వినాయక శబ్దం లోని ‘వి’ అనేది విశ్వం, విశిష్టత, విశాలతలకు ప్రతీక. వినాయకుడు నాయకులలో విశిష్టుడు, విశ్వ పూజనీయుడు. ‘శుక్లాంబరధరం విష్ణుం’ అంటూ గణేశుని విష్ణువుగా భావించి పూజిస్తాం. విష్ణుమూర్తి వలె గణేశుడు వ్యాపన శక్తి కలిగినవాడు.
ప్రసన్నత ప్రతిఫలించే గజముఖుణ్ణి ‘ప్రసన్న వదనం ధ్యాయేత్’ అంటూ అర్చిస్తాం. వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించదలచుకున్నాడు. అలా చెప్పినప్పుడు ‘ఆపకుండా చెబితే రాస్తాను’ అంటూ గణేశుడు షరతు పెట్టాడు. బదులుగా వ్యాసమహర్షి ‘అర్థం చేసుకుని రాయాలి’ అంటూ ప్రతి షరతు విధించాడు. ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం. ఏ విషయాన్నైనా అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలి అన్నది మహర్షి ప్రబోధ వినాయకుడు లిఖించిన భారతం పంచమవేదమైంది. తొలి లేఖకుడైన గణపతి పూజలో పుస్తకాలు, కలము ఉంచడం సంప్రదాయమైంది.