First anniversary of Bala Ramaiah's death |
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం రామయ్య జన్మించిన అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు,
అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో.. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఉత్సవాలను జనవరి 22కి బదులుగా జనవరి 11న జరపనున్నారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రామనగరిని పెళ్లికూతురులా అలంకరించనున్నారు. మొదటి వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని జరపనున్న ఉత్సవాల సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రాంత ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ అందించారు. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం జరపనున్నామని ఆయన చెప్పారు.
2024 జనవరి 22న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి రోజున బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని ఆయన చెప్పారు. ఈ నెపధ్యంలో ఈ ఏడాది 2025 జనవరి నెలలో జనవరి 11న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి వచ్చింది. కనుక హిందూ పంచాంగం ప్రకారం ఈ తిధిని ‘ప్రతిష్ఠ ద్వాదశి’ గా పిలుస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు నాలుగు చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ సముదాయంలోని యాగ మండపంలో జరిగే కార్యక్రమాలు.
శుక్ల యజుర్వేద మధ్యదాని శాఖలోని 40 అధ్యాయాల 1975 మంత్రాలు అగ్నిదేవునికి సమర్పించబడతాయి. 11 వేద మంత్రాలను పఠిస్తారు. ఈ పూజాది కార్యక్రమాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే సమయంలో శ్రీరామ మంత్రాన్ని పఠించే యాగం కూడా రెండు సెషన్లలో జరుగుతుంది. 6 లక్షల మంత్రాలు జపించనున్నారు. అంతే కాదు రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్త, శ్రీ సూక్త, ఆదిత్య హృదయ స్తోత్రం, అథర్వశీర్ష తదితర పారాయణాలు కూడా నిర్వహించనున్నారు.