యుగయుగాలుగా అఖండ భూమండలం జపిస్తున్న తారకమంత్రం ఒకటే - అదే శ్రీరామ మంత్రం. కేవలం 'రామ' అనే పదం పలికినంతలోనే మనసు ఎంతో తేలికపడుతుంది.
అంతులేని ఆనందం కలుగుతుంది. గుండె గదుల్లో గూడుకట్టుకున్న విచారం మటుమాయం అవుతుంది. ఎల్లలు లేని ప్రశాంతత కలుగుతుంది. ఇక అంతా మంచే జరుగుతుందన్న భరోసా కలుగుతుంది. కుల, మత, వర్గ, ప్రాంత, జాతి విచక్షణ లేకుండా సకల మానవాళీ రామయ్యను తమ దైవంగా, ఇంటి బంధువుగా, ఇలవేల్పుగా, ఆత్మబంధువుగా కొలుచుకుంటుంది. రామయ్య విషయంలో ఎవరికీ అభిప్రాయ భేదాలు లేవు. మరే ఇతర దైవానికి సాధ్యం కాని మహత్తు ఇది. రామయ్యకే ఎలా సాధ్యమైంది?
సకల సుగుణాలు పోతపోసి, తీర్చిదిద్దిన రూపమా అన్నట్లు రామయ్య అడుగడుగునా దర్శనమిస్తారు. యావద్భూమండలంలో ఉన్న అన్ని భాషల్లో రామకథ అవతరించటానికి కారణం ఇదే. వందల సంఖ్యలో కవులు రామ చరితను రాసి, రామ కథను గానం చేసి, పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారు. సుప్రసిద్ధ సంస్కృత రచయిత 'మురారి' తన 'అనర్ఘరాఘవం' అనే నాటకంలో ఇలా అంటాడు.
యదిక్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితం
గుణైరేతావద్భిర్జగతి పునరన్యో జయతి క:
'కవులందరూ రామకథను మాత్రమే ఎంచుకున్నారంటే, అది వారి దోషం ఎంతమాత్రం కానే కాదు. ఉత్తమోత్తమమైన సుగుణాలన్నీ కేవలం రామునిలో మాత్రమే కేంద్రీకృతం కావటం వల్లనే వారు అలా చేయాల్సి వచ్చింది. రామునితో సమానమైన ఉత్తమ గుణ సంపన్నుడు ఇంకా ఈ భూమి మీద జన్మించలేదు.' - ఈ ఒక్క వాక్యం చాలు శ్రీరామచంద్రుని జీవితం ఎంతటి ఉత్తమగుణ శోభితమైందో గ్రహించటానికి.
దేవతలంతా సాక్షాత్తు విష్ణు స్వరూపంగా కొలుస్తున్నా, 'ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' - నేను దశరథ మహారాజు కుమారుడను మాత్రమే అని అత్యంత అణకువగా పలకగలిగిన వినయ సంపద రామయ్యకే చెల్లింది. అందుకే ఆయన సకల లోకాలకు ఆరాధ్యుడయ్యాడు.
పూర్తిగా మానవుడిగా సంచరిస్తూ, కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, పాలకుడిగా ఎలా జీవించాలో ఆచరించి చూపించిన అవతారమూర్తి రామచంద్రమూర్తి. ఎంతటి కష్టం వచ్చినా, చేతికి అందివచ్చిన రాజ్యం విడిచిపెట్టాల్సి వచ్చినా, క్రూర మృగాల మధ్య జీవించాల్సి వచ్చినా, చివరకు భార్యను రాక్షసులు అపహరించినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సోదరుడు యుద్ధరంగంలో మూర్ఛపోయినా, ధర్మ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకనే 'రామో విగ్రహవాన్ ధర్మ:, రాజా సర్వలోకస్య దేవానామివ వాసవ:' అని రాక్షసులు కూడా రామయ్య ఘనతను కొనియాడారు. రామయ్య జీవితంలో అడుగడుగునా ధర్మమార్గం గోచరిస్తుంది.
వాల్మీకి రామచంద్రమూర్తి గుణగణాలను వివరిస్తూ ' స్మితభాషీ, హితభాషీ, పూర్వభాషీ చ రాఘవ:' అంటాడు. మేలు చేకూర్చే మాటలను, చిరునవ్వుతో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ, తానే ముందుగా ఇతరులను ఆప్యాయంగా పలకరించేవాడు రామయ్య. మ¬న్నతమైన ఈ గుణం వల్ల రామయ్య పట్ల ఎవరికీ ద్వేషభావం కలిగేదికాదు.
రామయ్య సీతమ్మను పందెంలో గెలిచి, వివాహం చేసుకున్నాడు. అలాగని, సీతారాములది ప్రేమ వివాహం కాదు. గాంధర్వ వివాహమో, మరే ఇతర పద్ధతో కాదు. పూర్తిగా పెద్దల అంగీకారంతో జరిగిన వివాహం. అయినా, రామయ్య బలవంతంగా, అయిష్టంగా సీతమ్మను స్వీకరించలేదు.
ప్రియాతు సీతా రామస్య దారా: పితృ కృతా ఇతి
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతి: భూయోభివర్ధత ||
పెద్దలు కుదిర్చిన వివాహం కావటం వల్ల రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడు. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుంది. ఆదర్శ దాంపత్యానికి అసలైన అర్థం ఇది. ఒకరినొకరు అర్థం చేసుకుని, అడుగులో అడుగు వేసుకుని జీవన గమనం సాగించాలన్న సందేశం రామయ్య ఆచరించి, చూపించాడు.
రాముడు అనగానే గుర్తుకువచ్చే పదం :
ఏకపత్నీవ్రతం. తన భార్యను తప్ప లోకంలో ఉన్న స్త్రీలందరినీ రామయ్య సోదర భావంతో చూసేవాడట. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకునే త్యాగరాజు తన పంచరత్న కృతుల్లో ఒకచోట రామయ్యను 'పరనారీ సోదరా!' అని సంబోధిస్తాడు. యావత్ప్రపంచం అనుక్షణం మననం చేసుకోవాల్సిన తారకమంత్రం ఇది. మూడుముళ్ళ బంధాలు మూడు క్షణాల సంబంధాలుగా మారుతున్న నేటి కాలంలో రామయ్య అనుసరించిన ఏకపత్నీవ్రతం, ఈనాటి యువతకు తక్షణ కర్తవ్యం.
తనను ఆశ్రయం కోరి వచ్చిన వారికి రాజుగా ఎలాంటి అభయం ఇవ్వాలో విభీషణుడి వృత్తాంతం ద్వారా రామచంద్రమూర్తి లోకానికి ఆచరించి చూపించాడు. అన్నగారి ధర్మబాహ్య ప్రవర్తన నచ్చని విభీషణుడు శ్రీరామ చరణాలను ఆశ్రయిస్తాడు. లక్ష్మణుడితో సహా వానర ప్రముఖులందరూ విభీషణునికి ఆశ్రయం ఇవ్వద్దని రామయ్యకు సూచిస్తారు. 'అభయం సర్వభూతోభ్యే దదామి, ఏతత్ వ్రతం మమ' - నన్ను ఆశ్రయించిన వారికి అభయం ఇచ్చి తీరతానన్నాడు రామయ్య. చివరకు రావణాసురుడు వచ్చినా, అతడికి కూడా అభయం ఇస్తాను. ఇది నా వ్రతం అని నిష్కర్షగా తేల్చి చెప్పాడు. ఇదీ రఘురాముని ఘనత.
యుద్ధరంగంలో రాముడు ప్రదర్శించిన పరాక్రమ స్ఫూర్తి అత్యద్భుతమైంది. 'రిపూణామపి వత్సల:' అని గరుత్మండుడే స్వయంగా రాముడిని కీర్తిస్తాడు. శత్రువుపై కూడా ఔదార్యం చూపించగల ఉత్తమ గుణం రామునికే సాధ్యం.
రామ, రావణ సంగ్రామం మొదలైంది. ఒక్కొక్కరుగా రాక్షస వీరులు నేలకొరుగుతున్నారు. ఇంద్రజిత్తు, లక్ష్మణుల యుద్ధం ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నాయి. చిట్టచివరికి లక్ష్మణుడు ఇలా అన్నాడు ...'ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది, పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైరం జహి రావణం' - నా అన్నగారైన రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషవంతుడు అయితే ఈ బాణం రావణసుతుడైన ఇంద్రజిత్తును సంహరించుగాక' అని, రాముని శ్రేష్ఠ గుణాలను తలచుకుని, బాణాన్ని ప్రయోగించాడు. ఉత్తరక్షణంలో ఇంద్రజిత్తు విగతజీవుడయ్యాడు. రాక్షసుడిని అంతం చేసింది రామచంద్రమూర్తి ఆచరించిన ధర్మవ్రత శక్తిగానీ, అస్త్రమహిమ కాదని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.
కుంభకర్ణుడు కూడా రాముని చేతిలో హతుడయ్యాడు. అప్పటికే రాక్షస వీరులందరూ స్వర్గానికి చేరుకున్నారు. చివరగా, రావణుడే యుద్ధరంగానికి కదిలి వచ్చాడు. రామరావణులు ఎదురెదురు పడ్డారు. నిరంతర శివనామ ధ్యానంతో, అఖండ శివపూజ ఫలితంగా మ¬న్నతమైన తేజస్సును సాధించిన రావణాసురుడిని చూసిన రామయ్య ఆశ్చర్యపోయాడు. 'ఆ¬దీప్తమ¬ తేజా, రావణో రాక్షసేశ్వర:, ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రస్మిభిర్భాతి రావణ:' - ఆహా! రావణుని తేజస్సు ఎంత గొప్పది. సూర్య సమానమైన తేజస్సు ఇతనిలో ఉంది అని శత్రువును సైతం శ్లాఘించాడు. శత్రువులోని గొప్పదనాన్ని ప్రశంసించగల ఔన్నత్యం రఘురామునికి మాత్రమే ఉంది. రావణుడు ఎంతటి తేజస్సంపన్నడైనా, ఎన్ని తపస్సులు చేసినా, ధర్మమార్గాన్ని విడిచిపెట్టటం వల్ల రాముని చేతిలో నిహతుడయ్యాడు.
'ఏతదస్త్ర బలం దివ్యం మమవా త్య్రంబకస్యవా...' - ప్రచండ భాస్కరుడిలా యుద్ధరంగంలో నిలిచిన రాముడు పలికిన మాట ఇది. 'ఈ పని (శత్రుసంహారం) నేను చేయగలను. లేదా శివుడు చేయగలడు. మూడోవానికి ఈ పని సాధ్యం కాదు' - ఇదీ రఘురాముని వీరపరాక్రమం. అంతేకాదు, తనకు శివునకు గల అభేదాన్ని కూడా రామయ్య ఈ సందర్భం ద్వారా ప్రకటిస్తాడు.
రామరావణ సంగ్రామంలో అరిభయంకరమైన తేజస్సుతో రాముడు చేస్తున్న శస్త్రాస్త్ర ప్రయోగానికి, చూపిస్తున్న క్షాత్ర పరాక్రమానికి హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానరవీరులు ఎంతో ఆశ్చర్యపోతారు. 'ఈయనకు మా సాయం అవసరమా? రాముడొక్కడే సకల రాక్షస గణాన్ని తుదముట్టించగలడు. లోకకల్యాణం కోసం తాను చేసే అధర్మ నిర్మూలనలో మాకు కూడా భాగం కల్పించటానికే రామయ్య మమ్మల్ని అనుగ్రహించాడు. ఇదంతా దైవలీల' అంటారు జాంబవంతాదులు. ఇదీ రఘురాముని పరాక్రమం.
రాముడిది సత్యపరాక్రమం. అందుకనే తాటకిని కూల్చింది మొదలు రావణ సంహారం రామచంద్రమూర్తి ప్రదర్శించిన శౌర్యప్రతాపాలను వర్ణించాల్సి వచ్చిన సందర్భంలో వాల్మీకి మహర్షి 'రామ: సత్యపరాక్రమ:', 'స్నిగ్ధ వర్ణ: ప్రతాపవాన్' - అనే పదాలను పునరుక్తి దోషం అని కూడా భావించకుండా, ఎన్నో సార్లు ఉపయోగించారు. అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ఋషివేషంలో ఉన్నా, ధర్మపరిరక్షణ కోసం క్షాత్రధర్మాన్ని ప్రదర్శించి, వారికి రాక్షసబాధ లేకుండా చేశాడు.
రామచంద్రమూర్తిది ధర్మవీరత్వం. అధర్మం పెచ్చుమీరినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి, ధర్మ మార్గాన్ని పున: ప్రతిష్ఠ చేయటానికి ధర్మం క్షాత్రరూపం దాలుస్తుంది. ఆ రూపమే ధర్మవీరత్వం. ఇటువంటి ధర్మవీరత్వానికి రాముడు నిలువెత్తు నిదర్శనం.
ఒకటా, రెండా...? వందలా.. వేలా..? ఇలాంటివి అనంతమైన ఉదాహరణలు రామాయణం నిండా ఉన్నాయి. రామయ్య ప్రతి అడుగులో ధర్మ దేవత ఆకృతిదాల్చి కనిపిస్తుంది. అందుకే సకల లోకాలకు ధర్మవీరుడైన రఘురాముని జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన మార్గం ధర్మమార్గంగా సమాజాన్ని సన్మార్గంవైపు నడిపిస్తుంది. అదే సకల మానవాళికి శ్రీరామరక్ష.
- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం