కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 35
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥
శ్రేయాన్ - చాలా ఉత్తమమైనవి; స్వధర్మః - స్వీయధర్మాలు; విగుణః - దోషముతోనైనా; పరధర్మాత్ - ఇతరులకు చెప్పబడిన ధర్మాల కంటే; స్వనుష్ఠితాత్ - పరిపూర్ణంగా చేయబడినట్టి; స్వధర్మే - స్వధర్మాలలో; నిధనం - నాశము; శ్రేయః - మంచిది; పరధర్మః - ఇతరులకు చెప్పబడిన ధర్మము; భయావహః - ప్రమాదకరమైనవి.
వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైనది.
భాష్యము : అందుకే మనిషి ఇతరులకు చెప్పబడిన ధర్మాలను గాక స్వధర్మాలను పూర్తి కృష్ణభక్తిభావనలో తప్పక నిర్వహించాలి. లౌకికంగా ప్రకృతి త్రిగుణ ప్రభావంలో మనిషి స్వభావాన్ని అనుసరించి ఆదేశించబడిన కర్మలే విధ్యుక్తధర్మాలు. శ్రీకృష్ణుని దివ్యసేవ కొరకు గురుదేవుని ద్వారా ఆదేశించబడినవే ఆధ్యాత్మిక కర్మలు. అయినా భౌతికమే గాని, ఆధ్యాత్మికమే గాని మృత్యువు వరకు కూడ మనిషి తన ధర్మాలకే అంటిపెట్టుకొని ఉండాలి గాని వేరొకని ధర్మాలను అనుకరించకూడదు. ఆధ్యాత్మికస్థితిలో కర్మలు, భౌతికస్థితిలో కర్మలు భిన్నంగా ఉన్నప్పటికిని ప్రామాణిక నిర్దేశాన్ని పాటించడమనే నియమము కర్తకు సర్వదా మంచిది. మనిషి ప్రకృతి గుణాల ప్రభావంలో ఉన్నప్పుడు తన ప్రత్యేకమైన స్థితికి చెప్పబడిన నియమాలను తప్పక అనుసరించాలి; ఇతరులను అతడు అనుకరించకూడదు. ఉదాహరణకు సత్త్వగుణంలో ఉండే బ్రాహ్మణుడు అహింసాపరునిగా ఉంటాడు.
ఇక రజోగుణంలో ఉండే క్షత్రియుడు హింసాపరునిగా ఉండడము అనుమతించబడుతుంది. అటువంటి క్షత్రియునికి అహింసా నియమాలను పాటించే బ్రాహ్మణుని అనుకరించడం కంటే హింసాయుత నియమాలను పాటిస్తూ నశించడమే ఉత్తమము. ప్రతియొక్కడు తన హృదయాన్ని క్రమవిధానంలో శుద్ధిపరచుకోవాలే గాని అకస్మాత్తుగా కాదు. అయినా మనిషి ప్రకృతి గుణాలను దాటి పూర్తిగా కృష్ణభక్తిభావనలో నెలకొనినప్పుడు ప్రామాణిక గురువు నిర్దేశంలో ఏదైనా, దేనినైనా చేయగలుగుతాడు. అటువంటి పరిపూర్ణ కృష్ణభక్తిభావన స్థితిలో క్షత్రియుడు బ్రాహ్మణునిగా వర్తించగలుగుతాడు లేదా బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించగలుగుతాడు. దివ్యమైన స్థితిలో భౌతికజగత్తుకు చెందిన భేదాలు ఏమాత్రము అన్వయించవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడేయైనా తరువాత బ్రాహ్మణునిలాగా వర్తించాడు. కాగా పరశురాముడు బ్రాహ్మణుడేయైనా తరువాత క్షత్రియునిలాగా వర్తించాడు. దివ్యస్థితిలో ఉన్నవారై వారు ఆ విధంగా చేయగలిగారు. కాని మనిషి భౌతికస్థితిలో ఉన్నంతవరకు ప్రకృతి గుణాలను అనుసరించి ఉన్నట్టి తన ధర్మాలనే నిర్వహించాలి. అదే సమయంలో అతడు పూర్ణ కృష్ణభక్తిభావనను కలిగి ఉండాలి.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 36
అర్జున ఉవాచ
అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వారేయ బలాదివ నియోజితః ॥
అర్జునః ఉవాచ - అర్జునుడు పలికెను; అథ - అయితే; కేన - దేని చేత; ప్రయుక్తః - ప్రేరేపితుడై; అయం – ఒకడు; పాపం - పాపాన్ని; చరతి - చేస్తాడు; పూరుషః - మనిషి; అనిచ్ఛన్ – ఇష్టం లేకుండ; అపి - అయినప్పటికిని; వార్శ్నేయ - ఓ వృష్టి వంశీయుడా; బలాత్ - బలవంతంగా; ఇవ - అయినట్లు; నియోజితః - నిమగ్నుడౌతాడు.
అర్జునుడు పలికెను : ఓ వృష్ణవంశీయుడా! ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేని చేత పాపకర్మలలో ప్రేరేపించబడుతున్నాడు?
భాష్యము : భగవదంశగా జీవుడు మొదట్లో ఆధ్యాత్మికుడు, పవిత్రుడు, సమస్త భౌతికకల్మషాల నుండి ముక్తుడు అయిఉంటాడు. కనుక స్వభావరీత్యా అతడు భౌతికజగత్తు పాపాలకు లోను కాకూడదు. కాని ప్రకృతి సంపర్కంలోకి రాగానే అతడు ఎటువంటి సంకోచము లేకుండ, ఒక్కొకప్పుడు తన ఇష్టానికి విరుద్ధంగా అనేక పాపాలు చేస్తాడు. నిజానికి అర్జునుడు శ్రీకృష్ణుని అడిగినట్టి ఈ ప్రశ్న జీవుల వికృత స్వభావానికి సంబంధించినదై ఆశాపూర్ణంగా ఉన్నది. ఒక్కొకప్పుడు జీవుడు పాపకర్మలు చేయాలని కోరుకోకపోయినా బలవంతంగా చేస్తుంటాడు. అయినా భగవంతుడు తరువాతి శ్లోకంలో వివరించినట్లు పాపాలు ఆంతరంలోని పరమాత్మునిచే గాక వేరే కారణంగా ప్రేరేపించబడుతున్నాయి.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 37
శ్రీభగవానువాచ
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః ।
మహాశనో మహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణం ॥
శ్రీభగవాన్ ఉవాచ - శ్రీకృష్ణభగవానుడు పలికెను; కామః - కామము; ఏషః - ఇది; క్రోధః - క్రోధము; ఏషః - ఇది; రజోగుణ - రజోగుణము నుండి; సముద్భవః - పుట్టినది; మహాశనః - కబళించేది; మహాపాప్మా - మహాపాపపూర్ణమైనది; విధి - తెలిసికోవలసింది; ఏనం - ఇది ; ఇహ - ఈ భౌతికజగత్తులో; వైరిణం - మహాశత్రువు.
శ్రీకృష్ణభగవానుడు పలికెను అర్జునా! అది కేవలము కామమే. అది రజోగుణ సంపర్కము వలన పుట్టి, తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబళించే పాపమయ శత్రువు.
భాష్యము : జీవుడు భౌతికసృష్టి సంపర్కంలోకి వచ్చినపుడు అతని నిత్యకృష్ణప్రేమ రజోగుణ సాంగత్యంలో కామముగా మార్పు చెందుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే పుల్లని చింతపండు సంపర్కంలో పాలు పెరుగుగా మారిపోయినట్లు, భగవత్ప్రేమ భావము కామంగా మారిపోతుంది. ఇక తిరిగి ఆ కామము సంతృప్తి చెందనప్పుడు కోపంగా మారుతుంది; కోపం మోహంగా మారుతుంది, మోహం భౌతిక అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది. అందుకే కామము జీవునికి పరమశత్రువు. కేవలము కామమే పవిత్రుడైన జీవుడిని భౌతికజగత్తులో బంధించబడి ఉండేటట్లుగా చేస్తుంది. కోపము తమోగుణ ప్రదర్శనము. ఈ గుణాలన్నీ కోపము, ఇతర ప్రభావాలుగా ప్రకటమౌతూ ఉంటాయి. అందుకే రజోగుణము తమోగుణంగా పతనం చెందడానికి బదులుగా నిర్దేశిత జీవనవిధానం, కర్మ ద్వారా సత్త్వగుణంగా వృద్ధి చెందితే మనిషి ఆధ్యాత్మిక సంపర్కం ద్వారా క్రోధ పతనం నుండి రక్షింపబడతాడు. భగవంతుడు తన నిత్య ఆధ్యాత్మికానంద వృద్ధి కొరకే స్వయంగా పలు రూపాలలోకి విస్తరించాడు. జీవులందరు ఆ ఆధ్యాత్మికానందంలోని అంశలు. వారికి కూడ పాక్షికమైన స్వాతంత్ర్యము ఉన్నది. కాని తమ స్వాతంత్ర్య దుర్వినియోగము ద్వారా సేవాభావము ఇంద్రియభోగ కోరికగా మారినపుడు వారు కామవశులౌతారు. బద్ధజీవులు ఈ కామవాంఛలను తీర్చుకోవడానికి సౌకర్యాన్ని కలిగించడానికే ఈ భౌతికజగత్తు భగవంతునిచే సృష్టించబడింది. ఆ సుదీర్ఘమైన కామకలాపాలచే పూర్తిగా ఓడినప్పుడే జీవులు తమ నిజమైన స్థితిని గురించి విచారణ మొదలుపెడతారు.
ఈ విచారణే వేదాంతసూత్రాల ఆరంభము. అందులో “అథాతో బ్రహ్మజిజ్ఞాసా - మనిషి పరబ్రహ్మము గురించి విచారణ చేయాలి” అని చెప్పబడింది. ఆ భగవంతుడే శ్రీమద్భాగవతములో “జన్మాద్యశ్చయతోస్యయాదితరతశ్చ - పరబ్రహ్మమే సమస్తానికీ మూలము" అని నిర్వచించబడ్డాడు. కనుక కామానికి మూలము కూడ భగవంతుడే. అందుకే ఒకవేళ కామము భగవత్రేమగా మారితే, అంటే కృష్ణభక్తిభావనలోకి మార్పు చెందితే, ఇంకొకరకంగా చెప్పాలంటే ప్రతీదీ కృష్ణుని కొరకే కోరితే కామము, క్రోధము రెండింటిని ఆధ్యాత్మికముగా మార్చవచ్చును. శ్రీరాముని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని స్వర్ణనగరాన్ని కాల్చడం ద్వారా తన క్రోధాన్ని ప్రదర్శించాడు. కాని ఆ విధంగా చేయడం ద్వారా అతడు గొప్ప భగవద్భక్తునిగానే అయ్యాడు. ఇక్కడ భగవద్గీతలో కూడ భగవానుడు తన ప్రీత్యర్థం శత్రువులపై కోపం చూపమని అర్జునుని ప్రేరేపిస్తున్నాడు. అందుకే కామాన్ని, క్రోధాన్ని కృష్ణభక్తిభావనలో వినియోగించినపుడు శత్రువులుగా అవడానికి బదులుగా మన మిత్రులుగా అవుతాయి.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 38
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |
ఓడ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం ॥
ధూమేన - పొగ చేత; అన్రియతే - కప్పబడుతుంది; వహ్నిః - అగ్ని; యథా - వలె; ఆదర్శః - అద్దము; మలేన - ధూళిచే; చ - కూడ; యథా - వలె; ఉల్బేన - గర్భముచే; ఆవృతః - కప్పబడుతుంది; గర్భః - పిండము; తథా - అట్లే; తేన - ఆ కామముచే; ఇదం – ఇది; ఆవృతం - కప్పబడుతుంది.
పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడతాడు.
భాష్యము : జీవుని శుద్ధ చైతన్యాన్ని మరుగుపరిచే మూడు ఆవరణ దశలు ఉన్నాయి. ఆ ఆవరణే అగ్నిలోని పొగలాగా, అద్దము పైని ధూళిలాగా, పిండము చుట్టు ఉండే గర్భము లాగా వివిధ రూపాలలో ఉండేదే కామము. కామాన్ని పొగతో పోల్చినపుడు జీవకణమనే అగ్ని అతికొద్దిగా అనుభూతమౌతుందని అర్థం చేసికోవాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే జీవుడు తన కృష్ణభక్తిభావనను కొద్దిగా ప్రదర్శించినపుడు పొగ చేత కప్పబడిన అగ్నిని పోలుతాడు. పొగ ఉన్నచోట అగ్ని తప్పకుండ ఉండవలసిందేయైనా ప్రారంభదశలో అగ్ని బహిరంగంగా ప్రదర్శితము కాదు. ఈ స్థితి కృష్ణభక్తిభావనలో ప్రారంభము వంటిది. అద్దము పైని ధూళి నానారకాల ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణాన్ని శుద్ధిపరిచే కార్యక్రమాన్ని సూచిస్తుంది. భగవన్నామ సంకీర్తనమే దానికి సర్వోత్తమమైన పద్ధతి. గర్భముచే శిశువు కప్పబడడము నిస్సహాయస్థితిని వివరించే ఒక ఉపమానము. ఎందుకంటే గర్భస్థ శిశువు ఎంత నిస్సహాయంగా ఉంటాడంటే కదలనైనా కదలలేడు. ఈ జీవనస్థితిని చెట్ల జీవనస్థితితో పోల్చవచ్చును.
చెట్లు కూడ జీవులే, కాని దాదాపు చేతనారహితంగా అధిక కామాన్ని ప్రదర్శించడం వలన వారు అటువంటి స్థితిలో ఉంచబడ్డారు. ధూళిచే కప్పబడిన అద్దము పశుపక్ష్యాదులను పోలుతుంది, కాగా పొగచే కప్పబడిన అగ్ని మానవుని పోలుతుంది. మానవజన్మలో జీవుడు కొద్దిగా కృష్ణభక్తిభావనను జాగృతము చేసికోగలుగుతాడు. అతడు మరింత పురోగతి సాధిస్తే మానవజన్మలోనే ఆధ్యాత్మికజీవన అగ్ని రగులుకుంటుంది. అగ్నిలోని పొగను జాగ్రత్తగా తొలగిస్తే అగ్ని పెద్ద మంటగా అవుతుంది. అందుకే మానవజన్మ భవబంధం నుండి తప్పించుకోవడానికి జీవునికి ఒక చక్కని అవకాశము. మానవజన్మలో ఎవ్వడైనా సమర్థవంతమైన మార్గదర్శనలో కృష్ణభక్తిభావన సాధన ద్వారా కామమనే శత్రువును జయింపగలుగుతాడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 39
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ॥
ఆవృతం - కప్పబడుతుంది; జ్ఞానం - విశుద్ధ చైతన్యము; ఏతేన - ఈ; జ్ఞానినః - జ్ఞాని యొక్క నిత్యవైరిణా - నిత్యశత్రువుచే; కామరూపేణ - కామరూపంలో; కౌన్తేయ - ఓ కుంతీపుత్రా; దుష్పూరేణ – ఏనాడూ సంతుష్టి చెందనిది; అనలేన - అగ్నిచే; చ - కూడ.
ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడూ సంతుష్టి చెందనిది, అగ్నిలాగా మండేదియైన అతని కామరూప నిత్యశత్రువుచే కప్పబడుతుంది.
భాష్యము : నిరంతరము ఆజ్యం పోయడం ద్వారా అగ్ని ఏనాడూ చల్లారనట్లుగా, ఎంతటి ఇంద్రియభోగం ద్వారానైనా కామము సంతుష్టి చెందదని మనుస్మృతిలో చెప్పబడింది. భౌతిక జగత్తులో సమస్త కార్యకలాపాల కేంద్ర బిందువు మైథునసుఖము. అందుకే ఈ భౌతికజగత్తు మైథునాగారము అంటే మైథునభోగ సంకెళ్ళని పిలువబడుతుంది. సాధారణ చెరసాలలో నేరస్థులను కటకటాల వెనక పెడతారు. అదేవిధంగా భగవన్నియమాలను ఉల్లంఘించే నేరస్థులు మైథునభోగ సంకెళ్ళలో ఉంచబడతారు. ఇంద్రియభోగం ఆధారంగా జరిగే లౌకిక నాగరికత పురోగతి అంటే జీవుని లౌకిక అస్తిత్వ పరిమితిని పెంచడమనే అర్థము. కనుక ఈ కామము అజ్ఞానానికి చిహ్నము. దాని ద్వారానే జీవుడు భౌతికజగత్తులో ఉంచబడతాడు. ఇంద్రియభోగాన్ని అనుభవించేటప్పుడు ఏదో కొంత సుఖభావన కలిగినా నిజానికి ఆ నామమాత్ర సుఖభావన ఇంద్రియభోగికి చరమశత్రువు.