Sri Nemaligundla Ranganayaka Swamy Temple |
నెమలిగుండం రంగనాయకస్వామి
ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి సంపదలకు, జీవనదులకు ప్రాణప్రదమైన నల్లమల అడవుల పరీవాహక ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రరాజాలున్నాయి. వాటి వరుసలోనే భక్తులకు కొంగు బంగారమై నెమలిగుండ్ల ‘రంగనాయకస్వామి’ క్షేత్రము అలరారుచున్నది. ఇక్కడకు మన రాష్ట్రంనుండేగాక,ఇతర ప్రాంతాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి చైత్రమాసం పౌర్ణమినాడు విశేషంగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించటం పరిపాటి. ఈ ప్రాంత ప్రజలు రంగడు, రంగమ్మ, రంగస్వామి అను పేర్లతో తమ సంతానాన్ని పిలుచుకోవడం అనాదిగా ఉందని అంటున్నారు.
నెమలగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రము ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఉంది. జెల్లివారి చెరువునకు పడమటి దిక్కున నాలుగుమైళ్ళ దూరం పెద్ద అడవి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరము నందు పుట్టిన గుండ్లకమ్మనది, ఈ క్షేత్రము గుండా ప్రవహిస్తూ గుంటూరు, ప్రకాశం జిల్లాల ద్వారా ప్రవహించి సముద్రములో సంగమించుచున్నది. ఈ క్షేత్రమునకు మూడు వైపులా ఉన్న కొండలను ‘శ్రీరంగం కొండల’ని పిలుస్తారు.
ఇక్కడ నుండి దుముకే జలపాతమే నెమిగుండ్ల- నెమలిగుండము అని పిలుస్తారు. ఇక్కడ నివసిస్తున్న ఓ కుటుంబంలో చెంచులక్ష్మి అనే ఓ కన్య రంగనాయక స్వామి భక్తురాలు. ఒకానొక రోజు ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి సంకల్పించారు. కాని ఆ చెంచులక్ష్మి తనకు ఈ పెళ్లి వద్దని తాను శ్రీమన్నారాయణుని ప్రేమిస్తున్నానని ఆయననే వివాహమాడుతానని పట్టు పట్టడంతో వారి కుటుంబాన్ని కులసంఘం పెద్దలు వెలివేశారు.
ఆ సమయంలోనే శ్రీమన్నారాయణుని సేవించే ‘మయూర మహర్షి’ ఆమెను జేరదీసి ‘నీ కోరిక తీరడానికి తపస్సే మంచిమార్గమని సెలవిచ్చారు. విష్ణుభగవానుని సందర్శనము కోసం ‘మయూర మహర్షి’, శ్రీమన్నారాయణుని వివాహము చేసుకోవాలని చెంచులక్ష్మి ఇరువురూ ఘోర తపస్సు కు పూనుకొన్నారు. వీరిరువురి అభీష్టములు నెరవేర్చడానికి వైకుంఠవాసుడే తరలి వచ్చాడు. చెంచులక్ష్మినిభక్తిని మెచ్చిన రంగనాయకస్వామిని ఆమెను వివాహమాడి ఈ నెమలిగుండ్లలోనే నివాసమేర్పరుచుకొన్నాడు.
ఈ సంగతి తెలియక వైకుంఠుని ఉనికిని గుర్తించలేక వైకుంఠంలో లక్ష్మి చింతింతు రాలైంది. చివరకు స్వామిని వెదకడానికి పూనుకొంది. ఎట్టకేలకు చెంచు ప్రక్కన చేరిన నారాయణుని గుర్తించి అలుక పూనింది. నారాయణుడు చెంచులక్ష్మికూడా నీ సోదరినే అంటూ జరిగిన వైనాన్ని చెప్పగా ప్రసన్నురాలైన లక్ష్మి తాను నెమలి గుండ్లలో కొలువైంది.
చెంచులక్ష్మి తన సోదరిగా భావించి స్వీకరించింది. శ్రీమన్నారాయణుడిని సేవించే మయూర మహర్షి కోరిక నిమిత్తమై తాను ఇక్కడే కొలువై భక్తుల కోరికలను తీరుస్తానని వరాల నిచ్చిన స్వామి శిలా రూపాన్ని పొందాడు. అంతేగాక ఈ ప్రదేశము రంగనాయక క్షేత్రముగా విరాజిల్లగలదని ఆశీర్వదించాడు. అపుడు శిలారూపాన్ని పొందిన స్వామియే మనకు రంగనాయకుల రూపముగా దర్శనం ఇచ్చేది. మయూర మహర్షి చే పూజలందుకొన్న శ్రీమన్నారాయణుడిని రంగస్వామి గా కీర్తిస్తూ అనంతర కాలంలో ఆ ప్రాంత వాసులు గుడిని నిర్మించారు. ఈ ఆలయమే నేటి నెమలి గుండ్ల రంగనాయక స్వామి ఆలయము.
ఆనాటి నుంచి నేటి వరకు స్వామి లీలలను అనేకాలుగా ఈ క్షేత్రం దర్శించిన భక్తులకు అనుభవంలోకి వస్తునే ఉన్నాయ. ఈ పుణ్యక్షేత్రమున నీటి కొరత యుండదు. గండ్లకమ్మ నది నిండుగా ప్రవహిస్తుంటుంది. రంగనాయకుల యందు లీనమైన వారికిచట ఒక అద్భుత దృశ్యము గోచరిస్తుంది.
దేవాలయానికి ఎదురుగా నెమలి గుండము ఉంది. దీనినే తూర్పు పీట అని కూడా పిలుస్తుంటారు. ఈ తూర్పు పీటకు చివర రంగనాయకస్వామి వారి శంఖు, చక్ర, నామాలు కన్పిస్తుంటాయ. కాని ఈ దృశ్యాలన్నీ కూడా కేవలం భక్తితత్పరులకు మాత్రమే గోచరమవుతాయని అంటారు. భక్తులు తన్మయత్వంతో స్వామి నామస్మరణ చేస్తూ తప్పట్లు మోత, మైకుల సందడి, సన్నాయి, బ్యాండుమేళం రకరకాల వాద్యాల హోరుతో రంగస్వామి నామస్మరణ చేస్తూ కొండకి పయనమవుతారు.
ఇక్కడ ఎవరైనా అనాచారపరులు సంచరిస్తే వారిని ఈ స్వామి మహిమవల్ల ఈ అడవులలో సంచరించే తేనెటీగల సైన్యం తీవ్రంగా శిక్షిస్తాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. అందువల్లనే ఈ క్షేత్రంలో దొంగతనాలు, దోపిడీలు లాంటి చర్యలు కూడా ఇక్కడ జరుగవని భక్తులు చెబుతున్నారు.
దుముకే జలపాతమే నెమిగుండ్ల- నెమలిగుండము |
అఖిలాండేశ్వరుడైన ఈ స్వామివారిని వర్గ కుల మత భేదాలు లేకుండా సర్వులూ ఈ స్వామిని కొలుస్తారు. కొందరికి దేవుడు ఆవహించి వారుచేసిన తప్పులను వివరించి దానికి శిక్షలు వేస్తుంటారని కూడా ఇక్కడి వారు చెబుతుంటారు. అడవులలో నివసించే హరిజన కుటుంబాలు తండోపతండాలుగా ఇక్కడ స్వామిని దర్శించి తన్మయత్వంతో రంగడి స్మరణతో తమ గృహాలకు తిరిగి వెళ్తుంటారు. అందుకే భక్తుల కొంగు బంగారం నెమలిగుండ్ల రంగనాయకుడు. తప్పక చూడవలసిన క్షేత్రం ఈ రంగనాయకస్వామి.
ఇక్కడ ఉన్న తూర్పుపీట లోని శంఖు చక్రనామాలు దర్శించినవారికి ‘శ్రీరంగం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అంటారు. ఇలా ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం అందరూ చూసి తీరాల్సింది.
మీ