Bhadrapadam |
భాద్రపదం.. శక్తి ప్రధానం
చాంద్రమాన గణన ప్రకారం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చే మాసానికి ‘భాద్రపద మాసం’ అని పేరు. ఈ సమయంలో సూర్యుడు సింహం, కన్యా రాశుల్లో సంచరిస్తుంటాడు.
ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే సమయం ఇది. నూతన కార్యక్రమాలైన గృహారంభ, గృహ ప్రవేశ, వివాహాదులకు ఈ నెల పూర్తిగా నిషిద్ధం. వానల ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల ప్రభావంతో అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో శక్తిహీనులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధకశక్తి ఉన్నవాళ్లు తట్టుకొని నిలదొక్కుకుంటారు అందుకే, ఈ నెలలో అందరూ శక్తి ఆరాధన, జపాలు, ఉపాసన చేస్తూ ప్రకృతి వ్యతిరేక శక్తులను అధిగమించాలి.
ఈ మాసంలో హరితాళిక, గణేశ చతుర్థి, రుషి పంచమి, లలితా షష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి, అవిధ నవమి, దశావతార వ్రతం, పరివర్తిని ఏకాదశి, వామన ద్వాదశి, వంటి ముఖ్యమైన పర్వదినాలు ఉంటాయి. అయినా, భారతీయులు వీటిల్లో చాలా వ్రతాలను వారిప్రాంతాచారాలను బట్టి నిర్వహిస్తూనే ఉంటారు. మనసును రోగమార్గం, భోగమార్గం వైపు మళ్లించకుండా ఆధ్యాత్మిక శక్తిమార్గంపై కేంద్రీకరించడానికే వ్రతాలు ఆచరించాలని సూచించారు పెద్దలు. తద్వారా శక్తిని పెంపొందించు కొని సమస్యలను అధిగమించవచ్చు.
భాద్రపద మాసంలో భూమికున్న గురుత్వాకర్షణ శక్తికి, చంద్రుని ఆకర్షణ శక్తికి మధ్యవ్యత్యాసాలు ఏర్పడుతాయి. వాటిని అధిగమించేందుకు గణేశ నవరాత్రులు నిర్వహిస్తుంటారు. గణేశుడంటేనే భూమ్యాకర్షణ శక్తి. కొత్తదనం పేరుతో నవరాత్రుల లక్ష్యాన్ని మార్చేయడం బాధాకరం. కానీ, అసలు లక్ష్యం భూమితో సాన్నిహిత్యాన్ని పెంచుకొని గురుత్వాకర్షణశక్తిని ఉపాసించే అవకాశం కల్పిస్తాయి.
వినాయక నవరాత్రులు. గణేశ వ్రత కథ కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టంగా సూచన చేస్తుంది. చంద్ర ప్రభావం వల్ల భూమివాతావరణంతో పాటు మన మనస్సులు సంచలనం పొందుతాయి. కాబట్టి మరింతగా మూలశక్తి చైతన్యాన్ని ఉపాసించమని భాద్రపదం సూచిస్తుంది. భాద్రపద బహుళ పక్షం పితృదేవతల పక్షంగా చెబుతారు. తరలిరాని లోకాలకు వెళ్లిన మన పూర్వీకులను తలుచుకునే అవకాశం కల్పిస్తుంది భాద్రపదం.
పితృదేవతలను స్మరించుకుంటూ, వారికి ఉత్తమగతులు రావాలని కోరుతూ దానధర్మాలు చేస్తుంటారు. తగిన విధమైన సంప్రదాయ కర్మలు నిర్వర్తిస్తారు. మాసం చివరి రోజైన మహాలయ అమవాస్యనాడు పితరుల పేరుమీద శక్తిమేరకు దానధర్మాలు చేస్తుంటారు. లోక వ్యవహారంలో శుభకార్యాలకు పనికిరాని సమయాన్ని ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో దైవధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మిక జీవనమార్గంలో ముందుకుసాగాలి.
ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవాలి. వరుస శుభకార్యాలు ఉండే కాలంలో మనిషి దైవారాధనపై అంతగా దృష్టి సారించలేడు. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించు కోవడానికి శూన్య మాసాలే సరైనవని చెబుతారు పెద్దలు. భాద్రపదం అలాంటిదే! దాదాపు శుక్లపక్షం అంతా వినాయక ఉత్సవాలతో ఆధ్యాత్మిక తరంగాలు వీధివీధినా ప్రసరిస్తుంటాయి. పితృదేవతా ఆరాధనతో కృష్ణ పక్షం ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి అనువైన మాసంగా భాద్రపదం ప్రత్యేకతను సంతరించు కుంది. ఈ నెలలో శక్తిని ఉపాసిస్తూ శక్తిమంతులం అవ్వాలి. భారతీయ ధర్మం నిర్దేశించినట్టుగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడమే మనకు శ్రేయోదాయకం. భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. కాని వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం...ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు.
దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.
భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం.
భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు
హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
శుక్ల చవితి : వినాయక చవితి
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.
శుక్ల ద్వాదశి : వామన జయంతి
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి
అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.
సర్వేజనా సుఖినోభవంతు