ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ‘మహాకుంభ్’కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగే మహాకుంభ్ మేళాకు ప్రముఖుల సందడి కొనసాగనుంది.
ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న తేదీన మహాకుంభమేళాలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్షా జనవరి 27న, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఫిబ్రవరి 1న హాజరుకానున్నారు.
షెడ్యూల్ ప్రకారం అమిత్షా మహాకుంభ్ మేళాలో పవిత్ర స్నానం, గంగా హారతిలో పాల్గొనడంతో పాటు అధికారులతో కూడా సమావేశమవుతారు. ఆయన పర్యటన సందర్భంగా సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా నిఘా ఏర్పాట్లను మరింత విస్తృతం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ప్రయాగ్రాజ్ వస్తారు. ఈ సందర్భంగా ఆమె సిటీలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కీలకమైన నాలుగు పవిత్ర స్నానాలు
మహాకుంభమేళా ప్రాంతంలో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉన్నప్పటికీ భక్తులు లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు ఆచరించారు. రాబోయే రోజుల్లో కీలకమైన 4 ‘షాహి స్నాన్’లు (పవిత్ర స్నానాలు) ఉండటంతో యాత్రికుల తాకిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జనవరి 29న మౌన అమావాశ్య (రెండవ షాహి స్నాన్), ఫిబ్రవరి 3న వసంత పంచమి (మూడో సాహి స్నాన్), ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి (మూడో షాహి స్నాన్), ఫిబ్రవరి 26 మహా శివరాత్రి (నాలుగో షాహి స్నాన్) ఉన్నాయి.