ఎవరు ఎన్ని చెప్పినా భ్రమలకు లోనై సనాతన ధర్మాన్ని విడనాడవద్దని, సనాతన హిందూ ధర్మం బాగుంటే ప్రపంచమే బాగుంటుందని జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీ పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని పి.నాయకంపల్లిలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన సువర్ణ భారతి గోశాల, పాకశాల, ప్రవచన మంటపాలను గురువారం ఆయన ప్రారంభించి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భక్తులు ఏ రూపంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా దేవుడు ఒక్కడేనని, ఆయా సందర్భాలలో రూపాన్ని బట్టి భక్తులకు దర్శనమిస్తున్నట్టు తెలిపారు. శంకరాచార్యులు వారు 1,200 వందల సంవత్సరాల క్రితం మనదేశంలో అవతరించి ధర్మ సంస్థాపన కోసం కృషి చేశారన్నారు.
హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ధృడంగా ఉందంటే ఆయన చేసిన కృషి ఫలితమేనన్నారు. ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానాలు సనాతన ధర్మంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. గో సంతతిని పెంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. గోవును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా, తల్లిగా భావించే భారతీయ సంస్కృతిలో ఆ జాతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామంలో నిర్మించినవి, నిర్మించబోతున్న శివ పంచాయతన క్షేత్రం, అగ్రిహోత్రుని ఆలయాలతో ఈ ప్రాంతం ధార్మిక క్షేత్రంగా ప్రత్యేకత సంతరించుకుంటుందన్నారు. మనుషులంతా ఐకమత్యంలో ఉండాలని పలు ఉదాహరణలతో భక్తులకు ఉపదేశం చేశారు