Mukkoti Ekadashi |
ముక్తిదాయకం ముక్కోటి ఏకాదశి :
ప్రతి తిథీ ప్రత్యేకమే అయినప్పటికీ ఏకాదశికి మరింత ఎక్కువ ప్రత్యేకత కనిపిస్తుంది. ఏకాదశి అనే పేరు తలచుకోగానే ఓ పుణ్యభావన మన మనస్సుల్ని ఆవహిస్తుంది.
ఏకాదశి రోజున పని ప్రారంభిస్తే విజయం తథ్యమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ రోజున చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుతారని పురాణాలు, ఆచారాలు కూడా విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఏకాదశి రోజున సాధ్యమైనంత మేరలో విష్ణుమూర్తిని అర్చించి తరించాలని ప్రతి ఒక్కరూ తపిస్తుంటారు. ఇలా సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశుల్లో మార్గశిర, పుష్యమాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి మరింత పుణ్యప్రదమైనదిగా ప్రసిద్ధి పొందింది.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే మరో రెండు ఏకాదశులు అదనం. ప్రతి ఏకాదశికి నిర్దుష్టమైన నామధేయాలున్నాయి. ఆర్ష సంప్రదాయంలో ఏకాదశి తిథి పరమపవిత్రమైంది. శ్రావణ, కార్తిక, మార్గశిర మాసాల్లోని ఏకాదశులకు మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విశేషమైనది. దీన్నే ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఏర్పడింది.
ఏకాదశి విశేషాల రాశి :
విష్ణువు 'మురుడు' అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి, సింహవతి అనే గుహలో సేదతీరుతున్నాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఆ గుహలోనే యోగనిద్రలో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మూరాసురుడు మాయోపాయంతో విష్ణువుపైకి దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుడ్ని సంహరించింది. విష్ణుమాయా విలాసం నుంచి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరాన్ని అనుగ్రహించాడు. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని ఏకాదశి తిథి ఆవిర్భావ వత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది.
సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.
ఓ సందర్భంలో బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసురశక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతాసమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి.
ఏకాదశి తిథికి 'హరివాసరం' అని పేరు. వైకుంఠ ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు. నేత్రాలు వేరైనా దృష్టి ఒక్కటే. సూర్యచంద్రులు వేర్వేరుగా గోచరమవుతున్నా సమగ్రంలో కాంతి శక్తి ఒక్కటే. విరాట్ స్వరూపుడైన విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. అందుకే ఈ ఏకాదశిని భగవదవలోక దినోత్సవం అని, మోక్షోత్సవమని కూడా పేర్కొంటారు.
సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకరసంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి (జనవరి 14 నుండి జూలై 16 వరకు) ముందు ముక్కోటి దేవతలతో సమ్మిళితమై ఉన్న విష్ణువును ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.
ఏకాదశి నియమావళి :
ముక్కోటి ఏకాదశి పర్వదినం వైష్ణవ ఆగమ శాస్త్రప్రకారం ఎంతో విశేషమైనది. తిరుమల శ్రీవారి సన్నిధితో పాటు ప్రముఖ వైష్ణవక్షేత్రాలైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, గురువాయురు, భద్రాచల దివ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం కోసం ఉత్సవమూర్తుల్ని సర్వాలంకార యుక్తంగా ఉత్తరద్వారంలో కొలువుదీరుస్తారు. ముక్కోటి పర్వదిన సందర్భంగా ప్రతి వైష్ణవ సన్నిధానం వైకుంఠమై విలసిల్లుతుంది. వేద, వేదాంగ, పద, క్రమ, ఉపనిషత్తుల్ని గానం చేస్తారు. షోడశోపచారాలతో స్వామికి కైంకర్యాలు కొనసాగుతాయి. అలంకార ప్రియుడైన విష్ణుభగవానుడి అవతార స్వరూపాలైన శ్రీరామ, శ్రీకష్ణ, శ్రీవేంకటేశ్వర నసింహ ఆలయాలన్నీ నేత్రానందకరంగా భాసిల్లుతాయి. దశమి నాడు ఏక భుక్తం, ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు అన్నదానం అనేది సంప్రదాయరీత్యా పాటించాల్సిన నియమాలు.
బ్రహ్మాది దేవతలు స్తుతులు చేస్తుండగా, మంగళధ్వనులు మారుమ్రోగుతుండగా, వేద పండితులు సస్వరంగా మంత్రాలు పఠిస్తుండగా పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి సేవ చేస్తూ ఉంటుంది. విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మ కొలువై ఉండగా స్వామి అనంత పద్మనాభుడిగా తేజరిల్లుతాడు. ఈ వైకుంఠ దివ్య దర్శనాన్ని ప్రతి భక్తుడు సదా తమ హృదయ పీఠంపై నిలుపుకోవాలి, విష్ణుకృపకు పాత్రులు కావాలి. చీకటి నుంచి వెలుగువైపునకు నిత్య చైతన్యంతో పయనించాలి.
వైష్ణవక్షేత్రాల్లో సందడి :
ముక్కోటి రోజున వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆ రోజున ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజామునుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందు వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఈ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగుసార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరిరోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి తిథి ద్వాదశి ఉన్న రోజు, రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.
మనసే విష్ణు నివాసం :
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించాలి. అంటే, ఉపవాసం ద్వారా ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్ళు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు. ముక్కోటి ఏకాదశి అందించే సందేశం ఇది.
రచనః డాక్టర్ కప్పగంతు రామకృష్ణ