Archana |
ఆలయదర్శనము వేళ అర్చనల ఆవశ్యకత
ఆలయము అంటే భగవంతుడిని ఓ వ్యక్తరూపంలో ప్రతిష్టించి ఆరాదించే ప్రదేశం. సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు ఓ పరిధికి లోబడి ఓ ప్రదేశంనందే ఉంటాడా? అవతారపురుషుడు శ్రీరామచంద్రుడుచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. అలానే వసిష్ట, వ్యాస, భరద్వాజ, అగస్త్యాది మహర్షులచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. ఎందుకు వీరు దేవాలయాలు ప్రతిష్టించారు?
మనుజుల మనస్సు చంచలమై యుండు కారణముచే, మందబుద్ధి కలిగియుండుటచే, పరబ్రహ్మం సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణమున దానిని జనులు గ్రహించలేరు. అందుచే జనుల హితార్ధమై భగవంతున్ని సాకారరూపంలో వ్యక్తంచేయడం జరిగింది.
న తే రూపం న చాకారో నాయుధాని న చాస్పదమ్ |
తధాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే ||
భగవంతునికి ప్రత్యేకముగా ఒక రూపంగానీ, ఒక ఆకారంగానీ, శంఖచక్రశూల డమరుకాది ఆయుధములుగానీ, వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగానీ లేనప్పటికిని భక్తవత్సలుడు అగుటచేతను పరమ కరుణాస్వరూపుడు అగుటచేతను, భక్తులయొక్క భావమును అనుసరించి రూపమును ధరించుచున్నాడు.
సూర్యుని కిరణాలు అనంతమైన ఉష్ణశక్తిని కలిగివున్నాయి. చిన్న కాగితాన్ని ఎండలో పెడితే అది తనంతట తానుగా కాలిపోదు. కానీ ఓ కటకం ద్వారా సూర్యకిరణములను ఆ కాగితంపై కేంద్రీకరిస్తే కాలిపోతుంది. అలాగే సర్వవ్యాపి అయిన పరమాత్మ అనుగ్రహశక్తిని ఒకచోట కేంద్రీకృతం చేస్తూ నిర్మించేవే ఆలయములు.
శివజ్ఞానం ద్విధా జ్ఞేయం సగుణం నిర్గుణం తధా |
ఆదౌ సగుణమాశ్రిత్య పశ్చాన్నిర్గుణ మాచరేత్ ||
అవ్యక్తమైన శివ స్వరూపం రెండు విధములుగా గ్రహింపదగినది. అవి సగుణ, నిర్గుణములు. మొదట సగుణోపాసన చేసిన తర్వాత తనంతటనే నిర్గుణమై పరిణమించును.
దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు అని గ్రహించినను సమస్త మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ సాకారంలోను, సగుణోపాసనలోనూ భగవంతుని ఉనికిని తెలియబరుస్తూ ఆలయనిర్మాణములు చేసి, అర్చనాదుల ద్వారా భక్తిని అలవర్చుకొని క్రమేనా జ్ఞానత్వమును పొంది జనులు ముక్తులవ్వాలని ఋషులు ఇవన్నీ ఏర్పరిచిరి.