శ్రీ కృష్ణ |
శ్రీ కృష్ణ తత్వము
శ్రీ కృష్ణ చరిత దాదాపు అన్ని పురాణాలలోనూ కనిపించుతుందని పెద్దల వద్ద విన్నాను. అసలు హరివంశము పేరున భారతములో కూడా వస్తుంది. అసలు ఆ గోపబాలుని పేరుతోనే గోపాల తాపనియోపనిషత్తు వుంది. ఆయన తత్త్వము అందులో మనకు విస్తారముగా గోచరిస్తుంది.
ఇక వ్యాస భాగవతము మూలమైనా ఆంధ్ర మహా భాగవతమును ‘తెనుగున్ జేసెద మత్ పురాకృత శుభాధిక్యమ్ము తానేట్టిదో’ అంటూ పోతన భాగవతమును తెనిగించినాడు కానీ ఆయన, మన పూర్వ పుణ్య వశమున తెలుగు నేలపై జన్మించి, తెలుగు వారిని ఉద్ధరించదలచి ఈ కావ్యమును మనకందించినాడనిపిస్తుంది. అందులోని దశమ స్కందము చాలు మనము తరించడానికి. అసలు దీనిని ఆయనే కల్పతరువన్నాడు. ఈ పద్యమును గమనించండి.
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృంత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.\
శ్రీమద్భాగవతం కల్పవృక్షము. ఈ పద్యము శ్లేషాలంకారములో నడుస్తుంది. మనము ఇందు కల్పవృక్షమునకు . భాగవతమునకు గల సామ్యమును చూస్తాము.ఆ కల్పవృక్షము యొక్క బోదె మరియు భాగవతములోని స్కందములు ఎంతో లలితముగా వున్నవి. మాను కొమ్మలు మనోజ్ఞ మైతే భాగవత స్కంధాలు లలిత మనోహర మైనవి. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం నల్లనయ్య. కల్పవృక్షం చిలుకల పలుకులతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది అలాగే భాగవతం శుకమహర్షి, శుకము అంటే చిలుకే కదా!,మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. చిలుక కొట్టిన పండుకు తీపి ఎక్కువ అన్న నానుడి మనకు తెలిసినదే. పైపెచ్చు శుకుడు తల్లి గర్భమునుండి బ్రహ్మజ్ఞానిగానే బయట పడినాడు. ఆయన అవివాహితుడు. మరి ఆయన నోట విన్న భాగవతము ఎంత మనోజ్ఞముగా వుండి యుంటుందో మన ఊహకు అందే విషయము కాదు.
కల్పవృక్షం అందమైన పూల తీగలచే పరివృతమై వుంది మరి భాగవతం మనోహరమైన ఉపాఖ్యానాలు కలిగి భాగవతమునకు అభిన్నముగా వుంది. కల్పవృక్షము మంచి రంగురంగుల పూలతో శోభిల్లుతూ వుంటుంది అదేవిధంగా భాగవతము సజ్జన మనోరంజకమై, సులభగ్రాహ్యమై అలరించుతూ వుంది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా అంటే స్థూపాకార కాండము కలిగి ఉంటుంది అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన వృత్తాంతములు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది అయితే భాగవతం ఇహపరాది సకల కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల పాదు కలిగినది అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత మై నిండియున్నది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది అదే భాగవతం అయితే ఉత్తములకు బ్రహ్మ తాత్వికులకు నెలవై భాసిల్లుచున్నది.
అసలు కృష్ణ చరిత భాగవతములోని 10యవ స్కందములో ప్రారంభమౌతుంది. పరీక్షిత్తు శుకబ్రహ్మను ‘మహాభాగా తమరు ఇంతవరకు అనేకానేక భక్తగణ చరితములను చెప్పుకొంటూ వచ్చినారు. నాకు సంపూర్ణముగా చెప్పుకొంటూ వచ్చినారు. నాకిపుడు భగవానుడగు శ్రీ కృష్ణుని గూర్చి సంపూర్ణముగా తెలుసుకొనవలెనను తపన మెండై నా గుండెలు నిండియున్నది . దయతో వారి చరితమును తెలియజేసి నన్ను ధన్యుని చేయమని అడిగినాడు.
అప్పుడు శుకుడు ఈ విధముగా చెబుతాడు.
సమ్యక్ వ్యవసితా బుద్ధిః తవ రాజర్షి సత్తమా
వాసుదేవ కథాయన్తే యజ్జాతా నైష్ఠికేరతిః
నిశ్చయమైన నిశ్చలమైన బుద్ధి, పశుఘ్నునికి ఉండదు. అంటే సాత్వికత లేనిది ఈ సత్ కథ వినరు. గర్భవతిని దౌహృది అంటారు. దౌహృది అంటే రెండు హృదయములు గలది అని అర్థము. ఉత్తర గర్భావాసియైన పరీక్షితుడు పాండవుల గృహములో అంటే అనవరతమూ శ్రీకృష్ణ గుణగాన పరిసరము నందు గర్భవతియైన తన తల్లిని కలిగియుండుటచే తనకు కూడా గర్భావస్థ లోనే కృష్ణలీలావిలాసమును గూర్చి తెలుసుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రముచే తన చుట్టూ అగ్నిశిఖలు ఆవరించిన వాడయిన పరీక్షిత్తు తనను శ్రీకృష్ణుడు రక్షిస్తాడనే ధీమాతో ఉన్నాడట. అందుకే నన్ను కాచిన ఆ కృష్ణుని గూర్చి శ్రవణ తత్పరుడై అడుగుచున్నాడు పరీక్షిత్తు శుకబ్రహ్మను. అసలు పరీక్షిత్తు మహారాజు యొక్క నిజనామము విష్ణురాతుడు అంటే సాయుజ్యమును పొందువాడు అని అర్థము. చూడండి పుట్టినపుడే అతని గమ్యము నిర్దేశింపబడినది. అది మన పూర్వుల గొప్పదనము. భగవత్ సంబంధము అయినది. కృష్ణస్య భగవాన్ స్వయం అని అన్నారు వ్యాసులవారు. భగవద్గీత సిద్ధాంతము భాగవతము దృష్టాంతము. కృష్ణస్తు లీలామయః. ఆయన చేసే పనులు లీలలు. మనము చేసేవి కర్మలు. ఆయనది అవతారము. మనది జన్మము. మన జన్మము మన కర్మ ఫలము. ఆయనది లీలామానుష విగ్రహము. ఒకరు దగ్గరా లేదు ఒకరు దూరమూ లేదు. వారివారి కర్మ ఫలములు వారికిచ్చి తానూ అంతర్ధానమందుతాడు ఆయన.
ఇక మెల్ల మెల్లగా కృష్ణ లీలా తత్వ విచారణ లోనికి పోదాము.
ఈ విషయమై రేపు కలుద్దాము.....
శ్రీ కృష్ణ తత్వము - 2
శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించినాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సంll)
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టు దట్టి
సందె తాయతలును సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు ||
అన్న, నేను బాల్యములో మా అమ్మమ్మ వద్ద నేర్చుకొన్న పద్యమే గుర్తుకొస్తుంది. ఒక్క దట్టి అన్న మాటకు మాత్రము అర్థము చెబుతాను ‘దట్టి అంటే మొలత్రాడు అని అర్థము’. ఎంతగానో వర్ణింపబడిన ఆయన జన్మ వృత్తాంతము ఆసక్తుడనైన ఆశక్తుడనైన నా మాటలో చెప్పాలంటే ప్రకృతి పులకించింది. దుర్వార మదాంధ దుష్ట దురితాళికి ఇక ముప్పు తప్పదని మురిసిపోయింది సకల వసుదాత యైన భూమాత. అందుకే పోతన అంటాడు.
పాడిరి గంధర్వోత్తము
లాడిరి రంభాది కాంతలానందమునన్
గూడిరి సిద్ధులు, భయములు
వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!!
మరి దేవకీ వసుదేవులు ఏవిధమైన సంబరాలు చేయలేని స్థితిలో కదా వున్నారు. అతి ప్రసన్నుడైన వెన్నుని, కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.
ఏమయితేనేమి ఎంత పుణ్యము చేసుకొన్నదో యశోద లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై నందయశోదానందనందనుడై వారి అమాయక అవ్యాజ అనన్య ప్రేమను మనకు తెలియజేసినాడు. అసలు తల్లిదండ్రుల మమతానురాగాలు ఎటుల వుండవలెను అన్న మాటకు దృష్టాంతరముగా.
సంతోషము సద్దు మునుగక ముందే కామరూపిణి పూతన స్తన్యమివ్వ వచ్చినది బాల కృష్ణునకు. ఆ పరమాత్ముని వడిలోనికి తీసుకొని పాలివ్వ మొదలెడుతూనే ఆ రక్కసి పంచ ప్రాణాలను కూడా పీల్చివేసినాడు కృష్ణుడు. ఆమె వడిలో చేరిన ఆ బాలగోపాలుని పాదము మేను సోకుటచే దుర్మతి యై కూడా వైకుంఠము బడసినదట.
మరి ఆయన పాదము చెంత పుట్టిన గంగకే పాప ప్రక్షాళనా మహత్తు వుంటే మరి ఆయన కాలే తాకితే మోక్షము పొందదా పూతన ఎంత పాపియైనా! అసలు కంసుని పనుపున వచ్చిన పూతనకు కృష్ణుని చంపుటయే ధ్యేయము గానీ తనదైన శత్రుత్వము ఆయనపై లేదు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం యిదని కూడా వివరించింది.
yashoda krishna |
బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉంది. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతారు. వెన్నను నవనీతము అంటారు. నవనీతము అంటే క్రొత్తగా పుట్టినది అని అర్థము. ఆమాట నిజమే కదా! కంటి ముందు మీగడతో కూడిన పెరుగుంది. ఆ పెరుగు నుండి మీగడ వేరుపరచి ఆ మీగడను మధించగా వెన్న లభ్యమౌతుందన్న జ్ఞానము ముందు మనలో కలుగవలెను కదా! ఆ తరువాత మంథనము మొదలౌతుంది. అంటే చిలుకుట. బాగా చిలికిన పిదప వెన్న వచ్చుట మొదలవుతుంది. కానీ మజ్జిగనీరు కూడా దానితో వుంటుంది. దాని నుండి ఎంతో ఒడుపుగా వెన్నను బయటికి తీయవలసియుంటుంది. లేకుంటే వెన్న ఆ మజ్జిగ నీటిలో కలిసిపోతుంది. అట్లుగాక ఒకవేళ తొందరపాటుతనముతో వేరు జేసినా మజ్జిగతో కూడిన వెన్న తీస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. కావున మజ్జిగ నీరు బాగా వడసిన తరువాత వెన్నను నిలువ చేయవలెను. మరి మనసు పెట్టి ఆలోచించితే ఈ నవనీత న్యాయము మనకేమి చేబుతూవుంది. మనసు అన్న స్వచ్ఛమైన పాల నుండి ఏదయినా నీరు వుంటే దానిని వేరుపరచుటకు ముందు పాలను కాచాలి. అప్పుడు పాలు చిక్కనౌతాయి. అంటే మనసు చిక్కనౌతుంది. అప్పుడు మనసుకు జ్ఞానానికి అనుసంధానమగుటకు ఒక గురువు లేక ఒక ఉపదేశము కావలసి వస్తుంది. అదే తోడంటు లేక తోడు, పేరబెట్టుట లేక చేమేరి అనికూడా అంటారు. ఇంతా అయిన తరువాత పాలలోని గోరువెచ్చదనము తరిగిపోకుంటే అప్పుడు పాలు పేరి పెరుగుతుంది. ఆ గోరువెచ్చదనమే మన లోని తపన, ఆకాంక్ష లేక జిజ్ఞాస. అది వున్నపుడు పెరుగు త్వరగా పేరుతుంది. అంటే పలుచగా వున్నా విషయ సంపద ఇపుడు ఘనీభవించింది.. అది మెదడులో పదిలముగా వుంది. ఇక కావలసినది ఏమిటి? సాధన. అదే మనోమధనము అంటే పెరుగును చిలుకుట. అప్పుడు జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానమును అనుష్టించితే అంటే ఆ వెన్న తింటే అప్పుడు మనకు లభించేది పరమాత్మ సాయుజ్యమే! కృష్ణుడు వెన్న తినుట లోని తత్వమిది. ఈ తత్వజ్ఞానమన్న వెన్న గ్రహించి దానిని కలిగియున్న నీ శరీరమనే మృణ్మయ పాత్రను ఛేదించు అంటే నీ శరీరమనే కుండను పగులగొట్టు. అప్పుడు నీవు ఆత్మజ్ఞానివి. ఇది ఆ కన్నయ్య మనకు వెన్న తినుటలో తెలిపే సత్యము.
అదేవిధముగా ఆయన బాల్య క్రీడలలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్ల కు నీళ్లను యమునా నదిలో నుండి తీసుకుని వెళుతూ వుంటే, రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడట. అంటే ఆ కుండ మానవశరీరము అనుకుంటే ఆ కుండలోని నీరు 'అహంకారము' ఆ అహంకారము కారిపోతేనే గాని లేక జారిపోతే గాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. ఈ విధముగా గోపకులమును మాయనుంది వేరుజేసి తన ఉనికిని తెలియబరచి జ్ఞానులకే గాక మూఢులను గూడా జ్ఞానులను జేసినాడు.
జగజ్జాలములున్న పొట్ట కట్టన్ వశమే మద్దిచెట్ల వృత్తాంతము- యశోద
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ
వీడి యున్న తుఱుము విరులు రాలఁ
గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ
గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి.
ఎట్లయితేనేమి కృష్ణుని రోటికి కట్టింది. నిజానికి ఆమె కట్టలేదు. తనకు తానుగా పట్టుబడి కట్టించుకున్నాడు. ఆ కట్టడానికి ఎంత పొడవు తాడు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ ఆగుతూ వచ్చినాడట. ఆ రెండంగుళాలే అహంకారము మమకారము. మరి తక్కువ దేనికి అయ్యేది? కట్టబోయే తాటికి. తాడు అంటే పాశము అని సంస్కృతములో అర్థము. భగవంతుని బంధించుటకు తాడు సరిపోవలెనంటే ఆ అహంకార మమకారములు ఆయనకే అర్పించితే అప్పుడు తాడు సరిపోతుంది. ఆ పని చేసింది యశోదమ్మ మానసికముగా.
అంతే తాడు సరిపోయింది. సరిపోయింది అనుటకంటే కూడా సరిపుచ్చు విధముగా తాను తన శరీరమును అదుపు చేసినాడు. భావము భక్తి అన్నవే ఆయనకు కావలసింది. ఎప్పుడైతే నాది, నాది అన్న ఈ ‘నాదు’లన్నీ భగవద్ధ్యానమనే పాదులో విడిచి ఆ పరమాత్ముడనే కల్ప వృక్ష ఫలముకై మనసును పాదు కొలిపితే ఇక భక్తుని దైవాశ్రయమునకు ఏ ఆటంకమూ రాదు. అదే చేసింది యశోద. ధారణా అంటే దరించట పట్టుకొనుట సర్వకాల సర్వావస్థల యందు మదిలోనే మెదలుచుండుట. అట్లు మెదలినాడు కాబట్టే ఆమె పట్టుకోనుంది. ఇప్పుడు ధ్యేయము అంటే కృష్ణుడు దొరికినాడు. ఇక ఆయనను తన మనసులో అంటే రోటికి కట్టబెట్టింది. ఇక్కడ కూడా ఒక మాట చెప్పుకోవచ్చు. మనసు రోలు వంటిది. తలపులు మనసును స్థిమితముగా వుండనీక దంచుతూనే వుంటాయి. అట్లు జరుగకుండా ఆ పరమాత్మనే ఆ రోటికి కట్టివేసింది. కానీ కట్టె వరకు అదే ధ్యాస. ఆధ్యాసే ధ్యానము. ఆ ధ్యానము ఫలించింది కాబట్టి ఆయన కట్టబడినాడు. ఆయన కట్టబడి యున్నంత వరకు ఇక దంచుటకు వీలు లేదు కదా! భగవంతుని గూర్చిన ఈ తత్త్వము భక్తులకు గాక వేరెవరికి తెలుస్తుంది. వీనినే ధారణ, ధ్యానము అంటారు. ఇవి పతంజలి యోగ సూత్రములలో వస్తాయి.
కాస్త ఇపుడు పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము) అన్న విషయమును ఒక్కసారి స్పృశించి మనము తిరిగి కృష్ణ తత్వమునకు వెళదాము.
పేరే అష్టాంగ యోగము కావున ఇందులో 8 సూత్రములు ఉన్నాయి. వానిని గూర్చి అతి క్లుప్తముగా తెలుపుతాను.
- యమము : బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమము అన్న 10 యమము యొక్క అంగములని యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.
- నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అన్నవి నియమములు అని వేదాంత సారం చెబుతుంది. తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
- ఆసనం: ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తథా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)
- ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
- ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
- ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయ పద్మములో ధరించుట. ఇది మనో స్థితి. ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింత. ఇది సాధన, అంటే ప్ర=ముందునకు గతి = నడిపించేది. గమ్యము సమాధి. అహం బ్రహ్మ తత్త్వం అనుభవంలోనికి వచ్చే స్థితి.
- ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నము చేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.
- సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహన వచ్చి ఈ యోగము పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ మాటకొస్తే మనదేశములో ఇంచుమించు133 కోట్ల జనాభాలో కొన్ని వేల మంది అష్టాంగయోగ సాధకులు వుంటారేమో! కొన్ని లక్షలలో ఈ విషయమును గూర్చి తెలిసినవారుంటారేమో! ఊపిరి పీల్చి వదలమంటూ వేనకువేల డబ్బులు గుంజుతూ మన ఊపిరి తీసే యోగా కాదు. ఈ యోగము కనిపెట్టిన పతంజలి మహర్షి Patent చేసే స్వార్థమునకు వడికట్టియుంటే ఎన్ని లక్షల కోట్ల ధనము సంపాదించేవాడూ! నాటి మహనీయులకు విశ్వ శ్రేయస్సు ముఖ్యము. తమ స్వార్థము తప్ప వేరేమీ ముఖ్యము కాదు.
ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.
ఇక తిరిగీ కృష్ణ తత్వమునకు వద్దాము.
ఆవిధముగా కట్టివేయబడిన కృష్ణుడు తన పరిసరాలలో ఎవరూ లేరని తెలుసుకున్న పిదప ఆ రోలును కదిలించి పడవేసి ప్రక్క ప్రక్కన నిలబడి వున్నా మద్ది చెట్ల నడుమ నుండి దోగాడుతూ వెళ్ళినాడు. తానైతే దూరినాడు గానీ రోలు చెట్ల సందున రాలేక నిలబడి పోవుటతో కాస్త బలం ఉపయోగించినాడో ఏమో చెట్లు రెండూ విరిగి పడినాయి. కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులు శాపము తీరి నిజరూపములు ధరించి యా గోప కిశోరునికి నమస్కరించినారు. వారు మా బాహ్య, అంతరేంద్రియములన్ని ఆ పరాత్పరునికే అంకితమై ఉండాలని సవినయముగా నమస్కరించి శెలవు తీసుకున్నారు. దీనిని దామోదర లీల అంటారు. ఇప్పుడు అసలు దామోదర అంటే అర్థమేమిటో చూద్దాము.
'యశోదయా దామ్నా ఉదరే బద్ధ ఇతి దామోదరః'. దామము అంటే త్రాడు ఉదరము యశోదచే దామము తో కట్టబడినాడు అన్నది భాగవత అన్వయము. దమాది సాధనే నోదరా ఉత్కృష్టా మతిర్యాతయా గమ్యత ఇతి దామోదరః. దమాత్ దామోదరో విభుః ( భారతము - శాంతి పర్వము). దామములు అంటే లోకములు అని ఒక అర్థము. 'దామాని లోకనామాని తాని యస్యోదరాంతరే తేన దామోదరో దేవః శ్రీధరః పరికీర్తతః'. ఈయన మన దేహములోని వారుణ నాడిలో ఉంటాడు.! అసలు దామము అంటే తూడు ఉదరము నందు గలవాడు. కమల నాభుడు. ఇంత వ్యాఖ్యానము వుంది దామోదరుడంటే ! ఈ వివరణలు చాలు శ్రీకృష్ణుడు శ్రీ మహా విష్ణువు ఒకరే ననటానికి.
yashoda krishna |
మన శరీరము వ్రజ భూమి. ఈ వ్రజ భూమిలో గోవులున్నాయి, గోపాలకులూ వున్నారు, గోపికలూ వున్నారు. గోవిందుడూ వున్నాడు. కానీ ఒక్క గోవిందుని తప్పించి మిగతవన్నీ గుర్తుపడతాము. గోవులు అన్న మాటకు ఇంద్రియములు అన్న ఒక అర్థము వుంది. మరి ఈ ఇంద్రియములు అంటే గోవులు ఎవరిచేత నడుపబడుతూ వున్నాయి? ఈ గోవులను పాలించే వారు గోపాలకులు.
గోపాలకులు అంటే మన ఆలోచనలు. ఆలోచనల చేతనే కదా మన ఇంద్రియములు ప్రవర్తించేది. వీరి బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోనేవారు గోపికలు. అదే శరీరానికైతే మన ప్రాణములే గోపికలు. మరి ప్రాణములు లేకుంటే గోవులు లేవు గోపాలురు లేరు. ఇక మిగిలి పోయినవాడు గోవిందుడు. మొదట చెప్పిన మూడూ మనకు తెలుసు గానీ ఈ గోవిందుడు శరీరములో ఎక్కడున్నాడో మనము గుర్తించాము ఎందుకంటే మనము ప్రయత్నించము. వేదము నిర్ద్వంద్వముగా చెప్పింది ‘ పద్మకోశః ప్రదీకాశగుం హృదయంచా ప్యధోముఖం
అధౌ నిష్ట్యా వితః శాన్తిః నాభ్యాముపరితిష్టతి ......నీవార శూక మత్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా తస్యాయా శ్శిఖాయై మధ్యే పరమా2ఆత్మా వ్యవస్థితః’ అంటే ఆ గోవిందుడు గుండెకు దగ్గరలో వడ్లగింజ ముల్లు ప్రమాణములో నీలి రంగులో వెలుగుచున్న జ్యోతి యొక్క కొసన సూక్ష్మ బిందు రూపుడై విరాజిల్లుచున్నాడు. నేటి scientists దానిని sinus node అన్నారు. దీనిని వారు గత శతాబ్ది లో కనుగొనుట (1906 A.D.) జరిగినది. అది మన వేదముల యొక్క గొప్పదనము. కావున గోపాలునితో కూడిన గోకులమే ఈ శరీరము. ఆ కృష్ణుని మనము ప్రయత్నించి కనుగొంటే మన నివాసమే గోలోకమై పొతుంది. గోకులమన్న పేరులో ఎంత తత్త్వము ఇమిడియుందో గమనించండి.
ఇక ఒక్క మాట చాణూర ముష్టిక కంసుల గూర్చి కృష్ణ తత్వమును అన్వయించి చూద్దాము.
ఊరువులు అంటే తొడలు. తోడలలో శక్తి ఉంటుంది. అంటే చాణూరుడు శక్తికి సంకేతము. ఆ బాహ్య శక్తిని అణచి తనయందే అంతర్హితము చేసుకొన్నాడు. అదే విధముగా ముష్టికుడు. ముష్టి అంటే పిడికిలి. చేయి బలమునకు ప్రతీక. ఆ బలము అంతా బిగించిన పిడికిలి లో ఉంటుంది. ఆ బలమును సాధించి తన ఆధీనములో ఉంచుకొన్నాడు. బలరామ కృష్ణులను మనము విడిగా చూస్తున్నాము గానీ తత్త్వము ఒకటే. ఇక కంసుని విషయానికి వస్తే కంసము అంటే గిన్నె లేక పాత్ర. ఆంగ్లములో చెప్పుకోమనవలసి వస్తే DISC అని చెప్పుకోవలసి వస్తుంది. అంటే ఇది వృత్తాకారములో ఉంటుంది. కాలము అన్నది చక్రమే కదా! అదీ వృత్తాకారములో వుంటుంది. అంటే కంసుడు కాలానికి ప్రతీక. ఆ కాలాన్ని అదుపు జేసినవాడు కృష్ణ పరమాత్మ. అంటే ఆయనే కాలస్వరూపుడు. ఆయనే భూమిపై వుంటే వేరెవరైనా నేనే కాలము అనుట సాధ్యమౌతుందా!
మిగిలినది మరొకసారి.
కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునునిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు గీతను బోధించి, "విశ్వరూపాన్ని" చూపించి తద్వారా మానవాళికి తనను జేరు అనేకానేక మార్గములను అతి సులభముగా అర్థమౌలాగున ప్రసాదించినాడు.
ఈ కృష్ణ తత్వము అపండితుడనైన నేను చెబితేనే రోజుకో గంట ప్రకారము 10,15 రోజులు పట్టవచ్చు. ఇక పండితులు చెబితే ఎన్ని నెలలు పడుతుందో! అందువల్ల భగవద్గీత లో పరమాత్మ చెప్పిన ఈ శ్లోకము తరువాత ఇంకొక్క మాట చెప్పి నా ప్రసంగమును ముగించుతాను.
ఈ శ్లోకము సకలజన విదితమే!
అనన్యాః చింతయంతోమా ఏ జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ||
నిష్కామభావముతో నిరంతరము నన్ను తలచే భక్తుల యోగక్షేమములు స్వయంగా నేనే చూసుకొంటానన్నాడు పరమాత్మ. తన తత్వమును అరటిపండు వలచి చేతికిచ్చినట్లు చెప్పినాడు ఆయన. అయినా మనకు అర్థము కాదు. అర్థము చేసుకోన ప్రయత్నించము. అందకే పునరపి జననం పునరపి మరణం.
ఇక మాధ్యందిన మార్తాండుడై భీష్ముడు పరాక్రమింపగా అర్జునుడు చేత గాక చేతలుడిగి యుండగా కృష్ణుడు త్రివిక్రముడై భీష్ముని పై పరాక్రమింప తన చక్రము చేత బూని స్యందనము దిగినపుడు ఆయన ఏవిధముగా మన పోతనకు దర్శనమిచ్చినాడంటే ఈ పద్యమును తిలకించితే అర్థమౌతుంది.
కుప్పించి యెగసిన గుండలంబుల కాంతి
గగనభాగం బెల్ల గప్పికొనక
ఉరికిన నోర్వక నుదరంబులో నున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు దోతెంచి చనుదెంచు రయమున
బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు సింగంబు కరణి మెరసి
"నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు
ఈ పద్యంలో ఎంత లోతైన భావం ఉందో, ఎన్ని తాత్విక విశేషాలున్నాయో పరిశీలిస్తే అర్థమౌతుంది. శ్రీకృష్ణుడు రథం నొగలు మీదనుండి కుప్పించి క్రిందకి దూకినాడట. అప్పుడు ఆయన కుండలాల కాంతి ఆకాశమంతా కమ్మివేసిందట. ఇది కేవలం కవితామయమైన అతిశయోక్తి కాదు. ఇది స్వభావోక్తి. లలితాదేవి వేరేవ్వరో కాదు శ్రీమహావిష్ణువు యొక్క స్త్రీ రూపమే! పార్వతీదేవి యొక్క పుంరూపమే విష్ణువు. ఇందుకు ప్రమాణం లలితా సహస్రనామాలే. 'నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా' అనే నామాల్లో 'నారాయణీ' అనేపేరు ఈ ఏకత్వాన్నే సూచిస్తుంది. అంతే కాకుండా 'గోప్త్రీ గోవిందరూపిణీ' అని కూడా వుంది. "గోవిందుడు" అనే పేరు దశావతారాలలో ఒక్క శ్రీకృష్ణునికే వాడినారు. అందువల్ల లలితాదేవియే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే లలితాదేవి. ఆ జగన్మోహన సౌందర్యానికి కారణం ఈ సౌందర్యలహరియే.
లలితాదేవి కుండలాలు ఏ విధముగా ఉంటాయో సహస్రనామాల్లో స్పష్టంగా ఉంది. 'తాటంక యుగళీభూత తపనోడుప మండలా' అని అమ్మవారి కుండలాల్ని వర్ణించినారు. తపన మండలం అంటే సూర్య మండలం ఉడుప మండలం అంటే చంద్ర మండలం. సూర్యచంద్రుల కాంతి ఆకాశాన్ని కప్పివేయడం మనం అహర్నిశలూ చూస్తున్నదే. శ్రీకృష్ణుడు ఆ ఆదిపరాశక్తి యొక్క పుంరూపమే కాబట్టి ఆయన కుండలాల కాంతి కూడా గగనభాగమంతా కప్పి వేసిందని కవి అంతర్దృష్టితో చమత్కరించాడు. ఇదీ ఇందులోని తాత్వికత.
అదియట్లు వుంచితే రెండవ పాదంలో 'ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల అని వర్ణించటంలో మరో విశేషం ఉంది. క్రిందికి ఒక్కసారిగా దూకే సరికి, పరమాత్మ గర్భలో ఉన్న లోకాలు కదిలిపోయినాయట. ఆ బరువునకు, ఆ కుదుపునకు బయటి లోకం కూడా కదిలిపోతున్నట్లు వున్నదట. అంటే బయట వున్న లోకం పోను మిగిలిన పదమూడే లోపల ఉన్నాయా? ఈ అభిప్రాయం నవ్వు తెప్పించినా - బయటి లోకం ఏమిటి? లోపలి లోకాలేమిటి? అన్ని లోకాలు గర్భలో ఇమడ్చుకొన్న పరమాత్మ మళ్ళీ ఒక రూపం ధరించి ఉపాధిగతుడై తన లోపల ఉన్న లోకం లో తానే సంచరిస్తూ బయట ప్రత్యేకంగా సంచరిస్తున్నట్లు కనిపించటం ఏమిటి? - ఇవన్నీ సందేహాలే. ఈ సందేహాలు పోయి అద్వైత స్థితిని అవగాహన చేసుకుంటే తప్ప మోక్షం రాదు. మోక్షాన్ని పొందకుండా మామూలుగా చనిపోవడం, మరో జన్మ ఎత్తటం భీష్మునికి ఇష్టం లేదు. అందుకే చక్రాయుధుడు ఎత్తిన చక్రాన్ని వెనక్కి తీసేసుకున్నాడు.
beshma and krishna |
ఇది కూడా అలా ఉంచితే చివర ఎత్తుగీతిలో అసలు రహస్యం దాగి ఉంది. "మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు" అంటున్నాడు భీష్ముడు. అంటే 'నా బాణం దెబ్బలకు తట్టుకోలేక ఆయుధం పట్టాడని ' అర్థం. దీనికంటె కొంచెం ముందు పద్యంలో కూడా 'అని నా శస్త్రాహతిం జాల నొచ్చియు ' అనే అంటాడు. అంటే ఇన్నేళ్ళు అవివాహితునిగానే వున్నా , ఇంతింత ధర్మ నిర్వహణ చేసినా, ఇంత నిస్వార్థంగా బ్రతికినా ఇంకా ఈ గాంగేయునికి 'నేను,నాది, నా ప్రతిభ, నా శక్తి ' అనే భావాలు పోలేదు. ఎంతటి వారికైనా ఈ 'నేను ' పోతే తప్ప అసలు 'నేను ' ఏమిటో తెలియదు. పైగా ఆ అస్కలిత బ్రహ్మచారి ఆయుధం పట్టింది ఈ అవివాహితుని దెబ్బలకు తాళలేక కాదు. కేవలం 'కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాననే ' భీష్ముని ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం మాత్రమే ఆయన ఆయుధం పట్టుట జరిగింది. సైంధవుణ్ణి చంపుతాననే అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం మరోసారి చక్రం అడ్డువేసినాడు. మొత్తం మీద భక్తుల శపధం నెరవేరడం కోసం తన శపధాన్ని సైతం చుట్ట జుట్టి ప్రక్కన పెట్టినాడు ఆ భక్త రక్షకుడు. భక్తులు అంటే ఆయనకు అంత ప్రేమ. 'కౌంతేయా! ప్రతి జానీహి నమే భక్తః ప్రణశ్యతి ' అని భగవద్గీతలో తానన్న మాట ప్రకారం భక్తుల ప్రతిజ్ఞలను నెగ్గిచ్చి తానే ఓడిపోయి, భగవంతునిది "తల్లిప్రేమ" అని నిరూపించినాడు.
అటువంటి పరమాత్మ దర్శనం కావాలన్నా, మనలో ఆత్మ రూపంలో ఉన్న 'ఆయన ' సాక్షాత్కరించాలన్నా మనలో ఉన్న కృత్రిమమైన 'నేను, నాది ' తొలగిపోవాలి. అంతవరకు భీష్ముని కైనా అంపశయ్య, ఆవేదనా తప్పదు.
ఇపుడు జరిగే నెల ఆషాఢము. ఇది దాటుతూనే వచ్చేది శ్రావణము. శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి లేక బహుళ పక్ష శ్రీ కృష్ణ జన్మాష్టమి .పగలు సప్తమి ,సాయంత్రం అష్టమి వుంటే ఆరోజు జరపటం అలవాటు .సోమ ,బుధ వారం వస్తే చాలా పవిత్రం అని భావిస్తారు. ఆ రోజుల్లో అష్టమి తిథి తో పాటు రోహిణీ నక్షత్రం కూడా కలిస్తే మహామహిమ గల పర్వ దినం అవుతుంది . రోహిణీ నక్షత్రం కలిస్తే మహా పర్వ దినమని పద్మ పురాణం లో వుంది . అందరూ ఆనందముతో ఈ పండువును ఆచరించి అనంత సుఖసంతోష భోగ భాగ్యాలను పొందవలెనని ఆ ఘోష వల్లభుని ప్రార్థిస్తూ శెలవు తీసుకొనుచున్నాను.