(డిసెంబర్ 24 – ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ఠ పొందిన రోజు)
జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని, తత్వవేత్త, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన తత్వ వారసురాలిగా శ్రీ ఈశ్వరీదేవి పేరు పొందారు.
రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారు 1693లో సజీవ సమాధి నిష్ఠ పొందేందుకు సంకల్పించారు. ఆ సందర్భాన దీన వదనంతో ఉన్న తన రెండో కుమారుడైన గోవిందస్వామిని ఆయన ఆశీర్వదించి… ‘నీకు పరాశక్తి స్వరూపిణి, లక్ష్మీదేవి అంశ ఉన్న కుమార్తె జన్మిస్తుంది’ అని తెలిపారట. ‘ఆమె బ్రహ్మజ్ఞా నియై ప్రజల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించి, మన ఇంటి ప్రతిష్ఠను మరింత ఇనుమడింప చేస్తుండ’నీ పేర్కొన్నారని భక్తులు అంటారు. బ్రహ్మంగారు వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి చెందారు. ఆ ప్రాంతం ‘బ్రహ్మంగారి మఠం’గా విలసిల్లుతోంది.
1709లో గోవిందస్వామి, గిరియమ్మ దంపతులకు శ్రీ ఈశ్వరీదేవి జన్మించారు. జేజినాయన చెప్పినట్లుగానే… ఆమె చిన్నప్పటి నుంచే సంస్కృతం, తెలుగు భాషలపై పాండిత్యం సంపాదించారు. భారత, భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల అడవుల్లోని గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి… అష్టాంగ యోగాది. జ్ఞాన వాక్సిద్ధి పొందారంటారు. లోక కల్యాణార్థం స్వీయ కల్యాణాన్ని త్యజించి, బ్రహ్మచర్య దీక్ష బూనారు. ఆత్మతత్వ బోధనలు రచించారు. శిష్య సమేతంగా లోక పర్యటన చేసి, భక్తి తత్వాన్ని ప్రచారం చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన తత్వాలను ప్రజలకు బోధించారు. మానవుల్లో దుష్ట సంస్కారం పారదోలి, శిష్ట లక్షణాలు పెంపొందించారు. జేజినాయన సజీవ సమాధి పొందిన సమీప ప్రాంతంలోనే… ఆమె 1789లో మార్గశిర బహుళ నవమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారనేది భక్తుల నమ్మకం. ఆ ప్రాంతం ‘శ్రీ ఈశ్వరీదేవి మఠం’గా పేరొందింది. ఏటా మార్గశిర బహుళ నవమి నాడు అమ్మవారి ఆరాధన గురుపూజా మహోత్సవం జరుగుతుంది. ఈ నెల 22 నుంచి 27 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 24న ప్రధాన వేడుక. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తారు.