Vijayawada Durga Gudi |
విజయవాడ దుర్గగుడి ఆదాయం రూ. 82.03 లక్షలు
విజయవాడలో వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలకు రూ. 82.03లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 15 రోజుల ఆదాయాన్ని లెక్కించగా రూ. 82.03,392 లు వచ్చిందని ఆలయ డిప్యూటీ ఈవో లీలాకుమార్ తెలిపారు. బంగారం 145 గ్రాములు, 1.870 గ్రాముల వెండి వస్తువులను భక్తులు మొక్కల రూపంలో చెల్లించుకున్నారని వివరించారు. 136 యూఎస్ఏ డాలర్లు, 20 ఇంగ్లండ్ పౌండ్లు, 40 కెనడా డాలర్లు, 25 కువైట్ దీనార్లు, 20 హాంకాంగ్ డాలర్లు వచ్చినట్లు తెలిపారు. ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు కానుకల లెక్కింపును పర్యవేక్షించారు.
ఇదిలా ఉంటే, అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 16న క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల అధికారులతో కలిసి దేవస్థానంలో చేపట్టిన పనులను పరిశీలించి అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.