Bhishma |
భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి ?
భీష్ముడు:
గంగా, శంతనుల అష్టమ పుత్రుడు. ఇతని అసలు పేరు "దేవవ్రతుడు''. వార్ధక్యదశలో శంతనుడు, సత్యవతి సౌందర్యానికి దాసుడై, మన్మథవశవర్తియై, విరహవేదనతో వ్యాకుల శయ్యాగతుడైతే, ఈ సంగతి తెలిసిన "దేవవ్రతుడు'' తన తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, "నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు'' అని సత్యవతికి వాగ్దత్తం చేసి, అం అరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన "భీష్ము''డయ్యాడు. కుమారుని త్యాగనిష్ఠకు సంతసించిన శంతనుడు, భీష్మునకు స్వచ్చంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు.
పితామహుని ప్రతాపం :
కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మహోమాగ్నికి అధర్మపరులను సమిథులుగా, అవినీతి వర్తనులను హవిస్సుగా, అరివీరుల హాహాకారాల "స్వాహా''కారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వ యజ్ఞాన్ని ... ఒంటిచేత్తో పదిరోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్యా పితామహుడు "భీష్ముడు''. భీష్మ ధనుర్విముక్త నిశిత శరాఘాతాలకు, పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన పార్ధుడే కాదు, పార్శసారథికూడా నిశ్చేష్టుడయ్యాడు. "ఆహావరంగంలో ఆయుధం పట్టను'' అని పల్కిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మసంహారానికి ఆయుధం పట్టాడు. పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహత పరాక్రమవంతుడు "భీష్ముడు''.
శరతల్పం :
తన నెరిసి, చూపు మందగించి, జవసత్త్వాల పట్టు తప్పి, వార్ధక్యవార్షికి అవ్వాలితీరాన వున్నా భీష్ముడు ... పున్సత్వం నశించిన పానడవులు, శిఖండిని ముందునుంచుకుని పోరుకు తలబడితే, తాను శిఖండి కాలేక అస్త్రసన్యాసం చేసి, గాండీవ ధనుర్విముక్త శరసహశ్రానికి శరతల్పగతుడయ్యాడు. అంతమాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు. అధర్మపక్షాన నిలబడి, ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే "భీష్ముడు'' మరణాన్ని స్వాగతించాడు. అదే, తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అమ్ములు ములుకుల్లా బాధిస్తున్నా, సహిస్తూ, ఆ యుద్ధరంగంలో పీనుగుల గుట్టల మధ్య, క్షతగాత్రుల రోదనలు వింటూ, నక్కల, తోడేళ్ళ, రాబందుల, గుడ్లగూబల అరుపులు ఆలకిస్తూ, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా మరణవేదనను అనుభవిస్తూ, మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు విజయలక్షిని వరించాడు. స్వజనుల రక్తతిలకంతో, అయినవాళ్ళ అశ్రుజలధారలతో హస్తిన సింహపీఠంపై సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యానే ..., అన్న బాధతో ధర్మజుడు, సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోయాడు. వెంటనే శ్రీకృష్ణునితో కలిసి, తన సోదరులను వెంటబెట్టుకుని శరతల్పగతుడైన ఆ "శాంతనవుని'' దగ్గరకు వచ్చాడు.
మహాప్రస్థానం :
ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు, ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి, అలసటతో వాలివున్న కనురెప్పలను భారంగా పైకెత్తి చూసాడు. పాండవులు, శ్రీకృష్ణుడు కనిపించారు. మనరానికి చివరిమెట్టు మీదవున్న అంతిమక్షన్నంలో మాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునికి ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించాడు. పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, "పితామహా! సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటేగానీ, మానసిక విజయాన్ని వరించలేకపోయాను. నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు. ఈ విశ్వంలో గొప్పదైవం ఎవరు? ఎవరిని కీర్తిస్తే సుఖసంతోషాలు లభిస్తాయి. ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? ఎవరిని శరణుకోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది?'' అని ప్రశ్నించాడు.
భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి ... తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి, "ధర్మజా! నీ సందేహాలన్నింటికీ నా చివరి సమాధానం, లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే'' అంటూ చేతులు జోడించి, "జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం'' అంటూ ప్రారంభించి, "విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:'' అంటూ విష్ణసహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ "ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీకృష్ణుడు దీవిస్తూ "గాంగేయా! నీ భక్తిపారవశ్యం నాకు ఆనందం కలిగించింది. మాఘశుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణదినంగా నీకు కానుక యిస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి'' అని పలికాడు. మాఘశుద్ధ అష్టమి తిథిరోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత యితిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది.
భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన "విష్ణుసహస్రనామస్తోత్రం'' యిప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం.
తేజో భాస్కరునకు అస్తమయం వుండదు..
అశ్రుతర్పణం :
భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని "భీష్మాష్టమి''గాను, మాఘశుద్ధ ఏకాదశిని "భీష్మఏకాదశి''గాను మానవాళి స్మరించడమే, మనం ఆ పితామహునకు యిచ్చే అశ్రుతర్పణాలు. భారతజాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి, మత, కులభేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మఏకాదశి పర్వదినంనాడు తిలాంజలులు సమర్పించాలి.
"వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్యప్రవరాయచ
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
అపుత్రాయ జాలందద్మి నమో భీష్మాయ వర్మణే
భీషశ్శాంతనవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
ఆభిరర్బివాప్నోటు పుత్రపౌత్రో చితాం క్రియమ్ ''
అని ధర్మసింధువు చెబుతూంది. అంటే, "వ్యాఘ్రపాద గోత్రమునందు జన్మించినవాడు, సాంకృత్యప్రవరుడు, గంగాపుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి, అపుత్రకుడు అయిన భీష్మునకు తర్పణములు యిచ్చుచున్నాను. ఈ తర్పణములతో శాంతనపుత్రుడు, వీరుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్రపౌత్రక్రియలవలె తృప్తినొందుగాక'' అను అర్థముగల ఈ మంత్రముతో అపసవ్యముగా యజ్ఞోపవీతము వెసుకుఇ, తర్పణమిచ్చి, ఆచమనము చేసి, సవ్యముగా యజ్ఞోపవీతము వేసుకుని ఈ క్రింది శ్లోకముతో ఆర్ఘ్యము యివ్వాలి.
"వసూనామవతారాయ శంతనోరాత్మజయచ
ఆర్ఘ్యం దదామి భీష్మాయ ఆ బాల్య బ్రహ్మచారిణే''
"అష్టవసువులకు ఎకావతారమగు శంతను పుత్రుడైన భీష్మునకు ఆర్ఘ్యం యిచ్చుచున్నాను'' అని అర్థం.
శాస్త్రం ప్రకారం తండ్రి లేనివారే తర్పణాలు యివ్వడానికి అర్హులు. కానీ, భీష్మునికి తర్పణాలు యిచ్చే విషయంలో తండ్రి జీవించివున్నా వారు కూడా తర్పణాలు యివ్వవచ్చునని ఋషులు సమ్మతించారు. అయితే జీవత్సతృకులు తర్పణాలు యిచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడిచేతి బొటనవ్రేలికి చుట్టుకుని తర్పణాలు యివ్వాలి. బీష్మునికి తర్పణాలు యిస్తే బహుపుణ్యప్రదమని, అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం. అంతేకాదు ... "సంతానం లేని దంపతులు "భీష్మాష్టమినాడు'' కానీ "భీష్మఏకాదశి'' నాడు గానీ, భీష్మునికి శ్రాద్ధము (తద్దినం) పెడితే వారికి సత్ సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం.
కనుక, ఈ భీష్మఎకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.
Veda samskruti సేకరణ