దృష్టమంటే కనపడనిది, కర్మఫలరూపమే అదృష్టమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. రాజమహేంద్రవరం కొంతమూరులోని వల్లభగణపతి ఆలయం వద్ద ఉన్న ప్రవచన మందిరంలో ఆయన ఆరో రోజు కల్కి వైభవంపై ప్రవచనాన్ని కొనసాగించారు.
పుణ్యకర్మల ఫలమే సౌభాగ్యం, చెడు కర్మల ఫలమే దౌర్భాగ్యమని ఆయన అన్నారు. మ్లేచ్ఛాదులను అంతమొందించడానికి, వేద ధర్మరక్షణకు, ధర్మసేతువును రక్షించడానికి కల్కి అవతరిస్తాడు. అయితే, విషయవాంఛలను అధిగమించలేనివాడు విష్ణువును తెలుసుకోలేడు. సీ్త్ర వ్యామోహం, ధనలోభం ఎండమావుల వంటివేనని సామవేదం అన్నారు. స్వప్నంలో భగవత్ సాక్షాత్కారం కూడా సులభం కాదని రామకృష్ణపరమహంస అన్నారు.
స్వప్న సాక్షాత్కారాన్ని కల అని తీసిపడవేయరాదని ఆయన అన్నారు. వైరాగ్యం లేనిదే భక్తి కలగదు, అయితే వైరాగ్యం కలిగితే ముక్తి సిద్ధించినట్లు కాదు, సాధనకు వైరాగ్యం అర్హత మాత్రమేనని అన్నారు. గురువు కూడా తరించడానికి మార్గం చూపేవాడే కానీ, ముక్తిని ఇచ్చేవాడు కాదని తెలుసుకోవాలని సామవేదం అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర టీవీ నారాయణరావు స్వాగతవచనాలు పలికారు. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన కల్కి అవతార వైభవంపై ప్రనవచనాలు బుధవారంతో ముగియనున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాధాదేవి జన్మదిన వేడుకలు జరుగుతాయి. గురువారం సాయంత్రం ఆలయంలో వల్లభగణపతి శాంతి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శుక్రవారం మహాపూర్ణాహుతి, అవభృథస్నానంతో నవరాత్ర ఉత్సవాలు పూర్తవుతాయి.