రాఖీ |
రాఖీ పౌర్ణమి - Raksha Bandhan
రాఖీ అంటే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ''రాఖీ'' కట్టి, ''పది కాలాలపాటు చల్లగా ఉండాలని'' మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. అనుబంధం, ఆసరా - ఇవేగా జీవితంలో కావలసింది.
అసలు రాఖీ సంప్రదాయం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలీదు, కానీ ఈ ఆచారం అనాదిగా ఉందని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రక్షాబంధనం గురించి ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు చూడండి...
రాఖీ పౌర్ణమి ''బలేవా''
రాఖీ పౌర్ణమిని ''బలేవా'' అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెల పోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, భ్రాతృ ప్రేమతో ''ఏం కావాలమ్మా'' అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు.
ద్రౌపదీ శ్రీకృష్ణుల సోదర ప్రేమ
మహాభారతం ప్రకారం ద్రౌపదికి, వస్త్రాపహరణం సమయంలో, మహా రాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపద రాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచిస్తుంది.
రాణీ కర్ణావతి, హుమాయూన్ చక్రవర్తుల కథ
ఇంకో కథనాన్ని అనుసరించి, 1535లో రాణీ కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహద్దూర్ షా, చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణాన అయినా సుల్తాన్ దండెత్తిరావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణీ కర్ణావతి భయపడింది. బాగా ఆలోచించి, తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ చక్రవర్తే అని నమ్మింది. వెంటనే హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమాయూన్ మానసును గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోతపై దాడి చేశాడు. హుమాయూన్ కు విషయం అర్ధం అయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణీ కర్ణావతితో సహా 13 వేలమంది స్త్రీలను సుల్తాన్ చేర పట్టాడు. హుమాయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమాయూన్ చక్రవర్తి, గుజరాత్ సుల్తాన్ను ఓడించి, చిత్తూరు రాజ్యాన్ని రాణీ కర్ణావతి కొడుక్కు ఇప్పించాడు. హుమాయూన్ కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయింది.
రాఖీ సందర్భంగా మీ అందరికీ అభినందనలు