్ఞప్తిన్ తలంచుకొని గోజాతి సేవలను గోలక్ష్మి గొల్చు కనుమల్
ఆప్తాళి బంధుతతి సమ్మేళనంబులకు సంక్రాంతి గొప్ప తరుణం
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి కవిత
శాంతి సౌఖ్యప్రదాయి సంక్రాంతి లక్ష్మి
సకల సంపత్సమృద్ధి నొసంగ కూర్మి
మీ కుటుంబము నిరతము మేలు గాంచి
యలరుత యటంచు నే కూర్తు నాశిషములు.
చింతా రామకృష్ణారావు గారి కవిత
మకరమునందు భాస్కరుఁడు మాఘమహోజ్వల తేజమొప్పుచున్
సకల శుభంబు లీయగను చక్కగ చేరు శుభంబు గొల్పుచున్.
వికసిత భావనా పటిమ వెల్లునయై మహనీయ సత్క్రియల్
సకల జనాళి చేయగ ప్రశాంతిగ నుండగ జేయు గావుతన్.
మిస్సన్న గారి కవిత
ఉత్తరాయణ పుణ్యకాలోద్భవమున
మకర సంక్రాంతి పురుషుడు సకల జీవ
కోటి కిడుగాక శుభముల కోటి నుర్వి
ననుచు కాంక్షింతు మనసార ననఘులార.
వందన మాచరింతు నపవర్గతృషీతుల కంజలించెదన్
ముందుగ మాకు నందరికి పూర్వులు పూజ్యులు భక్తి నా మదిన్
సందడి చేయగా మకర సంక్రమణంబున తర్పణంబులన్
పొందుగ నిచ్చి దీవెనల పొందెద వృద్ధిని పొంద సంపదల్
రంగుగ రంగవల్లులను రాజిలు గొబ్బియలుంచి కన్నియల్
హంగగు పట్టు పుట్టముల నాడుచు పాడుచు పూజసేయుచున్
పొంగుచు పొంగలిన్ దినెడి పొల్పగు సంక్రమణంపు వేళలో
ముంగిలి పర్వ శోభలను మోదము గూర్చెడు నెల్లవారికిన్.
గోలి హనుమచ్చాస్త్రి గారి కవిత
సకల శుభ కరమ్ము సౌభాగ్యకర క్షేమ
కరము వరము లిచ్చి కరుణ జూచు
మకర సంక్రమణము మనకు హిత కరము
కరము లెత్తి మ్రొక్కు మరుణ కిరణు.
మంద పీతాంబర్ గారి కవిత
పాడి పంటల నిచ్చెడు పార్వతమ్మ
చదువు సంధ్యల నొసగెడు చదువులమ్మ
వచ్చి పిలిచిన సంక్రాంతి లచ్చుమమ్మ
జనుల కిడుగాక శుభములు జయము గలుగ !!!
వెంకట రాజారావు గారి కవిత
ఆది భట్ల వారి యశ్వమ్ము హర్డిల్సు
దాటు తెలుగు భాష ధాటి జూడ
తుదిని సున్న లుంచి దుమకించె పద్యాలు
దుమికి దుమికి లచిమి తొంగి చూచె