బలరామ |
నేడు బలరామ జయంతి :
భాద్రపద శుద్ధ విదియ నాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు.
భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు. దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది.
బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు. రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి, బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు. ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది. బలరాముడు గదాయుద్ధ ప్రావీణ్యుడు. గధాయుద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు.
భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. కురుక్షేత్ర సమయంలో తీర్థయాత్రలు చేసిన బలరాముడు బలరాముడు పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సివారేనని కనుక తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్ఠంగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కొద్దికాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైంది. ఓ రోజున బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అరణ్యానికి వెళ్ళారు. అక్కడ బలరాముడు ఓ చెట్టుకింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అప్పుడు ఆయన నోటినుంచి ఒక తెల్లటి సర్పం బయటకు వచ్చి పడమటి సముద్రంలో లీనమైంది. బలరాముడు ఆదిశేషుడి అంశ అని అనడానికి ఇది ఒక నిదర్శనం.