Tapasya |
తపస్సు - Thapassu
తపస్సు ఎందుకోసం చెయ్యాలి? ఎలా చేస్తే తపస్సు అవుతుంది? తపస్సు వల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
తపస్సంటే ఏంటి?తపస్సు చేసేందుకు ఇల్లు, బంధాలు విడిచిపెట్టాలా... కాషాయ వస్త్రాలు, దండ కమండలాలు ధరించాలా... అడవుల్లోకి వెళ్లి, కందమూలాలు తింటూ, ఏదో చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసుకోవడం తపస్సా? నిజంగా... ఇలా చేస్తేనే భగవదనుగ్రహం కలుగుతుందా?
నిజానికి తపస్సు అనేది ఒక జీవన విధానం. అదో క్రమశిక్షణ. మనిషి నియమబద్దంగా జీవితాన్ని గడపడానికి పెద్దలు సూచించిన సర్వోన్నత సాధన మార్గం అది.
సాధారణ అర్థంలో మనం అనుకునే తపస్సు కూడా తపస్సే. కానీ, అదొక్కటే కాదు. దైనందిన జీవితంలో ఉంటూ, తన ధర్మాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా, నూరుశాతం ఆచారాన్ని పాటించడమే తపస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నీ విడిచి ఎక్కడికో వెళ్లాలనుకోవడం పలాయన వాదమే కానీ, ఆధ్యాత్మికమార్గం కాదు. బాధ్యతల్ని విస్మరించిన వారికి ముక్తిద్వారాలు తెరుచుకోవు. కాబట్టి స్వధర్మ కర్మాచరణే సిసలైన తపస్సవుతుంది. మహాభారతం అరణ్యపర్వంలో ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి పొందిన ఘట్టంలో ధర్మరాజును యక్షుడు అడిగిన 72 ప్రశ్నల్లో ‘తపస్సు అంటే ఏమిటి?’ అనే ప్రశ్న కూడా ఉంది. ఇందుకు ధర్మరాజు - ‘తన వృత్తి, కుల ధర్మాన్ని ఆచరించటమే తపస్సు’ అని చెబుతాడు.
తపస్సు అంటే తపించడం. ఒక పని సాధించటం కోసం మనం పడే ఆరాటం, ఆ పని తప్ప లోకంలో మరొకటి లేదన్నంతగా లక్ష్యాన్ని సాధించడం కోసం చేసే శ్రమ. భగీరథుడు సరిగ్గా ఇదే చేశాడు. దేవలోకంలో ఉండే గంగానదిని భూమి మీదకు తీసుకురావాలని ఎన్నో యుగాల నాడు ఆయన చేసిన ప్రయత్నరూప తపస్సు ఫలితాన్ని ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం కదా. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి కలిగి ఉండి నమ్మిన లక్ష్యం మీద మనస్సు నిలిపి ధ్యానం చేయడమే తపస్సు. ఇదే విషయాన్ని అని సనత్కుమారుడు వ్యాసుడికి చెప్పాడు. సనత్కుమారుడు చెప్పిన తపో మార్గాలలో సామాజిక శ్రేయస్సుకు పనికి వచ్చే అనేక విషయాలున్నాయి. చెరువులను తవ్వించడం, బావులను నిర్మించడం వంటివి లోక కల్యాణం కోసం నిరంతరం సద్బుద్ధితో, నిస్వార్ధభావనతో చేసే వ్యక్తి కూడా చక్కటి తపస్సు చేస్తున్న వాడికిందే లెక్క. ధ్యానం చేసుకుంటూ భగవంతుడిని గురించి తపస్సు చేసే వ్యక్తి పొందే ఫలితాలను సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులు కూడా పొందగలరని వివరించారు. కేవలం తనకోసం కాక పదిమంది మేలు కోసం చేసే ఏ పనైనా ఉత్తమమైన తపస్సేనని చెప్పడమే శివ పురాణం నొక్కి వక్కాణించింది.
ఆదిశంకరాచార్యులు కూడా ఈవిషయాన్నే చెబుతూ. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్’ అంటారు. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ పరమేశ్వర ఆరాధనే అవుతుందన్నారు శంకరులు. మనస్సు, వాక్కు, ఆచరణ - ఈ మూడింటిలో ఏకత్వభావన (త్రికరణశుద్ధి) సాధించాలి. అదే తపస్సు అవుతుంది. నిజానికి శ్రద్ధతో చేసే ప్రతి పనీ తపస్సే. దేన్నైనా సరే అంతఃకరణ శుద్ధితో, దీక్షతో చేస్తున్నప్పుడు నాణ్యమైన ఫలితాలు వస్తాయి. అలా చేసే ప్రతి పనీ తపస్సే. అందుకే తపస్సు ఇచ్చే ముఖ్యమైన ఫలితాల్లో నాణ్యతను ముఖ్యమైందిగా చెప్పొచ్చు.
సమాజమే తపోభూమి...
తపస్సు చేసుకోవటానికి ఇల్లు విడిచి అరణ్యాలు పట్టాల్సిన అవసరం లేదు. ఇంటినే తపోభూమిగా మార్చుకోవాలి. ఇందుకోసం మొదటగా మనిషి తాను మారాలి. తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. మానవ జన్మను సార్థకం చేసుకునే పనులు చెయ్యాలి. స్వామి వివేకానంద ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యరికం చేశాడే కానీ అడవులకు వెళ్లి ముక్కుమూసుకుని, తపస్సు చెయ్యలేదు. జాతి సముద్ధరణే జీవిత సర్వస్వం అనుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా తన పేరు చెబితేనే ధైర్యం కలిగేంతగా జాతిని చైతన్యపరిచారు. యుగాల పాటు తపస్సు చేస్తే వచ్చే ఫలితాన్ని ప్రజాజీవితంలో ఉంటూనే పొందారు. ఇంకా ఎందరెందరో... వీరి మార్గం అనుసరణీయం.
భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంలో శ్రీకృష్ణపరమాత్మ తపస్సు మూడురకాలుగా ఉంటుందని చెప్పాడు.
- శారీరక తపస్సు : దేవతలను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను పూజించటం, త్రికరణశుద్ధిగా ఉండడం, ఇతర ప్రాణులను హింసించకుండా ఉండడం.
- వాచక తపస్సు : ఉద్వేగపూరితంగా మాట్లాడకుండా ఉండడం, సత్యం మాట్లాడడం, ఇతరులకు ప్రియం కలిగించేలా మాట్లాడడం, తన ధర్మాన్ని అనుసరిస్తూ స్తోత్రాలు, మంత్రాలు పఠించడం.
- మానసిక తపస్సు : మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ప్రసన్నమైన వదనం, ఆత్మనిగ్రహం, పరిశుద్ధమైన భావాలు కలిగిఉండడం.
నీ పని మానొద్దు!
స్వధర్మాన్ని పాటించడం, చిత్తశుద్ధితో ఆచరించడం తపస్సు అవుతుంది. మహాభారతంలోని ‘ధర్మవ్యాధుడి’ వృత్తాంతం ఇందుకు ఉదాహరణ. మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు.
కౌశికుడనే బ్రహ్మచారి అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు. ఒక రోజున చెట్టు మీద ఉన్న పిట్ట వేసిన రెట్ట అతడి మీద పడుతుంది. ఆగ్రహంతో తలెత్తి పైకి చూస్తాడు కౌశికుడు. తపశ్శక్తితో కూడిన అతడి నేత్రదృష్టికి ఆ పక్షి ప్రాణాలు కోల్పోతుంది. భిక్షాటన చేస్తూ ఓ గృహిణి ఇంటి ముందు ఆగి ‘భవతీ భిక్షాందేహి’ అని అడుగుతాడు. భర్తకు పరిచర్యలు చేస్తూ ఆలస్యంగా భిక్షను ఇవ్వబోయిన ఆ ఇల్లాలిని కౌశికుడు అతడు కోపంగా చూస్తాడు. ‘నీ కోపానికి మాడిపోవటానికి నేను పిట్టను కాదు’ అంటుందామె. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు ఎలా తెలిసిందని, సాధారణ ఇల్లాలికి అంత శక్తి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతాడు. అందుకామె ‘ఇల్లాలిగా నా ధర్మ నిర్వహణ తప్ప నాకు మరొకటి తెలియదు. మిథిలానగరంలో ధర్మవ్యాధుడనే వ్యక్తి దగ్గరకు వెళ్లు. అతడు నీకు బోధ చేస్తా’డని చెబుతుంది. మిథిలకు వెళ్లిన కౌశికుడు మాంసం విక్రయిస్తూ జీవించే ధర్మవ్యాధుడిని చూసి ‘నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఏ తపస్సు చేశావని’ ప్రశ్నించాడు.
‘నాయనా! నాకు ఏ తపస్సూ తెలియదు. నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను. నా తల్లిదండ్రులను ఏమాత్రం కష్టపెట్టను. వారికి సేవ చేస్తాను. ఎవరినీ బాధ పెట్టను. పెద్దలను, జ్ఞానులను, గురువులను గౌరవిస్తాను. అసత్యం పలకను. భార్యను తప్ప పరస్త్రీల వైపు కన్నెత్తి చూడను. ఆశ, అసూయలను మనసులోకి రానివ్వను. నిందలను, పొగడ్తలను సమంగా స్వీకరిస్తాను. ఇదే నేను చేసే తపస్సు’ అని చెబుతాడు. మహాసాధ్వి అయిన ఇల్లాలు పంపించిన కారణంగా నీతో మాట్లాడాను తప్ప, నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదంటాడు.
‘ఒకే ఒక్క బిడ్డవు కదా! తల్లిదండ్రుల్ని వదిలేసి, అడవులకు వెళ్లి ముక్కుమూసుకోవటం వల్ల మోక్షం రాదయ్యా. నీ తల్లిదండ్రులకు సేవ చెయ్యాల్సిన కర్తవ్యం విడిచిపెట్టావు. ఇలాగైతే, నీ తపస్సు ఫలించదు. కన్నవారిని సేవించుకో. నీ ధర్మాన్ని పాటించు. అదే తపస్సు చేసిన ఫలితాన్నిస్తుంద’ని బోధ చేస్తాడు.
రచన:- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115