Ayodhya Ram Temple |
శ్రీరామజన్మభూమి అయోధ్యలో మర్యాదా పురుషోత్తముడు భగవాన్ శ్రీరాముడి బాలమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నేటికి యేడాది పూర్తయింది. గతేడాది పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు (22-01-2024) బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత రామయ్యకు పుట్టినచోట గుడి కట్టుకోగలగడం దేశవ్యాప్తంగా హిందువులను భావోద్వేగానికి గురిచేసింది.
సుదీర్ఘ న్యాయపోరాటం:
అయోధ్యలో రాముడికి పుట్టినచోట గుడి కట్టుకోడానికి హిందూ సమాజం న్యాయస్థానాల్లో సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. రామజన్మభూమి గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎప్పటికప్పుడు ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. 1989లో దేశమంతటా శిలాపూజ కార్యక్రమాలు జరిగాయి. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలూ ఎక్కడికక్కడ హిందువుల ప్రయత్నాలకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. ఆ అన్యాయానికి నిరసనగా ఎందరో రామభక్తులు తమ దైవాన్ని పూజించుకునే ప్రదేశాన్ని తిరిగి పొందేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శిలాపూజ యాత్రను నిషేధించాలంటూ తార్కుండే అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, దేశవ్యాప్తంగా పూజలు చేసిన శిలలను అయోధ్యకు చేర్చడానికి అనుమతించింది.
ఆ తర్వాత 1990 సెప్టెంబర్ బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ ఆఢ్వాణీ నాయకత్వంలో గుజరాత్ లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వరకూ రామ రథ యాత్ర జరిగింది. ఆ యాత్ర దేశవ్యాప్తంగా వాతావరణాన్ని రామమయం చేసేసింది. అంతకుముందు 1982-83లో దేశంలోని మూడు ప్రదేశాల నుంచి ఏకాత్మతా యాత్ర జరిగింది. ఆ యాత్ర సుమారు 50వేల కిలోమీటర్లు సాగింది. వాటిలో మొదటి యాత్ర హరిద్వార్ నుంచి కన్యాకుమారి వరకూ జరిగింది. రెండో యాత్ర నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని పశుపతినాథ మందిరం నుంచి మొదలై తమిళనాడులోని రామేశ్వర ధామం వరకూ సాగింది. మూడవ యాత్ర బెంగాల్‌లోని గంగాసాగర్ నుంచి గుజరాత్ లోని సోమనాథ్ వరకూ నిర్వహించారు. ఒక నిర్దిష్టమైన రోజు ఆ మూడు యాత్రలూ మహారాష్ట్రలోని నాగపూర్ చేరాలన్నది సంకల్పం. దానికి సంబంధించి మొత్తం ప్రణాళికను సీనియర్ సంఘ ప్రచారకులు దివంగత మోరోపంత్ పింగళే సిద్ధం చేసారు.
ఎక్కడ చూసినా రామనామ జపమే:
పై సంఘటనలు, హిందువుల్లో జాగృతమైన విశ్వాసానికి, శ్రీరామచంద్రుడి పట్ల సామాన్య భక్తుల అచంచల భక్తివిశ్వాసాలకూ నిదర్శనం. ఆనాటి కార్యక్రమాల్లో హిందూ సమాజంలోని అన్ని వర్గాల వారూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తద్వారా శ్రీరామచంద్రుడిపై తమ అచంచల దృఢవిశ్వాసాన్ని ప్రకటించారు. అయితే ఆ విషయాన్ని కాంగ్రెస్ మాజీ ఎంపీ కపిల్ సిబల్ న్యాయస్థానంలో తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టులో రెగ్యులర్ హియరింగ్ 40 రోజుల పాటు జరిగింది. కోర్టు విచారణ 170 గంటల పాటు జరిగింది. ఎట్టకేలకు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రామజన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
వీధుల్లోనూ, కోర్టుల్లోనూ ఎన్నో గొడవలు, కొట్లాటలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చివరికి అయోధ్యలోని రామజన్మభూమిలో బాలరాముడికి భవ్యమైన ఆలయ నిర్మాణం పూర్తయింది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలో గర్భగుడిలో బాలరాముడి మూర్తిని ప్రతిష్ఠించే కార్యక్రమం జరిగింది. ఆ ప్రాణ ప్రతిష్ఠ భారతీయ ఆర్ష సంప్రదాయం ప్రకారం పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు, అంటే ఆ యేడాది జనవరి 22న, జరిగింది. అందుకే హిందూ పంచాంగ సంప్రదాయం ప్రకారం ఇవాళ పుష్య శుక్ల ద్వాదశీ తిథి నాడు అయోధ్యలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, వేద పఠనం, మంత్ర పఠనం, రామరక్షా స్తోత్ర పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రామజన్మభూమిక్షేత్రంలో మరో 18 దేవాలయాలు:
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం ఆలయ సముదాయంలో మరో 18 గుడులు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి. దశావతారాలు, శేషావతారం, నిషాదరాజు గుహుడు, శబరి, అహల్య, సంత్ తులసీదాస్, పరమశివుడు, సూర్య భగవానుడు, దుర్గా మాత, అన్నపూర్ణాదేవి, గణేశుడు, హనుమంతుడు మొదలైన దేవతా మూర్తులకు ఆలయాలు నిర్మిస్తున్నారు. వాటి నిర్మాణం ఈ యేడాది జూన్ నాటికి పూర్తికావచ్చు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలోని ‘శ్రద్ధాళు సువిధా కేంద్రం’లో 24 గంటల ఉచిత అత్యవసర వైద్య సదుపాయాల కేంద్రాన్ని అపోలో హాస్పిటల్ ప్రారంభించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, మార్గదర్శనంతో విశ్వహిందూ పరిషత్ రామజన్మభూమి క్షేత్ర విముక్తి ఉద్యమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన, వేర్వేరు కులాలు, వేర్వేరు హిందూ శాఖలకు చెందిన వివిధ భాషలకు చెందిన, విభిన్న సామాజిక తరగతులకు చెందిన గొప్ప నాయకులు, అర్చకులు, మహంతులు ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
బాలరూపంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తీర్థక్షేత్ర ట్రస్ట్ పరమ పవిత్రంగా నిర్వహించింది. దేశంలోని ప్రతీ ఇంటికీ అక్షింతలు పంపించింది. ఆ అక్షింతల వితరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్తో పాటు పలు సంస్థలకు చెందిన సేవకులు స్వచ్ఛందంగా సేవలందించారు. 2024 జనవరి 1 నుంచి 15 వరకూ ఆర్ఎస్ఎస్ ఇంటింటికీ ప్రచారం చేసింది. సుమారు 45 లక్షల మంది కార్యకర్తలు సుమారు 20కోట్ల మంది ప్రజలను కలుసుకొని అక్షింతలు పంపిణీ చేసారు. వారు సుమారు 6 లక్షల ఇళ్ళకు వెళ్ళారు. ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజు దేశవ్యాప్తంగా 5.6 కోట్ల ప్రదేశాల్లో 9.8లక్షల కంటె ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించారు, వాటిలో 27.82కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు.
ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల:
రామ్‌లల్లా అయోధ్యకు చేరుకుని యేడాది గడిచింది. ఈ సంవత్సర కాలంలో అయోధ్యలో చిన్నచిన్న వ్యాపారాలు మొదలు పెద్దపెద్ద వ్యాపారాల వరకూ బాగా పెరిగాయి. దుకాణదారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి భక్తులు రామ్‌లల్లా బొమ్మలు, పూలదండలు, ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో రామమందిరం నమూనా దేవాలయాల బొమ్మలు బాగా అమ్ముడు పోతుండేవి, కానీ ప్రాణప్రతిష్ఠ తర్వాత భక్తులు తమ ఇళ్ళలో పూజలు చేసుకోడానికి రామ్‌లల్లా మూర్తులను కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. అయోధ్యకు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దాంతో రాష్ట్రప్రభుత్వానికి కూడా పెద్దమొత్తంలో జిఎస్టి ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకంలో రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్యకు వెడుతున్నారు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వ్యవధిలో 47కోట్ల 61లక్షలకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారు. 2025 జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరాది నాడు 2లక్షలకు పైగా భక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సాధారణంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు పర్యాటకుల సందడి ఎక్కువ ఉంటుంది. అయితే గతేడాదిగా తాజమహల్ కంటె ఎన్నోరెట్లు ఎక్కువ సంఖ్యలో అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగిపోయింది. అలాగే దేశం నలుమూలల నుంచీ అయోధ్యకు రైళ్ళ సంఖ్య కూడా పెరిగింది. చాలావరకూ సూపర్ ఫాస్ట్ రైళ్ళన్నీ అయోధ్యలో ఆగుతున్నాయి. కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్ ఆధునిక హంగులతో విమానాశ్రయాన్ని తలపిస్తోంది. మరోవైపు రామమందిరానికి కొద్దిదూరంలో వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. దేశంలోని దాదాపు ప్రధాన నగరాలు అన్నింటినుంచీ అయోధ్యకు విమానాలు తిరుగుతున్నాయి.
అయోధ్యలో ఇప్పుడు ఆతిథ్య పరిశ్రమా గణనీయంగా పెరిగింది. ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్ళతో పాటు చిన్నచిన్న హోటళ్ళు కూడా బోలెడన్ని వచ్చాయి. ఇప్పుడు ప్రయాగలో మహాకుంభమేళా మొదలుకానుంది. అక్కడికి వచ్చే భక్తులు సహజంగానే రాముణ్ణి చూడడానికి అయోధ్యకు వస్తారు. ఫలితంగా ఈ ఫిబ్రవరి మాసాంతం వరకూ భక్తుల జాతర కొనసాగుతూనే ఉంటుంది.