-తనికెళ్ళ సత్య రవికుమార్,
VHP ప్రాంత కార్యదర్శి, ఉత్తరాంధ్ర,
కన్వీనర్, హైందవ శంఖారావం
దేవాలయం మన భారత జాతికి హృదయం. శుభసంస్కారాల కేంద్రం. అనాదిగా సమాజాన్ని నడిపిస్తున్న ఆచార్య పీఠం. ప్రగతి పరిమళాలు వెదజల్లే సామాజిక నందనవనం. దేవాలయం యావత్ హిందూ సమాజ ప్రతిరూపం.
సంస్కృతీ, సాంప్రదాయాల సుస్వరూపం. హైందవ జాతికి దేవాలయం వైభవ శిఖరం. ఆలయాలలో శ్రుతి, స్మృతి, ఆగమ పద్ధతులలో సాకార దేవతార్చన జరపడం లోక కళ్యాణ కారకం. దేవాలయం సామూహిక పూజా పద్ధతికి కేంద్రం. అందువల్లనే దేవాలయం హిందూ సమాజ జాగరణ కేంద్రం అయింది. స్ఫూర్తి కేంద్రం అయింది. దేవాలయం హిందూ సమాజానికి శ్రద్ధా కేంద్రం అయింది. ఆలయాలకు యుగాలనాటి చరిత్ర ఉన్నది. హిమాద్రి మొదలు హిందూ సాగరం వరకు వైవిధ్యభరితమైన ఆలయాలు హైందవ సంస్కృతీ చిహ్నాలుగా శోభిల్లుతున్నాయి.
ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాలలో జరిగే అర్చన వేద విహితమైనది. దీనివల్ల లోకహితము, అశుభాల నివారణ జరుగుతుంది. ప్రకృతి పుష్టి జరిగి పాడిపంటలతో సమాజం తులతూగుతుంది. నిరాకార దేవతా ఉపాసన వేద ప్రతిపాదిత మహోన్నత స్థితి. ఇది సామాన్యులకు సాధ్యం కాదు. సామూహికంగా సమాజం దీనిని సాధించడానికి ఋషులు, మునులు ప్రతిపాదించిన మౌలిక మార్గం సాకార దేవతార్చన. దీనికోసం యుగయుగాలుగా దేవాలయ వ్యవస్థ ఏర్పడింది. తరాల నుండి తరాలకు మన శుభ సంస్కారాలు, ధర్మనిర్దేశాలు, వైదిక సంప్రదాయాలు, సంస్కృతులు నిరంతరం పరిసరింపజేసే కేంద్రాలు మన దేవాలయాలు. అమ్మ ఒడిలో అంకురించి, గుడిలో పల్లవించి, బడిలో పరిమళించి, సమాజానికి ఫలాలు అందించే తరతరాల వారసత్వ సంపదలు మన దేవాలయాలు. ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక జాతీయ పతాకం ఉంటుంది. అది దేశ సార్వభౌమాధికారానికి, గౌరవానికి ప్రతీక. అలాగే మన దేవాలయాలు హిందూ ధర్మ వైభవానికి శౌర్య పరాక్రమ చరిత్రకు సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలు. దేవాలయాలు మన దేశ, ధర్మ రక్షణ కేంద్రాలు.
దేవాలయం ఒక ఉపాధి కేంద్రం. దేవాలయాలు సమాజంలో అనేక వృత్తుల వారికి ఉపాధిని అందించేవి. తద్వారా వారి కుటుంబాల పోషణకు దేవాలయాలు ఉపాధి కేంద్రాలుగా సహకరించేవి. స్థపతిగా, వడ్రంగిగా, కుమ్మరిగా, కంసాలిగా, తాపీవానిగా, వంటవానిగా, రధసారథిగా, అర్చకునిగా, ఆచార్యునిగా, కళాకారునిగా, పురాణ ప్రవచకునిగా, జ్యోతిష్య, వాస్తు పండితునిగా, వైద్యునిగా, వేద పండితునిగా, పురాణ ప్రవచకునిగా, గ్రంథాల ముద్రకునిగా, ఆలయ భూములు సాగు చేసే కర్షకునిగా, ఫల,పుష్ప దుకాణ దారునిగా ఇలా పద్దెనిమిది వృత్తుల వారికి ఉపాధి, ఆదాయం అందించే ఉపాధి కేంద్రాలుగా ఆలయాలు ఉండేవి. సామాజిక తత్వానికి విగ్రహరూపంగా అవతరించిన మన దేవాలయాలు సమాజానికి ప్రతిరూపాలయ్యాయి. దేవాలయాలలో అనాదిగా భోజనశాల, ధర్మశాల, మల్లశాల, యోగశాల, వేదశాల, గోశాల ఇత్యాది అనేక రకాల వ్యవస్థలు నిర్వహించబడేవి. వీటి నిర్వహణకు ప్రతి హిందువు తన ఆదాయంలో కొంత దేవాలయానికి కేటాయించేవారు. ఆ ధనాన్ని ఆ దేవాలయం నిర్వహించే ధర్మకర్తలు సక్రమంగా సద్వినియోగపరిచేవారు.
ఇంటి కంటే గుడి పదిలం అన్నారు. ఇది సార్ధకమైన సామెత. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రంగా, అన్న కేంద్రంగా, ఆశ్రయ కేంద్రంగా, ధర్మసత్రంగా, విద్యాలయంగా, వైద్యాలయంగా, గ్రంథాలయంగా, యోగనిలయంగా, శ్రద్ధా కేంద్రంగా, స్ఫూర్తి కేంద్రంగా విరాజమానమై ఉండేవి. అనేక దేవాలయాలలో యజ్ఞశాలలు, పారాయణశాలలు, ప్రవచనశాలలు, సేవా కేంద్రాలు, ప్రచురణశాలలు, వ్యాయామశాలలు, భజనశాలల నిర్వహణ జరుగుచుండేవి. దేవాలయం మన సామాజిక సేవా కేంద్రం. దేవాలయం ద్వారా పేదలకు, అవిటి వారికి, అన్నార్తులకు, సన్యాసులకు, సాధు మహాత్ములకు ఆశ్రయం అందించబడేది.
విదేశీ మ్లేచ్చులు, పరాయి పాలకులు దేవాలయ వ్యవస్థలు నాశనం చేశారు. దేవాలయ సంపదలు దోపిడీ చేశారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి ఆనాడు సన్యాసులు, ధర్మాచార్యులు ఆలయం రక్షణ కోసం సమాజానికి ప్రేరణ అందించి ముందుకు నడిపి దేవాలయ రక్షణకు సమాజం నడుంబిగించేలా చేసారు. బ్రాహ్మ్య శక్తి, క్షాత్ర శక్తి ఏకీకృతమై దేవాలయాలను రక్షించుకున్నాయి. అలాగే దేవాలయ రక్షణలో ప్రభువులు, పాలకులు విఫలమైన నాడు దేవాలయాలకు అనుబంధంగా ధర్మాచార్యులు అఖాడాలు (వ్యాయామశాలలు) ఏర్పాటు చేసి యువ సన్యాసులకు శిక్షణ ఇచ్చి దేవాలయాలను రక్షించి, ధర్మాన్ని కాపాడారు.
శతాబ్దాల మన దేశ చరిత్రను పరిశీలిస్తే విదేశీ ఆక్రమణదారులు వారి పాలనను సుస్థిరం చేసుకోవడానికి ఆలయాలు ధ్వంసం చేయడం లక్ష్యంగా చేసుకున్నారు. మహమ్మదీయులు దేవాలయాల విధ్వంసం చేశారు. ఆ తరువాత వచ్చిన క్రైస్తవ బ్రిటిష్ పాలకులు దేవాలయాల ఆస్తులపై కన్నేసి వాటిని లూటీ చేసారు. దేవాలయ ఆదాయాలను సొంతం చేసుకున్నారు. దేశానికి స్వతంత్రం కోసం సర్వం అర్పణ చేసి, బలిదానాలు చేసి, పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని సాధించారు. స్వతంత్రం వచ్చాకా ప్రభుత్వాలు. హిందువులను ఉపేక్షించాయి. స్వతంత్ర ఫలాలు దేశవ్యాప్తంగా హిందువులకు దూరం చేసాయి. 1897 లో బ్రిటీష్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా చేసిన చారిటీస్ అండ్ హిందూ రిలీజియస్ కంట్రోల్ యాక్ట్ చేసి దేవాలయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని దోపిడీ చేసారు. దీని కొనసాగింపుగా 19875 ప్రభుత్వం రాష్ట్రంలో ఎండోమెంట్ యాక్ట్ చేసి ఆస్తులు, సంపదలు, ఆదాయాలు ఉన్న ఆలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకున్నది. ఈ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ద్వారా దేవాలయాల ఆదాయాలను ప్రభుత్వాలు ధార్మిక కార్యాలకు కాకుండా ప్రభుత్వ పాలనాకార్యాలకు కేటాయించడం ప్రారంభించాయి. ధర్మ ప్రచారం శూన్యమైంది. దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మార్చారు. రాజకీయ పునరావాస కేంద్రాలు చేశారు. అన్యమతస్థులను ఆలయాలలో ఉద్యోగులను చేసారు. ఎండోమెంట్ యాక్ట్ కారణంగా హిందూ దేవాలయాలు హిందువుల చేతులలో లేకుండా పోయాయి. సెక్యులర్ కేంద్రాలుగా మార్చే కుట్రలు చేసారు. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. ప్రభుత్వమే దేవాలయ ఆస్తులను స్వాధీనం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలకు, ప్రజా సౌకర్యాలకు వినియోగించింది. స్వాధీనం చేసుకున్న దేవాలయ భూములకు పరిహారం చెల్లించలేదు. దీనివల్ల అనేక దేవాలయాలు ఆస్తులు కోల్పోయి ఆలయ నిర్వహణ ఇబ్బందులలో పడింది. ఆ విధంగా ఆస్తులు కోల్పోయిన దేవాలయాల నిర్వహణ నుంచి దేవాదాయ శాఖ తప్పుకుని, వాటిని స్థానికులకు వదిలేసింది. ఈ విధంగా ప్రభుత్వము, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాల నిర్వహణలో, ఆలయ ఆస్తుల సంరక్షణలో, ధార్మిక ప్రచారంలో పూర్తిగా విఫలమయ్యాయి.
ఇటువంటి విపత్కర స్థితిలో మనం అందరం ఏకమై ప్రాంత, వర్ణ, వర్గ భేదాలను విడిచిపెట్టి, హిందూ ధర్మరక్షణ కొరకు, దేవాలయాల పరిరక్షణ కొరకు ముందుకు రావాలి. యావత్ భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రం దేవాలయ పరిరక్షణలో ఆదర్శంగా నిలవాలి. గాఢాంధకారంలో ఉన్న హిందూ సమాజంలో దేవాలయాల పరిరక్షణకు కర్తవ్య దీపం వెలిగించేందుకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ స్థాయిలో ప్రారంభించిన దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమంలో మనందరం భాగస్వాములు కావాలి.
మన పల్లెలో ఆలయాల వెలుగుల కొరకు, స్వయం ప్రతిపత్తి కొరకు, శతాబ్దాలుగా నిస్సహాయంగా, శిథిలమవుతున్న దేవాలయాలకు ప్రాణం పోయుట కొరకు, గ్రామాలలో గుడి గంటల ధ్వని ప్రతిధ్వనించడం కొరకు హైందవ శంఖారావ సభ ఏర్పాటు చేయబడింది. ఇది మన దేవాలయపై ఆవరించిన చీకటులను పారద్రోలి వెలుగులు నింపే జాగరణ ఉద్యమం. ఈ హైందవ శంఖారావ సభ ద్వారా దేవాలయ ప్రగతి ప్రభలు ప్రస్ఫుటిస్తాయి. దేవాలయాల స్వయం ప్రతిపత్తి పోరాటానికి ప్రతి హిందువు సైనికుడు కావాలి. ఈ ధార్మిక స్వతంత్ర పోరాటానికి నాయకుడు కావాలి. దేవాలయ రక్ష మన దీక్ష కావాలి. 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావ సభకు తరలి రావాలి. చలో విజయవాడ ఇది మన నినాదం కావాలి. దేవాలయ రక్షణకు ప్రతి హిందువు నడుంకట్టి ముందుకు రావాలి.