చతుర్దశ భువనాల ప్రస్తావన పురాణాలలో తరచుగా కనిపిస్తుంది. భూమితోపాటు భూమికి పైన ఉన్న మరో ఆరు లోకాలు... అంటే మొత్తం ఏడింటిని ‘ఊర్థ్వలోకాలు’ అనీ, భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలను ‘అధోలోకాలు’ అనీ పిలుస్తారు.
వీటి గురించి ‘శ్రీమద్భాగవతం’లోని ‘ద్వితీయ స్కంధం’లో వివరంగా ఉంది.
భువనాత్మకుం డాయీశుండు
భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్
వివరముతో బదునాలుగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్ (పోతన భాగవతం)
విశ్వస్వరూపుడైన భగవంతుడు ఒక భవనంలా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి, విపులమైన పధ్నాలుగు భువనాలుగా తీర్చిదిద్దాడు. ఈ విశ్వమంతా పరమాత్ముడి శరీరమే. పధ్నాలుగు భువనాలుగా విభజితమైన ఈ విశ్వంలో... పైన ఉన్న ఏడు లోకాలు... శ్రీ మహా విష్ణువు నడుముకు పైన ఉన్న దేహం కాగా, దిగువన ఉన్న ఏడు లోకాలు... మహా విష్ణువు నడుముకు దిగువన ఉన్న శరీరం. ఆయన కటి స్థలం భూలోకం. నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షస్థలం మహర్లోకం, కంఠం జనలోకం, పెదవులు తపోలోకం, శిరస్సు బ్రహ్మ నివాసమైన సత్యలోకం. అలాగే... జఘనం అతలం, ఊరువులు వితలం, మోకాళ్ళు సుతలం. పిక్కలు తలాలతం, చీలమండలు మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. కాగా... ఆయన పాదతలం నుంచి భూలోకం, నాభి నుంచి భువర్లోకం, శిరస్సు నుంచి సువర్లోకం... ఇలా ముల్లోకాల సృష్టి జరిగిందనేది మరో వివరణ. లోకాలన్నిటికీ కర్త, పోషకుడు, లయకారుడు ఆ భగవంతుడేననీ, ప్రళయకాలంలో ఈ పధ్నాలుగు భువనాలు పరబ్రహ్మలో విలీనం అవుతాయని పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఈ లోకాల విశిష్టతలను తెలుసుకుందాం.
భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు:
భూలోకం:
ఇక్కడ నాలుగు విధాలైన జీవరాశులు ఉంటాయి. అవి స్వేదజాలు (చెమట నుంచి ఉద్భవించే పేలు, నల్లులు లాంటివి), అండజాలు (గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు), జరాయుజాలు (మానవ, పశు గర్భాల నుంచి పుట్టే మనుషులు, పశువులు), ఉద్భుజాలు (మొక్కలు, చెట్లు).
భువర్లోకం:
ఇది భూలోకానికి పైన ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ శరీరంలో ఉండే కింపురుషులు, కిన్నెరులు, విద్యాధరులు లాంటి జాతుల వారు ఉంటారు.
సువర్లోకం:
ఇది భువర్లోకం పైన ఉంటుంది. దీన్ని ‘స్వర్గ లోకం’ లేదా ‘సువఃలోకం’ అని కూడా అంటారు. ఇంద్రాది దిక్పాలకులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వారు కోరుకున్న రూపొన్ని పొందగలిగే సామర్థ్యం కలిగిన వారు. వారికి ఆకలి దప్పులు, శరీర దుర్గంధం, వృద్ధాప్యం లాంటివి ఉండవు.
మహర్లోకం:
ఇది సువర్లోకానికి పైన ఉంటుంది. దేవతలు తపస్సు చేసే లోకం ఇది. స్వర్గంలో దేవతలు అనుభవించే దివ్య సుఖాలను.... ఇక్కడ తాపసులు తమ తపస్సు ద్వారా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు.
జనోలోకం:
దీన్నే ‘సత్య లోకం’ అని కూడా అంటారు. ఇది మహర్లోకానికి పైన ఉంటుంది. అత్యంత పుణ్యాత్ములైనవారు ఈ లోకంలో సుఖ శాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. అయోనిజులైన దేవతలు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు.
తపోలోకం:
ఇది జనోలోకం పైన ఉంటుంది. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వారి ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడూ సుగంధాలు వెదజల్లుతూ, ప్రశాంతంగా ఉండే లోకం ఇది. భూలోకంలో వివిధ దేవతలను ఉపాసించినవారు... ఈలోకానికి చేరుకొని, కల్పాంతం వరకూ ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తరువాత కర్మానుసారం భూలోకంలో జన్మించి, సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. మహా ప్రళయంలో సర్వం లయమైనప్పుడు... వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు.
సత్యలోకం:
ఇది తపోలోకానికి పైన ఉంటుంది. ఊర్ధ్వలోకాలన్నిటిలో ఇది అత్యుత్తమమైనది. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మకు నివాసం. బ్రహ్మ అనేది ఒక పదవి. అనేకానేక కల్పాలకు ఒకరు ఈ పదవిని అధిష్టిస్తారు. తమ కర్తవ్యం పూర్తయిన తరువాత బ్రహ్మంలో లయమవుతారు. భవిష్యత్తులో హనుమంతుడు బ్రహ్మ పదవిని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహర్షులు అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంతులు, భూలోకంలో ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఈ లోకంలో వేదాంత చర్చలు చేస్తూ ఉంటారు.
భూలోకానికి దిగువన ఉండేవి అధోలోకాలు:
అతల లోకం:
భూమికి దిగువన ఉండే లోకం ఇది. ఈ లోకంలో రాక్షసులు ఉంటారు. వాళ్ళు భౌతికమైన భోగలాలసులుగా మదోన్మత్తులుగా ఉంటారు. మయుడి కుమారుడైన బలుడి విహార స్థలం.
వితల లోకం:
అతలలోకానికి కింద ఉంటుంది. స్వర్ణ జలం ప్రవహించే హటకీ నది ఉండే చోటు ఇది. ఈ నదీ జలాలతో తయారైన బంగారంతో తయారైన ఆభరణాలను రాక్షస మహిళలు ధరిస్తారు.
సుతల లోకం:
వితల లోకానికి అడుగున ఉండే ఈ లోకంలోనే సప్త చిరంజీవులలో ఒకరైన బలి చక్రవర్తి ఉంటాడు. ఆయన నిత్యం విష్ణువును ధ్యానిస్తూ, ఇంద్రుడిని మించిన భోగాలను అనుభవిస్తూ... సుతలలోకాన్ని పాలిస్తాడు.
తలాతల లోకం:
ఇది సుతలానికి కింద ఉంటుంది. మాయావులైన రాక్షసులతోపాటు దానవ శిల్పి మయుడు, మహా శివుడు సంహరించిన త్రిపురాసురులనే రాక్షస రాజులు ఇక్కడ ఉంటారు.
మహాతలం:
గరుత్మంతుడి సవతితల్లి కద్రువ పుత్రులైన, వేలాది శిరస్సులు కలిగిన సర్పాలు (కాద్రవేయులు) సకుటుంబంగా ఇక్కడ నివసిస్తారు. వారు మహా బలవంతులు, కోరిన రూపం ధరించగలిగేవారు. ఈ లోకం తలాతలం కింద ఉంటుంది.
రసాతల లోకం:
మహాతలానికి దిగువన ఉండే రసాతల లోకం... నివాత కవచులు, కాలకేయులు తదితర రాక్షసులకి నివాస స్థలం. వీరందరూ అత్యంత సాహసవంతులైన రాక్షస ప్రముఖులు.
పాతాళ లోకం:
రసాతల లోకానికి కింద ఉండే పాతాళమే నాగలోకం. మహా మణులతో ప్రకాశిస్తూ ఉండే పాతాళంలో... నాగలోకాధిపతి వాసుకి, ఆదిశేషుడితో సహా సమస్త సర్పజాతి నివసిస్తూ ఉంటుంది.