2025లో 4 గ్రహణాలు.. భారత్లో కనిపించేది ఒక్కటి మాత్రమే
వచ్చే ఏడాది అంటే 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.
అయితే ఈ మొత్తం నాలుగు గ్రహణాల్లో ఒకటి మాత్రమే భారత్లో కనిపిస్తుందని, మిగతా మూడు ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపిస్తాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. సెప్టెంబరు 7 లేదా 8న ఏర్పడే చంద్ర గ్రహణాన్ని మాత్రమే భారత్లో చూడొచ్చువచ్చే ఏడాది మార్చి 14న సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుంది. అయితే.. అది పగటిపూట ఏర్పడడం వల్ల మన దేశంలో కనిపించే అవకాశం లేదని పేర్కొన్నారు. అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాల వద్ద ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని ప్రకాశ్ గుప్తా తెలిపారు. మార్చి 29న పాక్షిక సూర్య గ్రహణం వస్తుందని.. దాని ప్రభావం భారత్లో ఉండబోదని చెప్పారు. ఉత్తర అమెరికా, యూరప్, వాయువ్య రష్యాలో ఈ గ్రహణం కనిపిస్తుందన్నారు.
సెప్టెంబరు 7, 8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉందని గుప్తా తెలిపారు. దీని కోసం ఖగోళ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ చంద్ర గ్రహణం భారత్తో పాటు యూరప్, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో పూర్తిగా కనిపిస్తుందన్నారు. 2025 ఏడాదిలో చివరి గ్రహణం సెప్టెంబర్ 21- 22 మధ్య సంభవిస్తుందని.. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదని పేర్కొన్నారు.