ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం రణరంగంగా మారింది. అపారమైన సేనావాహిని కనుచూపుమేరలో ఉన్న భూమినంతా ఆక్రమించింది. కోట్ల కొద్దీ సిద్ధంగా ఉన్న సైన్యం తమ నాయకుల ఆజ్ఞకోసం ఎదురుచూస్తోంది. యోధాగ్రేసరులు దివ్యమైన శంఖాలను పూరిస్తున్నారు. యుద్ధభేరీలు మోగుతున్నాయి. ఆ శబ్దాలకు దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతి హృదయంలోనూ తీవ్రమైన యుద్ధకాంక్ష తేజరిల్లుతోంది.... ఒక్క అర్జునుడి హృదయంలో తప్ప.
అందరూ రక్తసంబంధీకులే కదా? ఎవరితో యుద్ధం చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరిని చంపాలి? బంధువులందరినీ చంపుకుని నేను సాధించేదేమిటి? అల్పమైన రాజ్య సుఖాల కోసం నావాళ్ళందరినీ చంపుకోవాలా? బంధువులంతా చనిపోయాక, రాజ్యం సాధిస్తే, మిగిలేదేమిటి? అలలు అలలుగా సందేహాలు అర్జునుడి హృదయంలో ఎగసిపడుతున్నాయి. చేయి పట్టుతప్పుతోంది. ధనుర్బాణాలు జారిపోయాయి.
సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అంతా గమనిస్తున్నాడు. విషాదం నిండిన అర్జునుడి హృదయంలో చైతన్యజ్వాల రగిలించాల్సిన అవసరాన్ని గుర్తించాడు. కానీ, సమయం చాలా స్వల్పంగా ఉంది. చెప్పాల్సిన విషయం అనంతంగా ఉంది. వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు భగవానుడు. ‘గీత’ బోధించాడు. అర్జునుడి నైరాశ్యాన్ని పోగొట్టాడు. జగద్గురువుగా అవతరించాడు. అర్జునుడి పేరుతో మానవాళికి ‘గీతామృతం’ లభించింది.
శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం. అర్జునుడు నరుడు. అంటే, సమస్త మానవాళికి ప్రతినిధి. అర్జునుడికి కలిగిన సందేహాలు నిత్యం మనుషులకు కలిగే సందేహాలే. అలజడులను తొలగించి, సందేహాలను నివృత్తి చేసి, ఆనందప్రాప్తిని కలుగజేసింది భగవద్గీత. అదొక అద్వైత తత్త్వగీతిక. భక్తి, యుక్తి, ముక్తి.... ఈ మూడిరటిని మానవాళికి ప్రసాదించిన సర్వోత్కృష్ట గ్రంథం ‘భగవద్గీత’.
గీత - ఆవిర్భావం
భగవద్గీత ఆవిర్భవించిన సన్నివేశమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఖిన్న మనస్కుడైన అర్జునుడి విషాదాన్ని పోగొట్టటానికి భగవంతుడు చేసిన బోధ ఇది. అలా, అర్జునుడి విషాదాన్ని పోగొట్టటం కోసం ఆవిర్భవించిన ‘గీత’, మొత్తం విశ్వానికే చైతన్య ప్రబోధ గీతికగా మారింది. ఇక్కడ, అర్జునుడి విషాదం ఒక నెపం మాత్రమే. భగవంతుడు మానవాళికి బోధ చేయాలనుకున్నాడు. అందుకు తగిన వేదికను ఆయనే కల్పించాడు. అదే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. సాక్షాత్తు ఆదిశంకరులే భగవద్గీతకు భాష్యం రాస్తూ...‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సారసంగ్రహ భూతం’ అన్నారు.
అర్జునుడు సామాన్య మానవుడు కాదు. విష్ణు అంశతో పుట్టినవాడు. అంతటి మహానుభావుడికి విషాదం కలుగుతుందా? అంటే అదొక మాయ. మహానుభావుల విషాదం లోక కల్యాణ కారకంగా ఉంటాయి. (క్రౌంచ పక్షి మరణం చూసిన వాల్మీకి కలిగిన విషాదం కూడా రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించింది కదా)
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్స: సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతమ్మహత్ ॥
సకల ఉపనిషత్తులను గోవుగా చేసి, అర్జునుడిని దూడగా మలిచి, గోపాల నందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా గోపాలకుడిగా మారి, ఒక పక్క అర్జునుడికి పాలను (సకల ఉపనిషత్తుల సారాంశాన్ని) అందిస్తూనే, మరోపక్క లోకానికి అందించాడు. ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది!
మానవాళికి గీతా సందేశం:
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ‘యోగము’ అంటారు. ఒకటి నుంచి ఆరు వరకు ఉన్న అధ్యాయాల్ని ‘కర్మషట్కం’ అని, ఏడు నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాల్ని ‘భక్తి షట్కం’ అని, 13 నుంచి 18 వరకు ఉన్న అధ్యాయాల్ని ‘జ్ఞాన షట్కం’ అని అంటారు. ‘కర్మ’ ‘జ్ఞానం’గా మారటమే భగవద్గీతా సారాంశం.
- - మృత్యువు కేవలం శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్య సత్యమైంది.
- - తనను తాను తెలుసుకోవటం, తనలోని అంతరాత్మను తెలుసుకోవటమే జ్ఞానం.
- - అభ్యాస, వైరాగ్యాల ద్వారా వస్తు ప్రపంచాన్ని వదలిపెట్టి, సర్వోత్క ృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోవటం యోగి అయిన వ్యక్తి లక్షణంగా ఉండాలి.
- - భగవంతుడిని చేరుకోవటానికి భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ మార్గం అనుసరించాలనేది భక్తుడి ఇష్టం. అంతిమఫలితం ఒకటే.
- - మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. ఉండకూడదు కూడా. కాబట్టి, కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు. అలాగని, కర్మ చేయటాన్ని విడిచిపెట్టకూడదు. కర్తవ్యాన్ని నిర్వహించి, ఫలితాన్ని భగవంతుడికి వదలేయాలి.
- - సృష్టిలోని సమస్త ప్రాణులూ భగవంతుని స్వరూపాలే. మనం చేసే అన్ని పూజలు, అర్చనలు, హామాల ఫలితాలు భగవంతుడికే చెందుతాయ.
- - ప్రపంచంలోని జీవులన్నీ సత్వ, రజ, స్తమో గుణాలతో బంధించబడి ఉంటాయి. భగవంతుని పాదాలను ఆశ్రయించినవారికి ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది.
- - జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదు:ఖాలు... అన్నీ భగవంతుడు ఇచ్చినవే. దేనికీ పొంగిపోకూడదు. విచారించకూడదు.
- - భక్తి, సాధన అనే పేర్లతో కాలక్షేపం పనికిరాదు. కర్తవ్యాన్ని విస్మరించటం ఏ మాత్రం తగదు. కర్మ చేయని వాడిని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించడు.
మహాత్ముల దృష్టికోణంలో భగవద్గీత
- స్వామి వివేకానంద : గీతలో పరమాత్మ చెప్పినవి కేవలం శ్లోకాలో, మాటలో కావు. అవి ఆధ్యాత్మిక జ్ఞాన కళికలు. ఉపనిషత్తులు అనే తోట నుంచి సత్యము అనే పుష్పాలను ఏర్చికూర్చి అల్లిన పుష్పమాలిక భగవద్గీత. మనిషి జీవితం మొత్తాన్ని ప్రతిబింబించే అద్భుత దర్శనం ఇది.
- బాల గంగాధర తిలక్ : ప్రపంచ సాహిత్యాలన్నిటిలో భగవద్గీతకు సాటిరాగలిగిన పుస్తకం మరొకటి లేదు. వర్ణించటానికి అలవికానటువంటి ప్రకాశంతో వెలుగొందే మణి భగవద్గీత. సమ్నుతమైన బ్రహ్మానందాన్ని అనుభవింపజేయటానికి అదొక అత్యుత్తమ సాధనం.
- సద్గురు మలయాళస్వామి : సంసార సాగరాన్ని దాటటానికి భగవద్గీత కన్నా సులభమైన మార్గం మరొకటి లేదు. గీతలో చెప్పిన అంశాల్ని ఆచరణలోకి తీసుకువస్తే, అంతకుమించిన పరమార్థం మరెక్కడా లభించదు.
- అరవింద యోగి : మనిషి తన మేథస్సంతా ధారపోసినా భగవద్గీత అందించే జ్ఞానంలోని ఒక అంశాన్ని మాత్రమే అవగాహన చేసుకుని, ఆచరణలోకి తీసుకురాగలుగుతాడు.
- మదన మోహన మాలవ్య : నాకు తెలిసినంతవరకు విశ్వవాజ్ఞ్మయంలో భగవద్గీతను మించిన గ్రంథం మరొకటి లేదు. ఇది హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు. సమస్త మానవకోటికి ధర్మభాండాగారంగా ఉంటుంది.
- వినోబాభావే : నా శరీర వికాసానికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకన్నా ఎక్కువగా ఉపయోగపడిరది.
- ఎడ్విన్ ఆర్నాల్డ్ : భారతదేశానికి చెందిన స్వర్నోతమైన ఈ గ్రంథం లేకపోవటం వల్ల ఆంగ్లసాహిత్యం ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉండిపోతుంది.
- వారన్ హేస్టింగ్స్ : ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునే మానవుడికి భగవద్గీతను మించిన సాధనం ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు.
- బంకించంద్ర ఛటర్జీ : భగవద్గీతలో ఉన్నటువంటి అపూర్వమైన ధర్మ సమన్వయం, అద్భుతమైన వ్యాఖ్య, ప్రపంచంలోని ఏ దేశంలోను, ఏ కాలంలోనూ, ఏ వ్యక్తీ దర్శించి ఉండదు. కనీసం విని కూడా ఉండడు.
అరుదైన ఘనత
ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కింది. అదే గీతాజయంతి. అంటే భగవద్గీత పుట్టినరోజు. శంకరజయంతి, వ్యాసజయంతి, హనుమజ్జయంతి ... ఈవిధంగా దేవతలకు, మహాత్ములైన యోగీశ్వరులకు జయంతులు ఉండటం లోక సహజం. కానీ, వీటన్నిటికి భిన్నంగా ఒక గ్రంథానికి జయంతి నిర్వహించటం కేవలం భగవద్గీతకే చెల్లింది. మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత ఈ లోకంలో అవతరించిన రోజు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అర్జునుడి విషాదాన్ని తొలగించటానికి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రబోధాన్ని ‘గీత’గా వినిపించిన రోజు ఇది. అర్జునుడి పేరు మీద సకల మానవాళికి భగవంతుడు చేసిన బోధ ఇది. అర్జునుడి విషాదమే కాదు.. యావత్ మానవజాతి బాధల్ని పోగొట్టే శక్తి కేవలం భగవద్గీతకు మాత్రమే ఉంది. అందుకే భగవద్గీతకు మాత్రమే జయంతి చేయటం ఆచారంగా ఏర్పడిరది. భగవంతుడితో సమానంగా పూజను అందుకున్న పుస్తకరాజం భగవద్గీత.
గీతాపారాయణ ఫలితాలు :
- ప్రథమోధ్యాయం : పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. పాపము నశించి, ఉత్తమ జన్మ కలుగుతుంది.
- ద్వితీయోధ్యాయం : ఆత్మజ్ఞానం కలుగుతుంది.
- తృతీయోధ్యాయం : పాపనాశనం కలిగి, ప్రేతత్వ బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
- చతుర్థోధ్యాయం : చెడు ఆలోచనలు తొలగుతాయి. శాప విమోచనం కలుగుతుంది.
- పంచమోధ్యాయం : వైకుంఠ నివాస యోగ్యత కలుగుతుంది. ఈ అధ్యాయాన్ని విన్నంతనే పశుపక్ష్యాదులకు సైతం జీవన్ముక్తి కలుగుతుంది.
- షష్ఠాధ్యాయం : దివ్య తేజస్సు కలుగుతుంది.
- సప్తమోధ్యాయం : నీచ జన్మల నుంచి విముక్తి కలుగుతుంది. సంసార సాగర విముక్తి కలుగుతుంది.
- అష్టమ అధ్యాయం : సర్వవిధాలైన దుర్గతుల నుంచి విముక్తి కలుగుతుంది.
- నవమ అధ్యాయం : ప్రతి గ్రహణం చేయటం వల్ల వచ్చే పాపం నశిస్తుంది.
- దశమ అధ్యాయం : అనంతమైన దేవసహాయం అందుతుంది.
- ఏకాదశ అధ్యాయం : రాక్షస పీడ తొలగిపోతుంది.
- ద్వాదశ అధ్యాయం : దివ్యశక్తులు కలుగుతాయి.
- త్రయోదశ అధ్యాయం : పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. సద్గతులు కలుగుతాయి.
- చతుర్దశ అధ్యాయం : ఆత్మస్మ ృతి కలుగుతుంది. శత్రు జయం కలుగుతుంది.
- పంచదశ అధ్యాయం : ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి.
- షోడశ అధ్యాయం : ధైర్యసాహసాలు కలుగుతాయి. జంతువశీకరణ సిద్ధి కలుగుతాయి.
- సప్తదశ అధ్యాయం : సర్వ వ్యాధులు నశిస్తాయి.
- అష్టాదశ అధ్యాయం : అనేకమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. సిద్ధశక్తులు కలుగుతాయి.
రథి - సారథి
సాధారణంగా భగవద్గీత అనగానే నాలుగు గుఱ్ఱాలు పూన్చిన ఒక రథం, దాని పక్కన గీత బోధిస్తున్న కృష్ణుడు, మోకాళ్ళ మీద కూర్చుని దోసిలి పట్టి కృష్ణుడిని ప్రార్థిస్తున్న అర్జునుడు ` ఈ చిత్రం కనిపిస్తుంది. భారతయుద్ధం ప్రారంభ సమయంలోనే తన రథానికి సారథిగా ఉండమని శ్రీకృష్ణుడిని అర్థిస్తాడు పార్థుడు. సరే ` అంటాడు కృష్ణుడు. అంటే, భారతయుద్ధంలో రథి అర్జునుడు కాగా సారథి శ్రీకృష్ణుడు. ఇందులో విశేషమైన అర్థాలు గోచరిస్తాయి.
రథాన్ని అధిరోహించిన అర్జునుడు - జీవుడు
- రథం - శరీరం
- రథసారథి - కృష్ణుడు
- కళ్ళెం - మనస్సు
- గుఱ్ఱాలు - ఇంద్రియాలు
- మార్గం - ఇంద్రియ విషయాలు
- ఆత్మ - భక్తి
నేర్పరి అయిన సారథి ఉంటే రథి మరింత ఉత్సాహంగా, నేర్పుగా యుద్ధం చేయగలుగుతాడు. అంటే, సమర్థుడైన సారథే విజయానికి పునాదిగా ఉంటాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆధ్యాత్మికంగా సమన్వయం చేస్తే, అనంతమైన జీవనయానమనే రథాన్ని నడిపించే సారథి భగవంతుడు. కాగా, రథి ` మానవుడని తెలుస్తుంది. నేనే ఈ సంసారాన్ని నడిపిస్తున్నాను అనే మాయ నుంచి మనిషి విముక్తుడు కావాలి. తాను నిమిత్త మాత్రుడననే భావన కలగాలి. ఇందుకోసం మనిషికి బోధన చేసే గురువు సారథి అవుతాడు. గురూపదేశాన్ని ఆచరించే మనిషి ‘రథి’ అవుతాడు. ఇదే రథి ` సారథి చిత్రం అందించే సందేశం.
‘గీత’ అంటే భగవద్గీతేనా?
భారతంలోనే ‘హంస గీత’, ‘అనుగీత’ వంటి చాలా ‘గీత’లు ఉన్నాయి. భాగవతంలో కపిలగీత, ఉద్ధవ గీత, రుద్రగీత వంటి ‘గీత’లు ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు పురాణంల్లో దేవీగీత, శివగీత, గణేశగీత వంటి అనేక ‘గీత’లు ఉన్నాయి. ఇవన్నీ ఆయా గీతలుగా పేరు పొందాయి.
వీటన్నిటికన్నా భిన్నంగా ‘గీత’ అంటే భగవద్గీత అన్నంతగా ప్రసిద్ధి పొందింది కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన గీత. నిజానికి, ఇతర గీతలన్నీ ఆయా గీతల్లోని ప్రధాన వ్యక్తులు / సందర్భాల పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ కోణంలో చూస్తే మన ‘గీత’ కృష్ణగీత అవ్వాలి. కానీ, ‘భగవద్గీత’ అనే పేరు వచ్చింది.
ఇందుకు కారణం ఏమిటంటే... అప్పటిదాకా ఉన్న ‘గీత’ల సమన్వయం, సారాంశం అంతా కృష్ణుడు చెప్పిన ‘గీత’లో ఉంది. భారతయుద్ధం ద్వాపర యుగం చివరి రోజుల్లో, అంటే... కలియుగం ప్రారంభపు రోజుల్లో జరిగింది. యుద్ధప్రారంభంలో ‘గీత’ ఆవిర్భవించింది. రెండు యుగాల సంధికాలంలో ఆవిర్భవించంటం శ్రీకృష్ణుడు చెప్పిన గీత యొక్క విశేషం. అంతేకాదు, సకల ఉపనిషత్తు సారాంశం కృష్ణుడు చెప్పిన గీతలో ఉంది. బ్రహ్మవిద్యకు ఇది ఆలంబనగా ఉంది. అందుకనే,ఈ ‘గీత’ సకల విద్యలకు ఆలవాలంగా, పరిపూర్ణగ్రంథంగా యావత్ప్రపంచ అంగీకారాన్ని అందుకుంది. సాక్షాత్తు భగవంతుడే భక్తుడికి చెప్పిన గీత ఇది. అర్జునుడు అనే పాత్రను అడ్డంగా పెట్టుకుని, రాబోయే కలియుగంలో మానవుడు ఆచరించాల్సిన కర్తవ్యాన్ని బోధించాడు పరమాత్మ. అందుకనే, భారతయుద్ధంలో వెలసిన ‘గీత’ భగవద్గీత అయింది. ‘గీత’ అనే పదం ‘భగవద్గీత’కు సామాన్యవాచకంగా మారింది. భాషా, ప్రాంత పరిధులు దాటి విశ్వం మొత్తానికి గురుస్థానాన్ని ఆక్రమించింది.
జయతు జయతు గీతా కృష్ణవక్త్ర ప్రభూతా
జయతు జయతు గీతా సర్వలోకైక మాతా
జయతు జయతు గీతా దైవసంపత్ప్రపూతా
జయతు జయతు గీతా విశ్వశాంతి ప్రసూతా