Konaseema Sankrant |
సంక్రాంతి జిలుగులు... ప్రభల తీర్థాలు
తెలుగువారికి అతి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మూడురోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల పండుగను ఎంతో వైవిధ్యంగా జరుపుకుంటారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు కలగలిసిన ఈ వేడుకలు చూడముచ్చటగా ఉంటాయి. అంతేకాదు... తరతరాల తెలుగు వారి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రభల తీర్థం ఒకటి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమకు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. సంక్రాంతికి కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచులా కురుస్తుంది. అదొక అక్షరానికందని వర్ణనాతీత అనుభూతి.
కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు మరికొన్ని చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు.అత్యంత ప్రాచీనమైనది. కోనసీమ చుట్టుపక్కనున్న గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. నాటి స్థానిక సంస్థానదీశులైన రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, కాలక్రమంలో ‘జగ్గన్న తోట’ అనే పేరుతో స్థిరపడింది.
లోక కల్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కల్యాణం కోసం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం.
Konaseema Sankranti Prabhalu |
ప్రభల తయారీ
తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.
అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేలు, కాలువల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.
ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి భావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. కనుమ రోజున ప్రభల తీర్థంతో ఆధ్మాత్మిక క్షేత్రంగా భాసిల్లే జగ్గన్నతోట ప్రాంతం మిగిలిన రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది.
జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు
- గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి
- గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి
- వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి
- ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి
- వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి
- పెదపూడి – మేనకేశ్వరస్వామి
- ముక్కామల – రాఘవేశ్వర స్వామి
- మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి
- నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి
- పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి
- పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి
Konaseema Sankranti Prabhalu |
ప్రభల తీర్థం
ప్రభల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఏక సంథాగ్రాహి ఉండేవాడు. అతడు కౌశికీ నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టుకింద గ్రామదేవత నెలకొని ఉండేది. విఠల జగ్గన్నపై ఈర్ష్యకలిగినవారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు, ఆ మర్రిచెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్లు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రభల తీర్థం ప్రారంభమైంది.
ఈ ప్రభలు భక్తులు వచ్చే దారంట రావు. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు.ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం యాభై మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థ పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలను చూడటానికి వేలాది మంది తరలి వస్తారు.
ఈ ప్రభలని మోయడానికి కుల మత విచక్షణ లేదు. వైభవోపేతంగా మేళతాళాలతో, అద్భుతమనే రీతిగా అలంకరించిన ప్రభలని భోగేశ్వర స్వామి ఆహ్వానం అందుకున్న గ్రామాల నుండీ ప్రజలు మోసుకువస్తారు. దారంతా ప్రభలని మోస్తూ నడుచుకొంటూ సభక్తికంగా వారు తీసుకొచ్చే ప్రభల రూపంలోకి ఆ భక్తి శ్రద్ధలకి లోబడి పరమేశ్వరుడు ఆవహించి వస్తారని నమ్మకం. నిజంగానే అటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతారు.
Konaseema Sankranti Prabhalu |
ఆలస్యంగా వచ్చే వీరేశ్వరుడు
ఈ ఉత్సవం జరిగేది మొసలపల్లిలో ఉన్న తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఉళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ సమావేశానికి వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు, అంచేత వ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారట, అందుకని భక్తులు ప్రభలన్నిటినీ "హర హర" "శరభ శరభ" అంటూ ఒకేసారి పైకిలేపుతారు.
Konaseema Sankranti Prabhalu |
అందరికంటే ఆలస్యంగా గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి వస్తాడు. ఈయన ప్రభ వచ్చే దారిలో కౌశికీ నదిని దాటుతూ రావాల్సి ఉంటుంది, ఆ నదిని దాటించే దృశ్యం నయనానందకరంగా ఉంటుందని చెప్తారు. ఈ వీరేశ్వర రుద్రుడు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది, ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటి ఉత్సవం ముగుస్తుంది.
ఉత్సవం ముగిశాక, రుద్రలందరూ తిరిగి తమ ప్రభల మీద తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు, దీన్ని చూడటానికి వేలల్లో జనం దేశ విదేశాల నుండీ ప్రతి ఏటా ఈ ప్రాంతానికి వస్తారు. మన ప్రధాని నరేంద్రమోదీ 2020లో ఈ ఉత్సవానికి గానూ శుభాకాకంక్షలు తెలపడంతో దేశవిదేశాల్లో సైతం ఈ జాతర మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఒక గ్రామీణ ఉత్సవం ఇంత గొప్ప ప్రాధాన్యతని పొందడం చాలా గొప్ప విషయం.
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కళాశాల, విజయవాడ-1