మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దేవస్థాన ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగింది.
తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కెఎస్.రామరావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితారా సెంటర్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేరింది. కూచిపూడి, భరతనాట్యాలను చిన్నారులు ప్రదర్శిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ప్రత్యేకతగా నిలిచింది. భక్తులు ఆది దంపతులకు హారతులిచ్చి స్వాగతం పలకడమే కాకుండా అమ్మవారికి, అయ్య వార్లకు పండ్లు, పలహారాలు నివేదనగా సమర్పించారు.