కర్మలు అనేవి బలమైనవి. చాలా బలీయమైనవి. కర్మలనేవి చిత్రంగా వుంటాయి. చాలా విచిత్రంగా మన వెంట పడతాయి. మనల్ని వెంటాడుతుంటాయి.
సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని కర్మలు రెండు రకాలు. ఈ కర్మలవలనే జన్మలు. జన్మించేక గత జన్మల వాసనలు. ఫలితంగా ప్రాప్తాలు, అప్రాప్తాలు. అవును! కర్మఫలం నంచి బయటపడే మార్గమే లేదా? పరిశీలన చేద్దాం.
పూర్వం ఓ భక్తుడు మోక్షం కోరి విష్ణువు కోసం పెద్ద మర్రి చెట్టు కింద తపస్సు మొదలుపెట్టేస్తాడు. చాలా కాలమైంది. కానీ మహావిష్ణువు ప్రసన్నం కాలేదు. తనకి మోక్షప్రాప్తి వుందో లేదో మహావిష్ణువుని అడిగి తెలుసుకోమని, వైకుంఠానికి వెళ్తున్న నారదుణ్ణి కోరతాడు. వైకుంఠం వెళ్లి తిరిగొచ్చిన నారదుడు ‘‘స్వామి నీకు మోక్షాన్ని ఇస్తాడట. అయితే ఆ మోక్షాన్ని.. నీకు ఈ మర్రి చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో.. అన్ని జన్మల తర్వాత ఇస్తానని స్వామి చెప్పేడు’’ బాధపడుతూ అతి దీనంగా చెబుతాడు నారదుడు ఆ భక్తుడితో. ‘‘నా స్వామి నాకు మోక్షం ప్రసాదిస్తాడా! ఎంత అదృష్టం! ఏం భాగ్యం!’’ అంటూ ఆనందంతో, సంతోషంతో ఎగిరి గెంతులు వేస్తుంటాడు ఆ భక్తుడు. జరుగుతున్నదేమిటో అర్థంకాక అమాయకంగా చూస్తుంటాడు నారదుడు. అంతే టక్కున ప్రత్యక్షమవుతాడు శ్రీమన్నారాయణుడు. కంగారుపడిన నారదుడు శ్రీమన్నారాయణునితో ‘‘స్వామీ! మీకిది భావ్యమా? మీరేదైతే నాకు చెప్పారో, అదే నేను ఇతనికి చెప్పటం ఇంకా పూర్తి కానే కాలేదు. మీరు ప్రత్యక్షమైపోయేరు స్వామి?’’ అయోమయంగా తన సందేహాన్ని వెలిబుచ్చుతాడు నారదుడు. ‘‘అవును నారదా! నీ సందేహం సరైనదే. విను నా నిర్ణయం ఫలితం కష్టమైనా, నష్టమైనా, అప్రియమైనదే అనా. బాధపెట్టేది అయినా అది నా నిర్ణయమని తెలిసిన తర్వాత, ఆనందంగా ఆమోదించి ఆనందంతోఅనుభవించి, అమితానందాన్ని అనుభవించిన ఆ క్షణంతోనే.. అతని వేల వేల జన్మల బంధం, కర్మల ఫలం పటాపంచలైపోయేయి నారదా! అందుకనే మోక్షం ఈయడానికి ప్రత్యక్షమయ్యేనంటాడు’’ శ్రీమన్నారాయణుడు.కర్మల జన్మల బంధనాల నుంచి, కర్మఫలం నుంచి మనం తప్పించుకునే తరుణోపాయ మార్గం చెప్పే కథ ఇది! మరి ఈ కర్మల జన్మలకి కారణమయ్యే మరో కోణాన్ని కూడా కొంచెం పరిశీలిద్దాం. కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగిపోయింది. కౌరవులందరూ నేల కొరిగిపోయేరు. విషాదంలో ఉన్న గాంధారీ, ధృతరాష్ట్రుల్ని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వెళ్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు.
‘‘శ్రీకృష్ణా! వంశోద్ధారకుడైన ఒక్క కుమారుడు కలగటమే జన్మ జన్మల అదృష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. నాకు వంద మంది కుమారులు కలిగేరు. కానీ ఉత్తర క్రియలు జరపడానికి, కనీసం ఒక్కడినైనా నువ్వు కాపాడలేదు. నీకిది న్యాయమా? ఇదేం న్యాయమయ్యా అని నిందాపూర్వకంగా మాట్లాడుతాడు. అపుడు శ్రీకృష్ణుడిలా అంటాడు. ‘‘ఏభై జన్మల క్రితం నువ్వు ఓ కిరాతకుడివి. తనకున్న వంద మంది పిల్లలతో ఓ చెట్టుమీద కూచుని ఆనందిస్తున్న పక్షుల జంటని నీ బాణంతో కొట్టేవు. ఆ బాణం నుంచి వచ్చి ఆ వేడికి తల్లి పక్షి, తండ్రి పక్షికి కళ్ళు పోయి గుడ్డివైపోయేయి. పిల్లపక్షులు అన్నీ ప్రాణాలు కోల్పోయేయి. ఆ కర్మఫలం తాలూకు ఫలితమే ఇది’’ అని ధృతరాష్ట్రునికి వివరిస్తాడు శ్రీకృష్ణుడు.
అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు- ‘‘ఏభై జన్మల క్రిందటి కర్మఫలం ఇప్పుడు అనుభవించాలా? ఇదేం చోద్యం శ్రీకృష్ణా! కర్మఫలం అనుభవించాలి అంటే ఏభై జన్మల వరకు ఆగటమెందుకు? ఆ మరుజన్మలోనే అనుభవించవచ్చు కదా? ఏమిటి రహస్యం?’’ సందేహం వెలిబుచ్చుతాడు ధృతరాష్ట్రుడు.
‘‘ఏభై జన్మల వరకు ఎందుకు ఆగవలసి వచ్చింది అనే కదా నీ సందేహం? చెబుతాను విను. వంద పిల్ల పక్షుల్ని చంపిన ఆ కర్మఫలాన్ని అనుభవించాలంటేనీకు వందమంది కుమారులు కలిగే అదృష్టం, యోగం కలసి రావాలి. ఒక్క కొడుకు కలగడానికే ఎంతో అదృష్టం చేసి ఉండాలి. మరి వందమంది పుత్రులు కలిగే యోగం నీకు కలగడానికి, వందమంది పుత్రులు కలిగే మహోన్నత స్థితి నీవు పొందడానికి.. ఏభై జన్మలు పట్టింది మామా!’’ అసలు రహస్యాన్ని ధృతరాష్ట్రునికి విపులంగా వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కర్మలు, జన్మలు, కర్మబంధం, కర్మఫలం, వాటి పర్యవసానం తత్ఫలితం గురించి విశదీకరించే మహోన్నతమైన మహత్తరమైన అనుభవైక వేద్య సందేశాన్ని అందించే కరుణరస సన్నివేశం అది.
కాబట్టి కర్మల జన్మల వాసనలు బాధించకుండా నామస్మరణతో, సేవలతో, భగవచ్ఛింతనతో మన జీవనాన్ని సాగించాలి. సత్కర్మలు, సచ్చింతనలు, సద్బుద్ధితో,సదాలోచనలతో ఆ భగవంతుని అనుగ్రహం పొందటానికి అనుక్షణం సాధన చేయాలి. ఆ పరమాత్మ కృపకి పాటుపడాలి. పాత్రులం కావాలి!
- రమాప్రసాద్ ఆదిభట్ల