లక్ష్మీ పూజ |
2024 దీపావళి లో లక్ష్మీ పూజ ముహూర్తం :
- శుక్రవారం, నవంబర్ 1, 2024 నాడు లక్ష్మీ పూజ జరుపుకోవాలి.
- లక్ష్మీ పూజ ముహూర్తం - 05:45 PM నుండి 06:16 PM వరకు
- వ్యవధి - 00 గంటలు 31 నిమిషాలు
- ప్రదోష కాలం - 05:45 PM నుండి 08:13 PM వరకు
- వృషభ కాలం - 06:35 PM నుండి 08:37 PM వరకు
దీపావళి
హిందువుల పండుగలలో దీపావళి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ పండగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొంటారు. ఈ దీపావళి పండగ అంటే పిల్లలు దగ్గరనుండి పెద్దలవరకు సంబరమే! ఆకాశంలో రంగుల హరివిల్లు, లోకాలకు కాంతులు పంచే పండగ ఈ దీపావళి! హిందువుల ఆచారాల్లో ప్రసిద్ది చెందిన పండగ, ప్రపంచం దృష్టిని ఆకర్షించే పండగ మన దీపావళి!! భారత దేశమే కాకుండా ఈ పండగ ఫిజి, గయానా, మలేషియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, సింగపూర్ లాంటి విదేశాల్లోనే కాకుండా ఇటీవల పాకిస్తాన్ సింద్ ప్రావిన్సు లో కూడా అధీకృత సెలవుదినంగా ప్రకటించడం గమనార్హం. సంస్కృతంలో దీపావళికి అర్ధం దీపాల వరుస. దీపావళి పండగ ముఖ్యోద్దేశం చీకటిపై వెలుతురు సాధించిన విజయం, చెడుపై మంచి సాధించిన విజయం.
దీపావళి విశిష్టత:
పురాణం కధనాల ప్రకారము హిరాణ్యాక్షుడనే రాక్షసుడు తన అసుర బలంతో భూమిని సముద్ర జలాల్లోకి తోసేసాడు. ఇది తెలిసి ఆదివిష్ణువు వరాహావతారం ధరించి హిరణ్యాక్షుడిని వధించి భూదేవిని యధాస్థానం ప్రాప్తిస్తాడు. ఆ సమయంలో వరాహావతారని భూదేవికి నరకుడు అనే సంతానం కలుగుతుంది. అసురకాలంలో జన్మించినందున నరకునకు రాక్షసలక్షణాలు ఉన్నవని వరహాసురుడు భూదేవికి వివరిస్తాడు. ఆ మాటలకు ఎప్పటికైనా విష్ణువే నరకుడిని అంతమొందించగలదని భావించిన భూదేవి నరకుడికి తల్లి చేతిలోనే చావుని ప్రసాదించమని వారమడుగుతుంది ఏ బిడ్డని తన తల్లే హతమొందించదని భావించిన భూదేవి.
పెరిగి పెద్దవాడైన నరకాసురుడు ప్రాగ్జోతిష్యపురం అనే రాజ్యాన్ని కామాఖ్య అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని తన ప్రజల బాగోగుల్ని పట్టించుకొని స్త్రీలు గౌరవిస్తూ తన పట్టణపు అమ్మవారిని తన తల్లిగాభావిస్తూ సుపరిపాలన చేస్తున్నాడు.
అంతలో పక్క రాజ్యమైన షోమితపురపు రాజైన బాణాసురునితో స్నేహమేర్పడిన తరువాత నరకాసురిణిలో అసురలక్షణాలు మేల్కొలపబడ్డవి. స్త్రీలను గౌరవించే నరకాసురుడు, స్త్రీలను కామించే బాణాసురుని స్నేహంలో స్త్రీలను లొంగదీసుకొనే దుర్లక్షణాన్ని వంటబట్టించుకొని సమీప రాజ్యాలపై దాడులు చెయ్యడం వారి రాజకుమార్తెలను అపహరించి తన రాజ్యంలో బంధించి వారిని వివాహమాడమని హింసలకు గురిచేయడం మొదలు పెట్టాడు.
- అహంకారంతో రగులుతున్న నరకాసురుడు ఓ సరి స్వర్గంపై కూడా దండయాత్రకు వెళ్లి తల్లి అదితి యొక్క చెవికుండలాలను తస్కరించి దేవతలను అవమానిస్తాడు.
- ఆగ్రహించిన దేవతలు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి నరకాసురుని హింసలను సహించలేకున్నామని అతనిని అంతమొందించి లోకాలను రక్షించాల్సిందిగా వేడుకుంటారు.
- పూర్వ సంఘటనలేవి గుర్తులేకుండా భూదేవి సత్యభామగా అవతరించిన శ్రీకృష్ణుని భార్య యుద్దరంగానికి తాను కూడా వస్తానని అడుగుతుంది.
- సత్యభామాసమేతుడైన శ్రీకృష్ణుడు తన సైన్యంతో రణరంగానికి బయలుదేరి నరకాసురునితో ఘోరాఘోరి యుద్ధం చేస్తాడు. గతం గుర్తులేని భూదేవి అవతారమైన సత్యభామ యుద్ధంలో మూర్చపోయిన తన భర్తైనా శ్రీకృషుని చూసి ఆగ్రహించి విల్లునందుకొని తన పుత్రుడే అయినా నరకుసురునిపై బాణాన్ని సంధించింది. తల్లి చేతిలో చావురాసిపెట్టినందున నరకాసురుడు సత్యభామ సంధించిన బాణం దెబ్బకు మరణిస్తాడు.
- నరకాసుడు మరణించిన రోజు చతుర్దశి కావడంతో నరకచతుర్దశి అని నరకాసురుడు మరణించిన తరువాత వచ్చిన అమావాస్యరోజు దీపాలు వెలిగించి ప్రజలు పండగ చేసుకోవడంతో దీపావళి జరుపుకుంటున్నారు.
ఐదు రోజుల పండగ:
ఈ దీపావళి హిందూ చంద్రమాన కాలం ప్రకారం ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున వస్తుంది. ప్రతి ఏడాది పంచాంగం ప్రకారం దీపావళి నిర్ణయించబడుతుంది. మరొక సింధ్దాంతం ప్రకారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 మధ్యలో వస్తుంది. ఈ దీపావళి పండగ ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది.
దీపావళి తేదీ 2024 :
2024 సంవత్సరంలో దీపావళిని నవంబర్ నెల 01వ తారీఖున జరుపుకుంటారని పెద్దలు మరియు పంచాజ్ఞకర్తల నిర్ణయం.
దీపావళి ఎలా జరుపుకుంటారు?
తొలిరోజు ధంతేరాస్ :
దసరా నుండి 18వ రోజు ధన్వంతరి త్రయోదశి వస్తుంది. ఈ రోజునే “ధంతేరాస్”గా పిలువబడుతోంది. ఈ రోజే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలకడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి జన్మిస్తుంది. కాబట్టి పర్వదినం. ఈదినం కోసం ప్రజలు ముందే తమ గృహాలని పరిశుభ్రం చేసుకొని అలంకరించుకొంటారు. యువకులు తమ ఇళ్ళకి కార్యాలయాలకి కనులకు శోభాయమానంగా విద్యుదీపాలంకరణ చేస్తారు. ఈరోజున ముఖ్యముగా మహిళలు బంగారం ముక్క లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. యువకులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు. మొత్తంగా వ్యాపారలావాదేవీలు అధికంగా జరిగే రోజుగా దంతేరాస్ ప్రసిద్ధిగాంచింది.
ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 29వ తేదీన ధన్వంతర త్రయోదశి జరుపుకొంటారు.
రెండవ రోజు నరకచతుర్దశి :
దంతేరాస్ తర్వాత వచ్చే దినం నరక చతుర్దశి. ఈ రోజు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుడు అనే రాక్షసుడిని వధించారు. కావున నరకచతుర్ధశిగా పిలువబడుతుంది. తమిళనాడు, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల్లో ఈ రోజే దీపావళి చేసుకుంటారు.
ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 31వ తేదీన నరక చతుర్దశి జరుపుకొంటారు.
మూడవ రోజు దీపావళి :
ఈ రోజునే లక్ష్మీపూజ అని పేరు. ఈ రోజు లక్ష్మీదేవి భూమిపై సంచరించేందుకు వస్తారని హిందూమత విశ్వాసం. అందుకని ప్రజలు తమ ఇంటి ద్వారాల వద్ద వత్తి దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. ఈ రోజు అందరూ ఆనందాల దీపావళి పండగ చేసుకొంటారు. లక్ష్మీ దేవి పూజను తమ శక్తికొలది చేసుకొని టపాసుల మేలా మోగిస్తారు. పిల్లలు కాకర పువ్వోత్తులు, చుంచుబుడ్లు వెలిగిస్తూ కేరింతలు కొడతారు. యువకులు ధీరోదాత్తంగా బాంబులు పేలుస్తారు. అయితే పెద్దలు, పిల్లల్ని బాణసంచా కాల్చేముందు తగు జాగ్రత్తలు చెప్పటం తప్పనిసరి. అంతేకాకుండా ఈ రోజున చాలా ప్రాంతాల్లో ఉత్తరాది వ్యాపారస్తులు తమ కొత్త సంవత్సర ఖాతా పుస్తకాల పూజని కావించి ప్రారంభించటం పరిపాటి.
ఈ సంవత్సరం 2024 నవంబర్ 1వ తేదీన దీపావళి పండగ జరుపుకొంటారు.
నాల్గవ రోజు “బాలి పూజ” లేదా “బలిపాడ్యమి” :
దీపావళి మరుసటి రోజున బలిపాడ్యమి గా జరుపుకొంటారు. పురాణాల ప్రకారం వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణచివేయగా, ఆ బలి చక్రవర్తి పాతాళంలోనుండి భూమిపైకి వచ్చిన రోజుగా చెప్పబడింది.
ఈ సంవత్సరం 2024 నవంబర్ 2వ తేదీన బలిపాడ్యమిగా జరుపుకొంటారు.
ఇక ఐదవ రోజు “భాయి దూజ్” లేదా “భ్రాత్రి దూజ్” లేదా "భగినీ హస్త భోజనం":
సూర్యకుమారుడైన యముడంటే సోదరి యమునకు ఎంతో అనురాగం. యమునా ఎప్పుడు యమునికి ఇంటికి ఆహ్వానించినా రాదు. ఓ సారి యమసోదరి యమునా ఎంతో ప్రేమతో సోదరునికి ఇంటికి ఆహ్వానిస్తుంది. ఎవ్వరు తనను ఇంటికి రమ్మని ఆహ్వానించరని ఆలోచించిన యముడు సోదరి ఇంటికి వెళ్తాడు. వచ్చిన యముడిని సాదరంగా ఆహ్వానించి, అభ్యంగన స్నాన మాచరించి, తిలకధారిని గావించి, కొసరి కొసరి వడ్డించింది. సోదరి ఆప్యాయతకు పరవశించి యముడు సోదరికి వరం కోరుకోమనగా ఏటా ఈ విధంగా వచ్చి విందు స్వీకరించాలని కోరుకొంది.
సోదర సోదరీమాణుల బంధానికి గుర్తింపుగా ఈ రోజుని జరుపుకుంటారు. ఈ పండగని ముఖ్యముగా హిందువులు, సిక్కులు, జైనులతో పాటు నేవార్ బుద్దులు (నేపాల్ లో ఓ వర్గ ప్రజలు) వైభవంగా జరుపుకుంటారు.