కృష్ణం వందే ప్రేమస్వరూపమ్ |
‘ధర్మసంస్థాపన ఆర్థికాభివృద్ధి సంభవామి యుగేయుగే’… శ్రీమన్నారాయణునిదివ్యమంగళ అవతార పరమార్థమిదే. శ్రీకృష్ణ అవతార తత్త్వమూ ఇదే. నల్లనయ్య దుష్ట శిక్షకుడు. శిష్ట రక్షకుడు. రాజనీతి నిపుణుడు. ఆయన లీలలు అద్భుతం. అసలు కృష్ణ తత్వమే ప్రేమమయం.
శ్రీకృష్ణుడి అవతారమంతా లీలామయమే. కన్నయ్య మథురలో కంసుడి చెరసాలలో పుట్టాడు. శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. కృష్ణపక్షం, స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా, ఆ రోజున కన్నయ్య జన్మించాడు కాబట్టి జన్మాష్టమిగా, అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా, యదువంశోద్భవుడు కనుక యదుకులాష్టమిగా కృష్ణాష్టమి పేరు పొందింది. కృష్ణాష్టమినాడు కన్నయ్యను ఆరాధిస్తే సకల శుభాలూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర భారతదేశమంతటా ఈ రోజున ఆవుదూడలనూ ప్రత్యేకంగా పూజిస్తారు.
ఇంట్లోకి చిన్ని కన్నయ్య!
తులసీదళాలంటే నల్లనయ్యకు మహాప్రీతి. ఒక్క తులసీదళానికే తుల తూగిన వాడు కదా! అందుకే ఈ రోజున వాటితో విశేషంగా అర్చిస్తారు. కృష్ణాష్టమి రోజున భక్తులంతా భగవద్గీతా పారాయణం చేస్తారు. చిన్ని చిన్ని తెల్లని బాల పాద ముద్రలను బయటి నుంచి ఇంటి లోపలికి వేసుకుంటారు. ఆ చిన్ని కృష్ణుడు అడుగులు వేసుకుంటూ తమ ఇంటికి వస్తాడని నమ్ముతారు. కొందరు మొదటగా తమ ఇంట్లోకి వచ్చిన చిన్నారిని బాలకృష్ణుడిగా భావించి పిండివంటలు తినిపిస్తారు. కొత్త వస్త్రాలు పెట్టి, పసుపు కుంకుమలతో ఆరాధించి, శ్రీకృష్ణుణ్నే పూజించినంతగా ఆనందపడతారు. ఎలాంటి భేదభావం లేకుండా దేశమంతటా ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను బాలకృష్ణుడిగా అలంకరించి మురిసిపోతారు.
ఉట్ల వేడుక
శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నల్లనయ్య పవళింపు సేవనూ విశిష్టంగా జరుపుతారు. బాలకృష్ణుణ్ని ఊయలలో పడుకోపెట్టి, హారతిచ్చి కీర్తనలు, జోలపాటలు పాడుతూ, భజన చేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటారు. శ్రీకృష్ణాష్టమి నాడు పరమాత్ముడికి ఇష్టమైన పరమాన్నం, పాలు, పెరుగు, వెన్నపూస, బెల్లం, మీగడ, జున్ను, పండ్లు, అటుకులు నివేదనగా సమర్పిస్తారు. స్వామికి వెన్నెల విహారం ఉల్లాసభరితం. అందుకే ఎక్కువగా రాత్రివేళలోనే అర్చనలు, నివేదనలు, భజనలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున విశిష్టమైంది ఉట్లపండుగ. అందనంత ఎత్తున ఉట్లు కట్టి పోటీ పడుతూ వాటిని కొడతారు. ‘‘పైకొని చూడరే వుట్ల పండుగ నేడు’’ అంటూ అన్నమయ్య ఒక కీర్తనలో ఈ వేడుకను మహోన్నతంగా వర్ణించాడు. శ్రీకృష్ణుడు పసి వయసులోనే ఎన్నో ఆపదలపాలయ్యాడని అష్టమిని కష్టాల తిథిగా చాలామంది భావిస్తుంటారు. ఇది సరికాదు. కష్టాలు, ఆపదలు ఎన్ని ఎదురైనా అధిగమించి రాక్షస సంహారం చేసి లోక కల్యాణాన్ని చేకూర్చాడు కన్నయ్య. అందువల్ల దేవదేవుడు పుట్టిన అష్టమి పుణ్య తిథే. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. దేవకీదేవికి నల్లనయ్య ఎనిమిదో సంతానం. పరమాత్మ జన్మతిథి ఎనిమిది. అలా ఎనిమిది శుభప్రదమైనదని, అష్టమ తిథి పవిత్రమైనదని చాలామంది భావిస్తారు.
చైతన్యానికి ప్రతీక
వేణువులో కణుపులు ఏడు ఉంటాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అజ్ఞానాలు. శ్రీకృష్ణుడు వేణువును ఊదుతూ ఆ ఏడింటినీ ఊదిపారేస్తాడు. భక్తులను జ్ఞానులుగా తీర్చిదిద్దుతాడు. అలాగే వేణువులోని రంధ్రాలు జ్ఞానేంద్రియాలు (కళ్లు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక), బుద్ధి, మనసులకు సంకేతాలు. పరమాత్మ వేణువూది వాటిని చైతన్యవంతం చేస్తాడు. నెమలి స్వేచ్ఛ, శాంతి, శుభం, పవిత్రతలకు చిహ్నం. నెమలి పింఛాన్ని తలమీద ధరించి వాటి ప్రాధాన్యాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. ‘కర్షతి చిత్తమితి కృష్ణః’.. చిత్తాన్ని ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు. తన సమ్మోహన శక్తితో గోపికావల్లభుడయ్యాడు. రాధామనోహరుడయ్యాడు. భక్తులకు చేరువయ్యాడు. శ్రీకృష్ణ తత్త్వం ప్రేమమయం. ప్రేమ స్వరూపుడు, మహోన్నత అనురాగాన్ని అందించేవాడు శ్రీకృష్ణుడు.
ప్రసిద్ధ క్షేత్రాలు
మథుర, ద్వారక, బృందావనం, ఉడుపి, పూరీ, గురువాయూరు, నెమలి, మొవ్వ, హంసలదీవి (కృష్ణాజిల్లా) శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రాలు. వారణాసిలో బిందుమాధవుడు, ప్రయాగలో వేణుమాధవుడు, పిఠాపురంలో కుంతీమాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవుడు, తిరువనంతపురంలో సుందర మాధవుడిగా వెలిశాడు. పంచ మాధవ మహా క్షేత్రాలివి. ‘సర్వం కరోతీతి కృష్ణః’.. అన్నింటినీ నిర్వహించేవాడు శ్రీకృష్ణుడు. నల్లనయ్య దుష్ట శిక్షకుడు. శిష్ట రక్షకుడు. శాంతి దూత. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. విజయ రథసారథి. గీతా బోధకుడు. సన్మార్గదర్శి. గ్రహ దోష నివారకుడు. భక్త వరదుడు. ఆపన్న శరణ్యుడు. జగద్గురువు. పరంజ్యోతి స్వరూపుడు. పరంధాముడు. అందుకే అంతా సభక్తికంగా ఆ స్వామికి ప్రణమిల్లుతారు