కృష్ణ తత్వం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ||
*అందంగా ,చిరునవ్వు తో, అందరికి ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడు వెనక ఎన్ని కష్టాలు*
*శ్రీకృష్ణుని జీవితం... దారుణమైన ముళ్ళబాట*
సుఖంగా, హాయిగా ఉన్నట్టు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు.
పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు.
కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు.
కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన.
అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా!
జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.
రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు ఆమె తండ్రియైన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయింది కృష్ణునికి.
చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.
తులసి దేవి మహత్యం అందరికి తెలియడం కోసం తులాభారం సన్నివేశం లో త్రాసులో కూర్చున్నాడు.
తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథి గా ఉండి తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు.
కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె!
కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు.
యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి.
చివరికి తన అవతారం చాలింపు కూడ ఎవరూ చూసేవాలు కూడ లేకండా ఒంటరిగానే ముగిసింది.
భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడినాడు.
ఎవరు ఎన్ని నిందలు వేసిన ధర్మ రక్షణ కొరకే తన జీవితాన్ని కొనసాగించాడు.
తన జీవితాన్ని తామరాకుపై నీటిబొట్టులాగా గడిపినాడు.
ధర్మరక్షణ కొరకు తాను చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని చూడలేదు.
ఆవేశం కాదు ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి.
నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం. కాని, కృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు.