విదేశీ సనాతన హిందూ కుటుంబం |
మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చేసే తొమ్మిది ఋణములు
ఋణము:
తన ధర్మాన్ని తాను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నా చాలా మంది కష్టనష్టాలు పడుతూ ఉంటారు. ఒక్కో సారి జాతక రీత్యా దశ, అంతర్థశలను అనుసరించి జపం, దానాలు వంటివి ఎన్నో పరిహారాలు అనుసరించి చేయించినా పెద్దగా ఫలితం కనిపించక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకు కారణం 'ఋణాలు' అంటే అప్పులు కాదు .
ఆ ఋణాలు :
పితృఋణం. మాతృఋణం , పుత్రికా ఋణం , స్త్రీ ఋణం, సోదర ఋణం , దైవ ఋణం , ఋషి ఋణం , దాన ఋణం, గురు ఋణం.
ఈ తొమ్మిది ఋణాలు మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చూపిస్తూ ఉంటాయి . ఈ ఋణాలను తీర్చుకొనకపోతే ఆ వ్యక్తి మీద ఆ ఋణ బాధల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎన్ని పూజలు, హోమాలు చేయించినా సరైన ఫలితాలు ఉండదు. ఎంత కష్టపడినా జీవితం లో ఉన్నత శిఖరాలకు ఎదగలేక నిరాశ నిస్పృహలకు లోనౌవుతారు .
ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఋణబాధలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసి ఏ ఋణ బాధ అతనికి కష్టాలు కలుగచేస్తోందో గ్రహించాలి. దానితో పాటుగా గ్రహసంబంధ విషయాలను గుర్తించాలి . గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయటానికి ముందుగా ఈ తొమ్మిది ఋణాలు నుంచి అతడిని విముక్తుడిని చేసే మార్గాలు సూచించి అతను పాటించే నియమాలు, విధి విధానాలు తెలుసుకుని ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయించడం ద్వారా తగిన విధంగా ఫలితం ఉంటుంది.
పితృఋణం :
మరణించిన తండ్రి , తల్లి లేక అందుకు సమానమైన రక్త సంబంధీకులు మరణించిన తరువాత ఏ వ్యక్తి అయినా వారికి తాను చేయాల్సిన కర్మలను చేయకపోవడం ఆబ్దికం, సంవత్సరీక , తర్పణాలు విడవడం వంటివి శాస్త్రోక్తంగా కర్మలను నిర్వహించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి ఋణపడి ఉంటాడు . ఇందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఆటంకాలు, తీవ్ర నష్టాలు చూడటం జరుగుతున్నది. అకారణ శత్రువులు, అవమానాలు, నిందలు, కోర్టు వ్యవహారాలు, చెరసాల వంటి కష్టనష్టాలు పితృఋణం వల్ల కలుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పితృఋణం క్షయం చేయించుకోవాలి . ఆ తర్వాత మిగిలిన పరిహారం త్వరగా ఫలిస్తాయి.
మాతృఋణం :
ఏ వ్యక్తి అయినా తెలిసీ , తెలియక తన తల్లికి కోపాన్ని, వేదనను కలిగించడం , ఆమేను తిట్టడం, కొట్టటం, ఆమెపట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం , ఒక బిడ్డకు తల్లిని దూరం చేయడం లేక కుటుంబానికి యజమానురాలిని దూరం చేయడం మాతృశాపం గురిచేస్తుంది. దీని వలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ధనం తీవ్రంగా నష్టపోతారు , గృహం లో మనఃశాంతి లోపిస్తుంది. భూ, పశు సంపద వివాదాలు మొదలైన నష్టాలు చవిచూస్తారు . ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా మాతృఋణ శుద్ధి చేయించుకుని మిగిలిన పరిహారాలు ఆచరించాలి.
పుత్రికా ఋణం:
స్త్రీ సంతానం పట్ల దురుసుగా ప్రవర్తించడం , వారిని అకారణంగా బాధించడం వలన వారికి వేడుకలు చేయకపోవడం వల్ల వారి నుంచి ధనం , వస్తువులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రికా ఋణం ఏర్పడుతుంది. కొంత మంది వారి పుత్రికలకు వారికి ఇవ్వవలసిన ఆస్థిని ఇవ్వకుండా మగ పిల్లలకి మాత్రమే ఇచ్చి పుత్రికలకు ఇవ్వకపోవడం వల్ల కూడా కలుగుతుంది. ఈ విధమైన ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు, సంతానంతో విభేదాలు కలగటం తో పాటు ధనం నష్టం, అవమానాలు, ఒక్కో సారి ఒంటరిగా జీవించడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పుత్రికా ఋణం తప్పకుండా తీర్చుకోవడం తప్పనిసరి.
స్త్రీ ఋణం :
భార్య , పర స్త్రీ వీరిద్దరి విషయం లో ప్రియురాలు. ఉంపుడు గత్తె విషయంలో కూడా చేసే దుర్మార్గం స్త్రీ ఋణంగా పీడిస్తుంది.
భార్యను కొట్టడం , తిట్టడం, ఆమే స్వర్జితం దొంగిలించడం , భయపెట్టి లాక్కోవడం, ఆమెను పస్తులుంచడం, మానరక్షణకు వస్త్రాలు సమకూర్చక పోవడం , కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం, ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేక వెళ్లి పోయేలా చేయడం , భార్యాభర్తలను లేని పోని అనుమానం తో , లేనిపోనివి సృష్టించి వారిని విడదీయడం , పరస్ర్తీని కామించడం , ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, ఆమె మీద నిందలు ప్రచారం చేయడం, ఆమెను బలాత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం , భయపెట్టడం , ఉంపుడుగత్తెగా ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించడం , అనుమానం తో వేధింపులు పెట్టడం , మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివి అన్ని స్త్రీ ఋణంగా పరిగణనలోకి వస్తాయి. ఈ ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత ఉండదు. గృహ శాంతి ఉండదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తొడు వ్యసనాలకు బానిస అవుతాడు. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మానసిక అశాంతిని పొందుతారు. దారిద్ర్యం తో పాటు శరీరం రోజురోజుకూ శుష్కించి పోవడం జరుగుతుంది. అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు జీవితం లో ఒక్క పని కూడా ముందుకు రావడం జరుగదు. ఈ స్త్రీ ఋణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు.
సోదర ఋణం:
తన రక్త సంబంధీకులతో అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం వారి స్వార్జితమైన ధనం తన అవసరాలకు వాడుకోవడం లేక వారికి చెందవలసిన ధన, కనక, వస్తు, వాహన, భూ, గృహ, లాంటి వాటిని తీసేసుకోవఠం వల్ల సోదర ఋణం ఏర్పడుతుంది. ఈ ఋణం కలిగిన వ్యక్తి దారిద్ర్యం పొందుతారు. తన జీవిత కాలం అంతా కష్టపడినా కూడా మనశాంతి పొందడు. అతని కుటుంబంలో భార్య లేక భార్య వైపు బంధువుల యొక్క ఆధిపత్యము అధికంగా ఉంటుంది. జీవితం చివరి దశకు వచ్చే సరికి హీనమైన, దీనస్థితి పొందుతారు.
దైవ ఋణం :
తెలిసి తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు ఈ దైవ ఋణానికి కారణం అవుతాయి. ఈ ఋణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తానూ దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసా వాచా కర్మణా ఆరాదించడు, అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తారు ..వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒక వేళ చేయించినా ఫలితం ఉండకపోగా వీరికి చేయించిన పౌరోహితుడు వీరితో అనేక ఇబ్బందులు పడతాడు...
ఇక భ్రుణ హత్య, పుత్రుడిని చంపడం, పెంపుడు జంతువులను చంపడం , గోహత్య వంటి పంచమహపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ ఋణం పాలవుతారు..వీరు సొంత మనుషులను కూడా హింసించడానికి వెనుకాడరు.
ఈ ఋణం వలన ప్రప్రథమంగా సంతాన హీనత కలుగుతుంది.. లేక అంగవైకల్యం తో సంతానం కలుగుతుంది. ఆ సంతానం పై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ ఋణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి. మానసిక అశాంతిని కలిగి ఉంటారు..వీరితో పాటు వీరి సన్నిహితులకు కూడా చెడు ఆలోచనలను చేసి ప్రభావితం చేస్తారు .
ఋషి ఋణం:
తమ వంశానికి మూలపురుషుడు ఋషిని సేవించలేకపోవడం , సాదు సన్యాసుల పట్ల తెలిసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించడం, ఋషిప్రోక్తమైన ఉపదేశాలను హేళన చేయడం వల్ల, తీసుకున్న మంత్రాన్ని సరిగా జపం చేయలేక అది ఇచ్చిన వారిని తక్కువ చూడటం , ఋషి ఋణం కిందకు వస్తాయి.ఋషి ఋణం ఉన్న వారిలో మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఆవేశం వల్ల అనేక కష్టనష్టాలను పాలవుతుంటారు. ఏం చేసినా కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉంటాడు . ఇటువంటి వారు ఋషి ఋణం తీర్చుకోవాలి.
దాన ఋణం :
ఒకరికి దానం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతి ఫలం కోరటం, పనికి రాని దానం చేయడం, దానం చేసిన వానిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన ఋణం కలిగిస్తాయి. ఈ ఋణం పొందిన వారు తరచుగా వివాదాలు పాలవుతారు. ధనం , కుటుంబ జీవనం నష్టపోయినపుడు, వ్యసనాల పాలు అవుతారు. దారిద్ర్యం , ఋణ బాధలు, బంధు , మిత్రుల నిరాదరణకు పొందటం తో పాటు అవమానాలు అపకీర్తిని భరించవలసి వస్తుంది.
గురు ఋణం:
గురువు లేదా అంతకు సమానమైన హితుల పట్ల చేసే అపచారం గురు ఋణం గా బాధిస్తాయి.తరచు తగవులు, మిత్రులతో విభేదాలు, ఉపాధిని కోల్పోవడం , వివేకాన్ని కోల్పోయి సమాజం లో అపకీర్తిని భరించవలసి వస్తుంది.
ఈ 9 రకాల ఋణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం లోతుగా పరిశీలిస్తే అర్దం అవుతుంది.