అమెరికాలోని హ్యూస్టన్ నగరం ఆంజనేయ నామ స్మరణతో మారుమోగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో..హ్యూస్టన్ నగరంలోని దివ్య అష్టలక్ష్మీ ఆలయంలో ఆలయంలో.. భవ్యమైన అభయ హనుమాన్ విగ్రహం ఆవిష్కృతమైంది. స్టాట్యూ ఆఫ్ యూనియన్‌గా వ్యవహరిస్తున్న 90 అడుగుల అభయ హనుమాన్ విగ్రహం.. అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
USA: 90 feet Abhaya Hanuman statue unveiled in America |
ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే.. ఆ దైవీగుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి హనుమంతుడు అవతరించాడు. వేద హృదయమై రామాయణం భాసిల్లితే.. ఆ వేద ధర్మాన్ని ప్రతిఫలింపజేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పవనసుతుడు హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల మహా విగ్రహమై భాసిల్లుతున్నాడు. అగ్రరాజ్యం నుంచి సనాతన భారత ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటుతున్నాడు.
సీతారాముల కథను సుందరమయం చేసినవాడు హనుమంతుడు. సీతారాములను కలిపిన సేతువు ఆంజనేయుడు! హ్యూస్టన్ వేదికగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కృతమైన అభయ హనుమాన్ విగ్రహం కూడా.. చైతన్య రూపమై..వేద హృదయమై..వేద ధర్మన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.
భక్తి భావన, కార్యసాధన, ఆత్మశోధన, నిరుపమాన స్వామి ఆరాధనలకు సాకార రూపం.. ఆంజనేయుడు! రామ కార్య నిర్వహణలో నిబద్ధతను చాటినవాడు హనుమంతుడు. సీతా శోకాన్ని నివారించి, ఆమెకు ఆనందాన్ని అందించిన ప్రసన్న మూర్తిగా ఆంజనేయుడు వర్ధిల్లాడు. ఇలా ఎందరో జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్య సుందరుడు- హనుమంతుడు. ఇప్పుడా సుందర చైతన్యతత్వం..అభయ హనుమాన్ రూపంలో హ్యూస్టన్ నగరంలో ఆవిష్కృతమైంది. భక్తి తత్పరతకు ప్రతిరూపంగా మారుతి కొలువుదీరాడు.
ఆ విగ్రహ సౌందర్యం చూశారా! హ్యూస్టన్ అష్టలక్ష్మీ ఆలయ వేదికగా..90 అడుగుల ఎత్తులో.. యావత్ లోకానికి హనుమంతుడు అభయహస్తం ఇస్తున్నట్టుగా ఉంది ఆ దివ్య తేజస్సు! సకల గుణ సమన్వయ రూపధారిగా, అఖిల దేవతా శక్తుల ఏకీకృత వజ్రాంగ దేహుడిగా రామాయణంలో హనుమను వాల్మీకి మహర్షి దర్శించాడు. శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి అమృత హస్తాలతో లోకార్పణ కాబోతున్న 90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ కూడా.. యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే సనాతన చైతన్యంతో.. పంచభూతాల తేజస్సుతో..భారతీయ వసుధైక కుటుంబ భావనకు ప్రతీకగా భాసిల్లుతోంది.
పంచ మహా శక్తుల సమన్వయంతో ఆంజనేయుడు పరిఢవిల్లుతున్నాడు. ప్రతికూల సంహార శక్తికి నృసింహతత్త్వాన్ని.. జ్ఞాన గరిమకు హయగ్రీవ అంశను.. అనంత వేగశక్తికి గరుత్మంతుడిని.. ఆపదుద్ధారక తత్త్వానికి వరాహమూర్తిని.. శ్రేయో సంధాయకతకు వానర రూపాన్ని.. విరాట్ రూప హనుమ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. లంక అనే శ్రీనగరిలో శ్రీచక్ర రాజ నిలయగా భాసిల్లే సీతామహాలక్ష్మిని.. తన సాధనా పటిమతో, అనిర్వచనీయ తపోదీక్షతో దర్శించి, తరించాడు. అందుకే హనుమను.. మహాదేవీ అనుగ్రహ భవ్య రూపుడిగా.. కపిల తంత్రం అభివర్ణించింది.
సత్య చైతన్య రూపమై..వేద హృదయమై..వేద ధర్మన్ని అర్థం చేసుకోవడానికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ దోహదం చేస్తుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. సర్వోత్కృష్టమైన ఉపాసనా సంవిధానంతో..హ్యూస్టన్ నగరంలోని అష్టలక్ష్మీ ఆలయంలో.. అభయ హనుమాన్ విగ్రహాన్ని లోకార్పణం గావించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి! హ్యూస్టన్ నగరంలో వెలిసింది కేవలం 90 అడుగుల విగ్రహం మాత్రమేకాదు. ఆగ్రరాజ్యంలో భారతీయ సనాతన వైభవం! శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అఖండ తపోనిష్ఠకు, సత్య సంకల్పాన్నికి సాక్షాత్కార రూపం!