ఏడాదిలో 12 నెలల్లో 11వది పుష్యమాసం .... ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.
ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు..అందుకే వైంకుఠ ఏకాదశి అనే పేరు.ఈ రోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని అందుకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనికూడా అంటారు. ఈ రోజే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు విష్ణువు. తమలా ఎవరైతే ఈ రోజు ఉత్తరద్వారం నుంచి విష్ణువును దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారట మధుకైటభులు అప్పటి నుంచి ఉత్తరద్వార దర్శనానికి విశిష్టత వచ్చిందంటారు.మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఓ రోజుతో సమానం. అందుకే మనకు దక్షిణాయనం ఆరు నెలలు దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి సమయం. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థం.
శ్రీ మహా విష్ణువు నిద్రలేచే ఈ రోజు వైంకుఠ ద్వారాలు తెరిచిఉంటాయి..ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో ఈ రోజు ఉత్తరద్వారం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ద్వారంనుంచి లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకలపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.'వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ 'ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఈ శ్లోకం అర్థం.
ఉత్తర ద్వార దర్శనం ఎందుకు?
వైకుంఠం వాకిలి తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఉత్తర ద్వార దాటి మహర్షులంతా శ్రీమన్నారాయణుడికి బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన విష్ణువు ఆ బాధల నుంచి విముక్తి కల్పించాడని..అందుకే ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే?
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని..అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణుపురాణం. మనిషిలో ఉండే ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా సత్వగుణంగా మార్చుకుంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు నియమనిష్టలతో వ్రతమాచరిస్తే వారికి మరో జన్మ ఉండదని..ఈ రోజు మరణించేవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.2025లో వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి జనవరి 10 శుక్రవారం వచ్చింది.