Vamana |
( సెప్టెంబరు 15 నేడు – వామన జయంతి )
దైత్యులందరికీ హిరణ్యకశిపుడు ఆద్యుడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి. కీర్తిలో దేవేంద్రుడంతటి వాడయితే.. దాన గుణంలో కర్ణుడంతటి వాడు. కానీ హిరణ్య కశిపుడిలా విష్ణుద్వేషి.
క్షీరసాగర మథనం తర్వాత అమృతం దక్కటంలో తమకు అన్యాయం జరిగిందని దానవుల అధిపతి బలిచక్రవర్తికి ఆగ్రహం కలిగింది. ఆ కోపంతో దేవలోకంపై దండెత్తాడు. దేవేంద్రుడి పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. కొడుకు ఇంద్రుడి దుస్థితిని చూసి దేవమాత అదితి శ్రీమహావిష్ణువును ప్రార్థించగా.. ఆ లక్ష్మీనాథుడు ఆమెకి పుత్రుడిగా జన్మించాడు. బలిచక్రవర్తి అహాన్ని అణచేందుకు అతడు యాగం నిర్వహిస్తున్న ప్రాంగణంలోకి వటుడి రూపంలో అడుగుపెట్టాడు. త్రిమూర్తుల్లో ఒకరన్నట్లు వెలిగిపోతున్న వామనస్వామిని చూసి అక్కడివారందరూ ఆశ్చర్యపోయారు.
వామన జయంతే ఓనమ్
వామనస్వామి, బలి చక్రవర్తిల కలయిక మహత్తరమైంది. ఆ దేవదేవుడు అప్పుడు నరసింహుడి రూపం దాలిస్తే.. ఇప్పుడు వామనుడిలా అవతరించాడు. మహాదాత, గొప్ప బలశాలి అయిన బలి.. తన వద్దకు వచ్చిన వామనుడిని సగౌరవంగా స్వాగతించి, సత్కరించాడు. ‘బ్రాహ్మణోత్తమా! ఏం కావాలో కోరుకో’ అన్నాడు. వామనమూర్తి మూడడుగుల నేల ఇస్తే చాలంటే.. అంగీకరించాడు బలి. ‘నీ వినాశనం కోసమే విష్ణుమూర్తి మారువేషంలో వచ్చాడు, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకో!’ అని గురువు శుక్రాచార్యుడు హెచ్చరించినా మాట తప్పలేదు బలి. అప్పుడు స్వామి ఒక అడుగుతో భూమండలాన్ని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. మూడో అడుగును ఆ దానశీలి శిరసుపైనే మోపి, అథఃపాతాళానికి తొక్కటానికి సిద్ధమయ్యాడు. ‘వామన జయంతి’ని కేరళవాసులు ‘ఓనమ్’గా వేడుక చేసుకుంటారు.
బలిని శిక్షించవద్దన్న బ్రహ్మదేవుడు
వామనమూర్తి బలిని శిక్షించే ప్రదేశానికి చక్రవర్తి ధర్మపత్ని వింధ్యావలి, ప్రహ్లాదుడు, బ్రహ్మదేవుడు విచ్చేశారు. బలి తన మనవడే అయినా.. అతడి అహంకారాన్ని అణచిన విష్ణులీలకు ప్రహ్లాదుడు ఆనందించాడు. బలి అర్ధాంగి వింధ్యావలి మాత్రం ‘స్వామీ! తాను ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎలాంటి సంశయం లేకుండా మూడు లోకాల్నీ ధారాదత్తం చేశాడు కదా! మరి అలాంటి నా భర్తను ఎలా శిక్షించావు? ఇది ధర్మమా?’ అని ప్రశ్నించింది. బ్రహ్మదేవుడు కూడా ‘స్వామీ! బలిచక్రవర్తి సంపదలన్నింటినీ తృణప్రాయంగా సమర్పించే గొప్పదాత. ఇటువంటి బలిని శిక్షంచటం న్యాయమా?’ అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడా పరంధాముడు ప్రసన్నవదనంతో ‘ఎవరిపై నేను కరుణ చూపాలని అనుకుంటానో.. ముందుగా వారి సకల సంపదలనూ హరించేస్తాను. సంసార సంబంధమైన మైకంలో పడి ఎవరు లోకాన్నీ, నన్నూ ధిక్కరిస్తారో అతడు అనేక జన్మలెత్తి అవస్థలు పడతాడు. ధనం, వయసు, రూపం, విద్య, బలం, ఐశ్వర్యం, కర్మ తదితరాల వల్ల వచ్చే గర్వాన్ని విడిచిపెట్టి, ఎలాంటి మాలిన్యం లేనివారిని రక్షిస్తాను. నన్ను నమ్ముకున్నవారు ఎన్నడూ లోభం, అభిమానం, సంసారం, వైభవం అనే వాటి వలన చెడిపోరు’ అని స్పష్టం చేశాడు. తాను బంధించినా బలిచక్రవర్తి కోపోద్వేగాలకు లోనుకాకుండా నిశ్చలంగా నిలబడటాన్ని చూసి విష్ణుమూర్తి హర్షించాడు. ఆ దానవాగ్రజుని భవిష్యత్తులో దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుణ్ణి చేస్తానన్నాడు. బలిచక్రవర్తి దానవుడైనా దేవదేవుడిపై అపార భక్తిని చూపినందుకు స్వామి కృపకు పాత్రుడయ్యాడు. అందుకే సప్తచిరంజీవుల్లో అశ్వత్థామ, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడితో పాటు బలి చక్రవర్తికి కూడా ఆ పరమాత్మ చోటును కల్పించాడు.
పునీతులను చేసే పురాణగాథ
వ్యాస భాగవతాన్ని అనువదిస్తూ పోతనామాత్యులు పనస తొనల్లాంటి పద్యాలు రచించాడు. ఈ ఘట్టంలో భక్తి, వైరాగ్య సంబంధ ప్రబోధాలెన్నో ఉన్నాయి. ‘ఇంతింతై వటుడింతయై..’, ‘కారే రాజులు రాజ్యముల్ గలగవే..’, ‘వారిజాక్షులందు వైవాహికములందు..’ వంటి తీయనైన తేటతెలుగు పద్యాలు వామనావతార ఘట్టంలోనివే! వాల్మీకి రామాయణంలోనూ వామన మూర్తి ప్రస్తావన కనిపిస్తుంది. ఎందరో భక్త కవులు ఈ అవతార సందర్భాన్ని స్మరించి, పులకించిపోయారు. భద్రాచల రామదాసు ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు..’ కీర్తనలో ‘..వామనుండు మనవాడై యుండగ తక్కువేమి మనకు’ అంటూ ధీమాను వ్యక్తం చేశాడు. భక్త జయదేవుడు ‘గీతగోవిందం’లో వామనమూర్తిని స్మరించి తన్మయుడయ్యాడు. ఇక అన్నమాచార్య ‘ఇందరికి అభయంబులిచ్చు చేయి..’ కీర్తనలో ‘..బలిచేత దానమడిగిన చేయి’ అంటూ కీర్తించాడు. పరీక్షిత్తు మహారాజుకు భాగవతం వినిపించిన శుకమహర్షి.. ‘శ్రీమహావిష్ణువు లీలలతో కూడిన వామన పుణ్యచరితను వినేవారు భాగ్యవంతులవుతారు. సంసార తాపత్రయాల నుంచి బయటపడి ఉత్తమ గతులను పొందుతారు’ అంటూ అభయమిచ్చాడు.