లక్ష్మీదేవి |
శ్రావణ పూర్ణిమ - శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం!
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే!!
- శ్రావణ పూర్ణిమ జ్ఞానస్వరూపమని దేవీభాగవతం చెబుతోంది.
- మెుట్టమెుదట వేదములను లోకానికి శ్రీమహావిష్ణువు బ్రహ్మ ద్వారా ఇచ్చినటువంటి తిథి శ్రావణ పూర్ణిమ. శ్రావణమాసంలో అపూర్వ దినం శ్రావణ పూర్ణిమ.
- ఈ పూర్ణిమను - రక్షాబంధన్ పూర్ణిమ అని, హయగ్రీవ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని అంటారు.
శ్రావణ పూర్ణిమనాడే హయగ్రీవ అవతారం ఎత్తి వేదములను విఘ్ణవు సంరక్షించాడు, అందుకే హయగ్రీవ పూర్ణిమ అంటారు. హయగ్రీవుడు జ్ఞానానందస్వరూపుడు. పిల్లలు హయగ్రీవుని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది.
పూర్ణిమ నాడు హయగ్రీవ పటం కానీ, విగ్రహం కానీ పెట్టి పిల్లలతో పూజ చేయించాలి. హయగ్రీవ మంత్రాన్ని చెప్పించాలి. ఇలా చేయటం వల్ల పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది. మాతృ, పితృ భక్తి పెరుగుతుంది. పిల్లలు ఉత్తములుగా మారతారు.
ఈరోజు ఏడు తోరములను (ముడి) కలిగిన దారం తయారు చేసి గౌరీదేవి ముందు పెట్టాలి♪. యథాశక్తిగా పూజించాలి. పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ అయ్యాక స్త్రీ లు అయినా, పురుషులు అయినా కుడిచేతికి తోరమును కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల విజయం లభిస్తుంది. శత్రుబాధ తగ్గుతుంది.
ఈరోజు తప్పనిసరిగా జంధ్యం మార్చుకోవాలి. అందరూ గాయత్రీ జపం చేయాలి. ఉపనయనం లేని వారు, స్త్రీలు చేయటానికి దేవీభాగవతంలో శ్లోకం ఉంది. గాయత్రీ జపం వల్ల అనేక యజ్ఞములు, యాగములు, దానములు చేసిన ఫలితం లభిస్తుంది.
దేవీభాగవతంలోని శ్లోకం
యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్యయద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే ||
- ఈ రోజు ఒక్కసారి గాయత్రీ మంత్రం జపిస్తే వేయిసార్లు చేసిన ఫలితం దక్కుతుంది.
- ఈరోజు అందరూ వేదశ్రవణం చేయాలి.
- వేదపండితులకు దానం చేయాలి.
- ఈ పూర్ణిమ నాడు గౌరీదేవి కోకిలాదేవి అనే పేరుతో విహరిస్తుంది.
- గాయత్రీ సహస్రనామ స్తోత్రం చదవాలి. అమ్మవారిని కుంకుమతో పూజించి ప్రదక్షిణ చేయాలి. గురుపత్నికి గానీ లేదా ముత్తైదువకు కానీ చీర సమర్పించాలి.
- రక్షాబంధన్ పూర్ణిమ నాడు సోదరునికి, సోదరి హరినామాన్ని స్మరిస్తూ రక్షాబంధనం కట్టాలి.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీవిద్య గారు, కవయిత్రి రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)