Yajnopavitam - యజ్ఞోపవీతం |
యజ్ఞోపవీతం బ్రాహ్మణకన్య చేత భమిడి ప్రత్తితో వడక బడి బ్రాహ్మణుడి చేత మెలికలు వేయబడుతుంది. జంద్యం యొక్క ప్రతి విషయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జంద్యం పొడవు నాలుగు వ్రేళ్ళ వెడల్పుకి 24 రెట్లు అంటే సుమారుగా సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది (ఆరు అడుగులు).
నాలుగు వ్రేళ్ళు మనిషి యొక్క జాగరణ, స్వప్న, నిస్వపన, బ్రాహ్మ (తురీయ ) స్థితులు అనే నాలుగు ఆత్మ స్థితులను తెలియజేస్తాయి. ప్రతి జంద్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి. ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు ఋషి ఋణం, పితృ ఋణం, దేవ ఋణాలను గుర్తు చేస్తాయి. ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది..
మామూలు సమయములోను, శుభ కార్యాలలోను యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్లు (సవ్యంగా) వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుమును తగిలేటట్లు (ప్రాచీనావీతిగా) వేసుకుంటారు. మూత్ర, మల విసర్జన సమయాలలో మెడలో దండ లేదా తావళం (నివీతం) లాగా ఉండేటట్లు వేసుకుంటారు. సంవత్సరానికి ఒక సారైనా, శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు. అందుకే ఆ రోజుకు జంద్యాల పూర్ణిమ అని పేరుకూడా వచ్చింది..
" యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః ”
ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి. ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే || ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి. కొందరు అత్యవసరమైన సమయాల్లో తమ జంధ్యంలో నుంచి కొన్ని పోగులు తీసి కొడుకలకు, ఇతరులకు ఇస్తుంటారు..
యజ్ఞోపవీతంలో మూడేసి చొప్పున పోగులు ఒక యూనిట్ గా భావించాలి. బ్రహ్మచారికి 3 పోగులుగా ఉన్న యజ్ఞోపవితాన్ని వేస్తారు..
పెళ్ళి అయ్యాక మామగారు భార్య తరఫు భార్య తాలూకు యజ్ఞోపవితాన్ని వేస్తారు. అంటే మొగుడు భార్య కి తాళి కడతాడు. భార్య తాలూకు యజ్ఞోపవితాన్ని మొగుడు భరిస్తాడు. అందుకే భార్య నెలసరిలో ఉంటే పుణ్య కార్యాలు చెయ్యరు. భార్య అంటే తనలో సగం కాబట్టి..
పెళ్లి అయిన వాళ్ళు ఈ లెక్క ప్రకారం రెండు యూనిట్స్ అనగా 6 పోగులు వేసుకోవాలి. అంటే భర్త సంధ్య వారిస్తే భార్య కూడా చేసినట్టే. అందుకే పురాణ కాలంలో భార్యలు భర్త సంధ్యావందనానికి ఏర్పాట్లు చేసేవారు. ఇప్పటికి చేసేవారున్నారనుకోండి. సంధ్య వార్చడం ద్వారా ఏ రోజు పాపం ఆ రోజు ప్రక్షాళన అయిపోతుంది..
మరో మూడు పొగులు ఉన్న యజ్ఞోపవీతం కూడా అదనంగా వేసుకుంటారు. అది ఎందుకనగా ఉత్తరీయం కోసం. ఉత్తరీయం లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ఆ దోషం తగలకుండా మూడు పొగులు వేస్తారు. ధర్మం ప్రకారం ఎప్పుడు మనిషి దిగంబరంగా ఉండకూడదు. ఆ దోషం రాకుండా నూలు పోగు గా మొలతాడు ఎప్పుడు ఉండాలి..
మరో మూడు పొగులు ఉన్న యూనిట్ ను ఇష్టముంటే వేసుకోవచ్చు. ఇది వేరే వారికి ఇవ్వొచ్చు. ఒకవేళ ఎవరికైనా జంధ్యం తెగిపోతే ఇచ్చే అందుకు ఈ ఏర్పాటు. ప్రతి జంధ్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి..
ఉపనయనము అయిన పిదప యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా వ్యక్తి ఉండనే రాదు. అలాగే భిన్న తంతువులు కల యజ్ఞోపవీతం కూడా ధరించరాదు. అందుకని, తను వేసుకున్న నాలుగవది వేరొకరికి దానం చేస్తారు.. ఇది కేవలం ఆ వ్యక్తి తను ఇంటికి వెళ్ళాక శుచియై, క్రొత్త యజ్ఞోపవీతాలను వేసుకునేంతవరకు 'ఆపత్ ధర్మ' ఏర్పాటు అని చెప్పవచ్చు..
చాలా మంది పాటించడం లేదు కానీ, యజ్ఞోపవీతానికి చాలా పవిత్రత ఉన్నది..
"యజ్ఞోపవీతం పరమం పవిత్రం...ప్రజాపతేర్యత్....."
కదా ! అది ఎంత పొడవు ఉండాలి అన్నదీ చెప్పారు. నడుము క్రిందకు ఉండరాదు.. ఉన్నచో కొన్ని ముడులు వేసి, పొడవు తగ్గించుకోవాలి..
ఎప్పుడు మార్చాలి, ఎంత తరచుగా మార్చాలి అన్నది కూడా చెప్పారు. అశౌచం వీడిన తర్వాత మార్చాలి. ఏ అశౌచం లేకపోయినా 3 నెలలకు ఒక సారి అని కొందరు, 6 నెలలకు ఒక సారి అని కొందరు పెద్దలు సెలవిచ్చారు. ఇక శ్రావణ పౌర్ణిమకు ఋగ్వేదులు మినహా మిగతా సాంప్రదాయాలవారు తప్పనిసరి గా మార్చుకుంటారు...