భారత దేశం వ్యవసాయ దేశం. ప్రకృతిలోని ప్రతి దానిని పూజ్య భావనతో చూసే సంస్కృతి మనది. ‘‘ఆత్మవత్ సర్వభూతేషు’’ అన్న దానిని భారతీయులు ఉపాసన చేస్తుంటాం. ఇది ప్రతీ పండుగలోనూ కనిపిస్తూనే వుంటుంది.
ఇందులో భాగంగా సంక్రాంతి మర్నాడే కనుమ పండుగ చేసుకుంటాం. ఇది పశువుల పండుగ. అందరికీ, ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు చేసే పశువులకు ధన్యవాదాలు తెలుపుతూ పశువుల కొమ్ములకు, బండ్లకు రంగులు వేస్తారు. పశువును కూడా పూజిస్తారు. పశువుల కొట్టంలో పొంగలి వండుతారు.
ఈ పొంగలిని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. పొలాలకు వెళ్లి, ఆ నైవేదాన్ని పసుపు, కుంకుమలతో కలిసి చల్లుతారు. దీంతో తమ పంట బాగా పండుతున్నది రైతుల విశ్వాసం. దీనినే ‘‘పొలి చల్లడం’’ అని పిలుచుకుంటారు. అలాగే కొన్ని చోట్ల ఎడ్లపోటీలు, కోడి పందేలు కూడా జరుగుతాయి. గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు హరిదాసులు కూడా వస్తారు.దీంతో వీధులన్నీ సంబురంగా మారిపోతాయి. ప్రజలందరూ ఒక్క చోటికి వస్తారు.
‘‘నమో గోభ్య: శ్రీమతీభ్య: సౌరభేయీభ్య ఏవ చ
నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమ:’’
అంటే భారతీయ గోసంతతి వర్ధిల్లుగాక. గోమాతృ స్వరూపిణీ సురభీ దేవి , మహాలక్ష్మీ ప్రసన్నురాలైభారత దేశాన్ని అనుగ్రహించుగాక అని దీనర్థం.ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే ముగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ.పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి.
కనుమ పండుగ రోజు కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. కనుమ పండుగ రోజున తప్పకుండా తలంటు స్నానం చేయాలి. శాస్త్రవచనం ప్రకారం కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి.
కనుమ పండుగ రోజున ఆడపడుచులకు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు. అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి. ఆయుర్వేదం ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. శీతాకాలంలో మినప గారెలు తినడం ఆరోగ్యానికి మంచిది. కనుమ రోజు గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లిల్లూ తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం, వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు.
ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. అంటే మనం పెంచుకునే జంతువులు కూడా మన కుటుంబంలో భాగంగానే చూడాలన్నది మన ధర్మం. ఇది కనుమ మనకు బోధిస్తుంది.కనుమ రోజు రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమ అనుబంధాన్ని చాలా గొప్పగా ఏర్పర్చుకుంటారు. ఉదయమే పశువులను వాగుల దగ్గరికి తీసుకెళ్లి, శుభ్రంగా కడుగుతారు. నదుపు పసుపు, కుంకుమలు అదులుతారు. వస్త్రాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత హారతి ఇస్తారు. పొంగలిని తినిపిస్తారు.