Raghavendra swamy |
తుంగాతీరం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. వేదభూమి మంత్రోచ్ఛారణలతో పులకించింది. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం ఆశేష భక్తజనంతో కిటకిటలాడింది.కర్నూలు జిల్లా ప్రముఖ ఆధ్యాతిక కేంద్రమైన మంత్రాలయంలో గురువారం మహారథోత్సవం కనుల పండువగా సాగింది.
రాఘవేంద్రుల ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పాఠశాల విద్యార్థులు వేద పఠనం చేస్తూ విశేష పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తి శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు విశేష పూజలు చేసి, వసంతోత్సవానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. మంగళవాయిద్యాలతో ఉత్సవమూర్తి మహారథం చెంతకు చేరుకున్నారు.
మహారథంపై విహారం
ఉత్సవమూర్తి మహారథం చేరుకోగా పీఠాధిపతి రథచక్రాలకు నారీకేళాలు సమర్పించి అర్చనలు చేశారు. ఉత్సవమూర్తితో మహారథం చుట్టూ ప్రదక్షిణలు చేసి మహారథంపై కొలువుంచారు. కొలువుదీరిన తరుణాన భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ స్మరణ చేసుకున్నారు. స్వామిజీ ప్రవచనం ముగియగానే భక్తులను ఆశీర్వచనం చేస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు రథోత్సవానికి అంకురార్పణ పలికారు. మంగళ వాయిద్యాలు, డప్పు దరువులు, రంగుల ఆటలు, బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాల మధ్య ఉత్సవం మధ్వ ద్వారం, ప్రధాన ముఖద్వారం మీదుగా రాఘవేంద్ర సర్కిల్ చేరుకుంది. అక్కడ స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మంత్రాలయం పురవీధుల్లో గంటన్నర పాటు రథయాత్ర సాగింది.