144ఏళ్ళకు జరుపుకునే మహాకుంభమేళా
కుంభమేళా అనే పేరు వినగానే మహోన్నతమైన ఆధ్యాత్మిక భావనలు మనసులను ముప్పిరిగొంటాయి. లోపలిపొరల్లో దాగి ఉన్న భక్తిభావాలను కుంభమేళా వంటి ఉత్సవాలే తట్టిలేపుతాయి. సాక్షాత్తూ శివస్వరూపులైన యోగుల సంచారం, ఏ నోట విన్నా ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ నాదం,,, సశాస్త్రీయంగా జరిగే పితృకార్యక్రమాలు... అన్నీ కలిసి మాటలకందని దైవిక సౌందర్యాన్ని కన్నులముందు నిలుపుతాయి. వీటన్నిటికన్నా మిన్నగా కోట్లాది ప్రజలు ఒకే సందర్భంలో పరమపావనమైన గంగానదిలో పుణ్యస్నానాలు చేసే దృశ్యం వీక్షించాలంటే కుంభమేళాకు వెళ్లాలి. కుంభమేళా సమున్నతమైన భారతీయ ఆధ్యాత్మిక చింతనకు కీర్తిపతాకం.
కుంభమేళా ఉత్సవం ఆచరణలోకి రావటం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మథించిన కథ మనకు తెలిసిందే. రాక్షసులు చేతికి చిక్కిన అమృతభాండాన్ని వారి నుంచి విడిపించేందుకు మహావిష్ణువు మోహినీ అవతారాన్ని ధరించాడు. తన మాయావిలాసంతో అమృతకలశాన్ని చేజిక్కించుకుని దేవతలకు పంచి పెట్టేస్తాడు. ఈ క్రమంలో విష్ణువు చేతిలో ఉన్న అమృతకలశం నుంచి నాలుగు బిందువులు జారి భూమి మీద నాలుగు ప్రాంతాల్లోని నదీజలాల్లో పడతాయి. ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అమృత బిందువులు కలిసిన పుణ్యవిశేషం చేత ఆ నదీజలాలు మరింత పవిత్రత, శక్తిని పొందాయి. ఇందుకు ప్రతీకగా ఆ నాలుగు ప్రాంతాల్లో నదీస్నానం ప్రధానాంశంగా కుంభమేళాలు జరుగుతాయి.