Chandamama's stories |
సువర్ణదేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నల మహా రాజు కనిపించి, కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి అద్భుతంగా వుంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించుకోవాలనుకున్నాడు. మర్నాడాయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు.
ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్తరకం వంటకాన్నుంచుకుని, కొద్ది కొద్దిగా తీసుకుని తింటున్నాడు. ఆ సువాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి, అదేమిటని వంటవాణ్ణి అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, “ప్రభూ! ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసూ, కారం మరీ ఎక్కువగా వుంటాయి. ఇది తిన్నవారికి ఒక పట్టాన నిద్రపట్టదు. నాకిది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి, ఈ చౌక బారు వంటకంతో నేనెంతో తృప్తిపడుతుంటాను,” అన్నాడు.
అయితే, రాజు ఊరుకోక వంటవాడు తనకోసం చేసుకున్న ఆ వంటకాన్ని కొంత తనూ తిన్నాడు. అది ఆయనకెంతో నచ్చి, “ఇక మీదట వారానికి రెండు సార్లయినా ఇలాంటిది తయారుచేసి, నా భోజనంతో జత పరుస్తూండు,” అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్ట లేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదొకరకంగా వున్నది. ఆయన, మంచం మీద లేచి కూర్చుని, మహారాణిని నిద్ర లేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు.
“యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్హాడని మీరు బెంగ పడకండి. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయసు. అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు,” అన్నది రాణి నిద్రమత్తుతో ఆవలిస్తూ.
యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడి, ఇంకా విశేషాలడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలోపడింది. రాజుకు నిద్ర పట్టక వైద్యుడి కోసం కబురంపాడు. వైద్యుడితోపాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చారు.
వైద్యుడు, రాజును పరీక్షించి నిద్రపట్టక పోవడానికికారణం అంతుపట్టడం లేదన్నాడు. తనుతిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాట పడ్డాడు. మన ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తరిగిపోతున్నది. అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకూ వస్తుంది పరిష్కార మార్గం దోరక్కపోదు అన్నాడు కోశాధికారి. “కొందరు రాజ ద్రోహులు పొరుగు రాజు సాయంతో మన దేశాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని, మీరు నిద్ర పాడుచేసుకోకండి. ఇందుకు ప్రతిగా మనం ఏదో వ్యూహం పన్న లేకపోము,” అన్నాడు సైన్యాధిపతి.
“రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనమిచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడంలేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమరు నిద్ర పాడుచేసుకుని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఉపాయం ఆలోచించగలం?” అన్నాడు మంత్రి.
రాజు వాళ్ళను పంపేశాడు. తనకు నిద్రపట్టక పోవడానికి ఇవేమీ కారణాలు కావని ఆయనకు తెలుసు, అసలు విషయం తల్లికి తప్ప ఎవరికీ చెప్పుకోలేననిపించి, ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు.
ఆ సమయంలో రాజమాత మెలకువగానే వుండి ఏదో గొణుక్కుంటున్నది. కొడుకును చూడగానే ఆమె, “నీకు నిద్ర పట్టడం లేదు కదూ, నాకు తెలుసు! కొడుకు విలాసాల్లో మునిగి పోయాడు. కోశాగారంలో డబ్బు తరిగి పోయింది. అవతల పొరుగు రాజుల నుంచి యుద్ధభయం. ఇవతల దేశంలో అవినీతి! ఏ రాజుకు మాత్రం నిద్రపడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే, ఆయన ఏమీ పట్టించుకో కుండా ఒళ్ళెరగని నిద్రపోతున్నారు. నీ పగ స్థితి తెలుసుకుని నాకు నిద్రపట్టక, నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుచుకుంటూ ఇలా కూర్చున్నాను,” అన్నది.
“అమ్మా!నా నిద్రాభంగానికి కారణం నువ్వ నుకుంటున్నవేమీ కాదు. భోజనంలో ఏదో తేడా చ్చింది,” అన్నాడు రాజు, అందుకు రాజమాత నవ్వి, “చిన్నప్పటి నుంచీ నువ్వింతే! నీ బాధకు కారణం నీకే తెలియదు. రాజరికం చేసే వాడికి సుఖంగా నిద్ర పట్టిందంటే -- ఆ దేశంలో సమస్యలన్నవి లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్ర పోయే రాజు, ఏ దేశానికైనా అరిష్టం. నీ వయనులో నీ తండి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు. ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తల్చుకుంటూంటే, నాకే నిద్ర పట్టడంలేదు. నీకేం నిద్రపడుతుంది? నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు. ఆ తర్వాతే నీకు నిద్ర పడుతుంది,” అన్నది.
రాజు మారుమాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుదిరిగాడు. అంతకాలం ఆయన కటుంబ సమస్యలను రాణిచూసుకుంటుందనీ, రాజరికపు బాధ్యతలను కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటారనీ నమ్మి నిశ్చింతగా వుంటున్నాడు. కానీ వాళ్ళంతా ఆ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు.
ఎన్నో సమస్యలుండగా అంత కాలం తను సుఖంగా, నిశ్చింతగా నిద్రపోగలిగి నందుకు సిగ్గుపడిన రాజు, తెలిసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానమిచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రా భంగం కలిగించిందని తెలిసి కంగారు పడు
తున్నవంటవాడు, బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు.